Share News

Mauritius Seeks UNESCO Heritage: మారిషస్‌ రామ భజనలకు యునెస్కో హోదాకు ప్రయత్నం

ABN , Publish Date - Jan 08 , 2026 | 04:28 AM

మారిష్‌సలోని తెలుగువారి నోట 190 ఏళ్లుగా అలరారుతున్న రామ భజనలకు యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం తమ దేశ తెలుగు సాంస్కృతిక కేంద్రం ....

Mauritius Seeks UNESCO Heritage: మారిషస్‌ రామ భజనలకు యునెస్కో హోదాకు ప్రయత్నం

  • మారిషస్‌ తెలుగు వారి ఆత్మీయ సమావేశంలో వక్తలు

హైదరాబాద్‌ సిటీ, జనవరి7(ఆంధ్రజ్యోతి): మారిష్‌సలోని తెలుగువారి నోట 190 ఏళ్లుగా అలరారుతున్న రామ భజనలకు యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం తమ దేశ తెలుగు సాంస్కృతిక కేంద్రం ద్వారా ప్రయత్నిస్తున్నట్లు మారిషస్‌ తెలుగు మహాసభ అధ్యక్షుడు హెవిన్‌ గురయ్య తెలిపారు. ఆ దేశానికి రామ భజనలు ఎప్పుడు.. ఎలా వచ్చాయి? వాటి పరిణామంలో మార్పులు తదితర అంశాలపై మారిష్‌సలోని తెలుగు పండితులు వివిధ బృందాలుగా ఏర్పడి పరిశోధన చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాదికల్లా యునెస్కో వారసత్వ జాబితాలోకి రామభజనలు చేరేలా అవిరళ కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగుజాతి ట్రస్టీ, సీనియర్‌ పాత్రికేయురాలు, డీపీ అనురాధ నిర్వహణలో బుధవారం జూబ్లీహిల్స్‌లో మారిషస్‌ తెలుగువారితో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హెవిన్‌ గురయ్య మాట్లాడుతూ ఇప్పటికి ఏటా నవంబరు1న అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తూ ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని మారిష్‌సలో నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. మారిషస్‌ తెలుగు అధ్యాపకురాలు రాజు వంతి మాట్లాడుతూ తమ దేశంలోని మహాత్మాగాంధీ విశ్వ విద్యాలయంలో ఇతర భారతీయ భాషలతో పాటు డిగ్రీ స్థాయిలో తెలుగు కోర్సులు, కర్ణాటక సంగీతం, కూచిపూడితో పాటు మరికొన్ని సంగీత వాయిద్యాల శిక్షణ కోర్సులు నిర్వహిస్తున్న ట్లు వివరించారు. రామ భజనలకు ప్రపంచ వారసత్వ హోదా లక్ష్యంగా యునెస్కో దరఖాస్తుకు అవసరమైన డాక్యుమెంటేషన్‌ను తాను నిర్వహిస్తున్నట్లు రాజవంతి తెలిపారు.

Updated Date - Jan 08 , 2026 | 04:28 AM