మక్కా సమీపంలో హూతీల డ్రోన్ దాడి
ABN , Publish Date - Sep 17 , 2026 | 06:40 AM
సౌదీ అరేబియా, హూతీల మధ్య ఘర్షణలు మరింత తీవ్రమయ్యాయి. బుధవారం తెల్లవారుజామున మక్కా దక్షిణ ప్రాంతంలో హూతీలు ప్రయోగించినట్లు చెబుతున్న ఓ డ్రోన్‌ను సౌదీ గగనతల రక్షణ వ్యవస్థ గుర్తించి కూల్చివేసింది.
డ్రోన్‌ను కూల్చివేసినట్లు సౌదీ ప్రకటన
సౌదీ ఎఫ్-15ను కూల్చివేశామన్న హూతీలు
సనా, సెప్టెంబరు 16: సౌదీ అరేబియా, హూతీల మధ్య ఘర్షణలు మరింత తీవ్రమయ్యాయి. బుధవారం తెల్లవారుజామున మక్కా దక్షిణ ప్రాంతంలో హూతీలు ప్రయోగించినట్లు చెబుతున్న ఓ డ్రోన్‌ను సౌదీ గగనతల రక్షణ వ్యవస్థ గుర్తించి కూల్చివేసింది. అది పవిత్ర మక్కా ఉపరితలం పరిధిలోకి రాక ముందే నిర్వీర్యం చేసినట్లు సంకీర్ణ బలగాల కూటమి ప్రతినిధి తుర్కి ఆల్ మాలిక్ ప్రకటించారు. దీన్ని హూతీల ఉగ్రచర్యగా అభివర్ణించారు. అయితే మక్కా లక్ష్యంగా డ్రోన్ దాడికి పాల్పడ్డామన్న సౌదీ ప్రకటనను హూతీలు తోసిపుచ్చారు. మరోవైపు సౌదీకి చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ప్రకటించారు. యెమెన్‌లోని మారిబ్ గవర్నరేట్ (ప్రావిన్స్) ప్రాంతంలో దాడులకు యత్నించిన సమయంలో సౌదీ యుద్ధ విమానాన్ని.. స్థానికంగానే తయారు చేసిన ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణితో యెమెన్ సాయుధ దళాలు నేలకూల్చినట్టు హూతీ సైనిక ప్రతినిధి యాహ్య సరీ ప్రకటించారు. దీన్ని సౌదీ అరేబియా ధృవీకరించలేదు. అంతకుముందు 24 గంటల వ్యవధిలోనూ యెమెన్‌లోని ఐదు ప్రావిన్స్‌లపై సౌదీ సంకీర్ణ బలగాలు 52 వైమానిక దాడులు నిర్వహించినట్లు హూతీలు ఆరోపించారు. పవిత్ర మక్కా సమీపంలో డ్రోన్ దాడిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పౌరుల ప్రాణాలు, మౌలిక వసతులకు నష్టం కలిగించే, సౌదీ అరేబియా ప్రాదేశిక భూభాగంపై దాడులను ఖండిస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రకటించారు. మరోవైపు, హూతీలు-సౌదీ అరేబియా మధ్య ఘర్షణల నేపథ్యంలో అమెరికా తన పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. సౌదీ అరేబియాని లెవల్-3 రిస్క్ స్థాయికి మార్చింది. అంటే సౌదీ అరేబియా ప్రయణాన్ని పునరాలోచించుకోవాలని సూచించింది. ఇక యెమెన్‌కు ఇప్పటి వరకు ఉన్న లెవెల్-4 హెచ్చరికను కొనసాగించింది. అంటే యెమెన్‌కు ప్రయాణించొద్దని ఇది సూచిస్తుంది. ఇక, అమెరికా అధికారులు ఒమన్‌లో హూతీ ప్రతినిధులతో ఇటీవల రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలను లక్ష్యంగా చేసుకోబోమని ఈ సందర్భంగా హూతీలు హామీ ఇచ్చినట్లు సమాచారం.