Share News

ఇరాన్‌ పై భీకర దాడి

ABN , Publish Date - Mar 01 , 2026 | 02:51 AM

పశ్చిమాసియాలో యుద్ధ భేరి మోగింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్తంగా దాడులు ప్రారంభించాయి. పెద్ద సంఖ్యలో క్షిపణులతో విరుచుకుపడ్డాయి.

ఇరాన్‌ పై భీకర దాడి

  • 200 ఫైటర్‌ జెట్లతో క్షిపణుల వర్షం 201 మంది మృతి

  • విరుచుకుపడ్డ అమెరికా, ఇజ్రాయెల్‌

  • టెహ్రాన్‌, ఇతర కీలక ప్రాంతాల్లో క్షిపణుల వర్షం

  • 500 లక్ష్యాలపై ఏకకాలంలో దాడి

  • స్కూలుపై క్షిపణి.. 85 మంది పిల్లల మృతి

  • ఖమేనీ నివాసంపైనా దాడులు.. జాడ తెలియని నేత

  • ఆయన అల్లుడు, కోడలు మృతిచెందినట్టు వార్తలు

  • ఇరాన్‌ రక్షణ మంత్రి, సైన్యాధిపతి మృతి: ఇజ్రాయెల్‌

  • ఇరాన్‌ ప్రతిదాడులు.. ఇజ్రాయెల్‌పైకి భారీగా క్షిపణులు

  • యూఏఈ, ఖతార్‌, బహ్రెయిన్‌, కువైట్‌, సౌదీ దేశాల్లోని

  • అమెరికా స్థావరాలపైనా క్షిపణులు, డ్రోన్లతో దాడులు

  • అబుధాబి, దుబాయ్‌లలో ఇద్దరి మృతి

  • ఆపకపోతే తీవ్ర పరిణామాలు: ఇరాన్‌కు గల్ఫ్‌ హెచ్చరిక

  • హార్మూజ్‌ జలసంధి మూసివేత.. సంక్షోభంలో వాణిజ్యం

  • గల్ఫ్‌ గగనతలం మూసివేత.. స్తంభించిన విమానయానం

  • దుబాయ్‌ విమానాశ్రయంలో చిక్కుకున్న వేల మంది

  • చమురు ధరలకు రెక్కలు?

‘‘ఇరాన్‌ రివల్యూషనరీ గార్డులు, భద్రతా బలగాలు, పోలీసులకు ఒకటే చెబుతున్నా. మీరు ఆయుధాలను విడిచిపెట్టండి. అలా చేస్తే మీకు పూర్తి రక్షణ ఉంటుంది. లేకుంటే మృత్యువును చూడాల్సి వస్తుంది. ఇరాన్‌ క్షిపణుల పరిశ్రమను సమూలంగా ధ్వంసం చేస్తాం. నేవీని నామరూపాలు లేకుండా చేస్తాం.

- డొనాల్డ్‌ ట్రంప్‌

‘‘ఇరాన్‌ హంతక, ఉగ్రవాద పాలకుల చేతిలో అణ్వాయుధాలు ఉంటే మానవాళికే ముప్పు. ధైర్యవంతులైన ఇరాన్‌ ప్రజలు తమ భవిష్యత్తును చేతుల్లోకి తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ యుద్ధం పాలకులపైనే తప్ప, ఇరాన్‌ ప్రజలపై కాదు. నియంతృత్వాన్ని వదిలించుకొని శాంతి, స్వేచ్ఛాయుత ఇరాన్‌ను నిర్మించుకోండి.

- నెతన్యాహూ

ట్రంప్‌ అన్నంత పనీ చేశాడు! ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై క్షిపణులతో విరుచుకుపడ్డాడు! దాడుల్లో 85 మంది చిన్నారులు సహా 201 మంది మరణించారు! ఇజ్రాయెల్‌, అమెరికా దాడులకు ఇరాన్‌ దీటుగా స్పందించింది! ఇజ్రాయెల్‌తోపాటు ఆరు దేశాల్లోని అమెరికా వైమానిక స్థావరాలపై ఎదురు దాడి చేసింది! హర్ముజ్‌ జల సంధిని మూసివేసింది! దుబాయ్‌, అబుధాభి, బహ్రెయిన్‌లపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది! ప్రస్తుతం అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయి! ఫలితం.. పశ్చిమాసియా మొత్తం యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి! చమురు రవాణా సంక్షోభంలో చిక్కుకుంది! నిత్యం జన సమ్మర్థంగా ఉండే దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూతపడింది! వేలమంది చిక్కుకుపోయారు! గల్ఫ్‌ గగనతలంపై విమానాల రాకపోకలను నిషేధించారు! ఫలితంగా, విమాన ప్రయాణాలు స్తంభించాయి!


దుబాయ్‌/వాషింగ్టన్‌/టెల్‌ అవీవ్‌, ఫిబ్రవరి 28: పశ్చిమాసియాలో యుద్ధ భేరి మోగింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్తంగా దాడులు ప్రారంభించాయి. పెద్ద సంఖ్యలో క్షిపణులతో విరుచుకుపడ్డాయి. యుద్ధ విమానాలతోనూ కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. దీనితో ఇరాన్‌ కూడా ప్రతిదాడులకు దిగింది. అటు ఇజ్రాయెల్‌పై, ఇటు గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై పెద్ద సంఖ్యలో క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించింది. తమ దేశాల్లోని ప్రాంతాలపై ఇరాన్‌ దాడులను ఖతార్‌, బహ్రెయిన్‌, కువైట్‌, సౌదీ, యూఈఏ తీవ్రంగా ఖండించాయి. ఇరాన్‌ దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాయి. దీనితో పశ్చిమాసియా ప్రాంతమంతా అట్టుడుకుతోంది. శనివారం రాత్రి కూడా ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ క్షిపణులు, యుద్ధ విమానాలతో దాడులు కొనసాగించడం.. అటు ఇరాన్‌ కూడా ఇజ్రాయెల్‌, గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతుంటంతో.. ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. మరింత ఉధృతంగా దాడులు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు అమెరికా రక్షణ వర్గాలు శనివారం రాత్రి వెల్లడించాయి.

అటు చర్చలు అంటూనే ఇటు దాడులు..

ఇరాన్‌ అణుశుద్ధిని పూర్తిగా నిలిపివేయాలని, క్షిపణుల సామర్థ్యాన్ని తగ్గించుకోవాలని అమెరికా డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇరాన్‌ ఒప్పందానికి రావాలని, లేకుంటే దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పలుమార్లు హెచ్చరించారు కూడా. ఈ క్రమంలో ఒమన్‌ మధ్యవర్తిత్వంతో స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఇరాన్‌-అమెరికా మధ్య మూడు దఫాలుగా చర్చలు కూడా జరిగాయి. గురువారం జరిగిన చర్చల అనంతరం అణుశుద్ధి విషయంలో ఇరాన్‌ దిగివస్తోందని, పశ్చిమాసియాలో పరిస్థితులు చక్కబడతాయని కూడా వార్తలు వెలువడ్డాయి. కానీ దీనిపై తాను అంత సంతృప్తిగా లేనని ట్రంప్‌ శుక్రవారం పేర్కొన్నారు. అన్నట్టుగానే శనివారం ఉదయమే ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్తంగా శనివారం ఉదయం 9.30 గంటల సమయంలో ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌తోపాటు 30 కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులను ప్రయోగించాయి. ఇరాన్‌ క్షిపణి ప్రయోగ వ్యవస్థలు, మిలటరీ స్థావరాలతోపాటు ప్రభుత్వాధినేతలు, మిలటరీ ఉన్నతాధికారులు లక్ష్యంగా యుద్ధ విమానాలతోనూ ఏకకాలంలో దాడులు చేశాయి. ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’ పేరుతో అమెరికా, ‘ఆపరేషన్‌ లయన్‌ రోర్‌ (సింహ గర్జన)’ పేరుతో ఇజ్రాయెల్‌ ఈ ఆపరేషన్‌ చేపట్టాయి. దీనితో ఇజ్రాయెల్‌తోపాటు పశ్చిమాసియాలోని అన్ని అమెరికా స్థావరాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌ దాడులు చేపట్టింది.


ఖమేనీ సురక్షితమే!

అమెరికా దాడికి దిగవచ్చనే అంచనాల మేరకు ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయతొల్లా ఖమేనీని ముందుగానే భద్రమైన రహస్య ప్రదేశానికి తరలించినట్టు ఆ దేశ అధికార వర్గాలు వెల్లడించాయి. అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌ కూడా సురక్షితంగానే ఉన్నట్టు తెలిపాయి. అయితే ఖమేనీ అల్లుడు, కోడలు మృతి చెందినట్టు పేర్కొన్నాయి. కాగా, తమ దాడుల్లో ఇరాన్‌ రక్షణ మంత్రి అజీజ్‌ నసీర్‌, ఐఆర్‌జీసీ మిలటరీ కమాండర్‌ మహమ్మద్‌ పాక్‌పోర్‌ మృతిచెందినట్టు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. దీనిని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ ఖండించారు. తమ రక్షణ మంత్రి, ఉన్నతాధికారులు క్షేమంగా ఉన్నట్టు తెలిపారు.

ఇరాన్‌ దాడులు ఆపకుంటే తీవ్ర పరిణామాలు: గల్ఫ్‌ దేశాల హెచ్చరిక

తమ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడులు తమ సార్వభౌమత్వాన్ని సవాలు చేయడమేనని ఖతార్‌, యూఏఈ, సౌదీ, బహ్రెయిన్‌ తదితర దేశాలు హెచ్చరించాయి. దాడులు ఆపకుంటే ఇరాన్‌ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాయి. ఇరాన్‌ ప్రయోగిస్తున్న క్షిపణులను తమ రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయని పేర్కొన్నాయి. ఈ దేశాలన్నీ తమ గగనతలాన్ని మూసేశాయి. పరిస్థితి చక్కబడే వరకు పౌరులెవరూ ఇళ్లలోంచి బయటికి రావొద్దని హెచ్చరించాయి.

వేదన కలిగించాయి: ఒమన్‌ మంత్రి

అమెరికా-ఇరాన్‌ మధ్య చర్చల్లో మధ్యవర్తిత్వం వహిస్తున్న ఒమన్‌ విదేశాంగ మంత్రి బద్ర్‌ అల్‌బుసైదీ తాజా పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో మూడు దశలుగా ఈ చర్చలు జరిగాయి. అవి పురోగతిలో ఉన్నట్టు అల్‌బుసైదీ గురువారం ప్రకటించారు కూడా. ఇలాంటి సమయంలో అమెరికా దాడులు చేపట్టడం ఆవేదన కలిగించాయని ఆయన శనివారం పేర్కొన్నారు. చర్చలు కీలక దశకు చేరుకుంటున్న సమయంలో అమెరికా దాడితో అంతా నిష్ఫలమైపోయిందని పేర్కొన్నారు. పరిస్థితి మరింత దిగజారకుండా అమెరికా వెంటనే దాడులు ఆపేయాలని అల్‌ బుసైదీ విజ్ఞప్తి చేశారు.


ఒమన్‌పై దాడి చేయని ఇరాన్‌!

గల్ఫ్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌లోని అన్ని అరబ్‌ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై క్షిపణులు ప్రయోగించిన ఇరాన్‌.. ఒక్క ఒమన్‌పై మాత్రం ఎలాంటి దాడి చేయలేదు. చాలా కాలం నుంచి ఇరాన్‌కు, ఇతర దేశాలకు మధ్యవర్తిగా ఒమన్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం జెనీవాలో జరుగుతున్న అమెరికా-ఇరాన్‌ చర్చల్లోనూ ఒమన్‌ మధ్యవర్తిగా ఉంది.

హార్మూజ్‌లో నిలిచిన రాకపోకలు

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో హార్మూజ్‌ జలసంధిలో రాకపోకలపై ప్రభావం పడింది. జల సంధిలో ప్రయాణాలను నిలిపివేయాలని ఇరాన్‌ రెవెల్యూషనరీ గార్డ్స్‌ హెచ్చరించినట్టు వాణిజ్య నౌకలను నిర్వహించే సంస్థలు తెలిపాయి. దీనితో చమురు సహా ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం పడనుంది. అయితే జల సంధిని మూసివేస్తున్నట్టు ఇరాన్‌ అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు హర్మూజ్‌ జలసంధి, అరేబియా సముద్ర ఉత్తర ప్రాంతానికి దూరంగా ఉండాలని అమెరికా రవాణా శాఖ వాణిజ్య నౌకలకు సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లోని అమెరికా నౌకలకు కనీసం 30 నాటికల్‌ మైళ్లకుపైగా దూరంలో ఉండాలని, లేకుంటే శత్రునౌకలుగా భావించి, చర్యలు చేపట్టే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

సంయమనం పాటించండి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల నేపథ్యంలో భారత్‌ స్పందించింది. పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిణామాలపై విదేశాంగ మంత్రి ఎస్‌. జై శంకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్‌ విదేశాంగ మంత్రి అరాగ్చీ, ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రి గిడియాన్‌ సార్‌తో జై శంకర్‌ ఫోన్లో మాట్లాడారు. సంయమనం పాటించాలని, చర్చలు, దౌత్యం ద్వారా ఉద్రిక్తతలను తగ్గించుకుని, సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.


ఖమేనీ నివాసానికి సమీపంలో పేలుడు

టెహ్రాన్‌లోని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయతొల్లా ఖమేనీ నివాసం, ప్రధాన కార్యాలయం సమీపంలోనే తొలి క్షిపణి దాడి జరిగింది. తర్వాత ఆ దేశ సైన్యం ఇస్లామిక్‌ రెవెల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) ప్రధాన కార్యాలయానికి సమీపంలో భారీ పేలుళ్లు జరిగాయి. అనంతరం ఏకకాలంలో టెహ్రాన్‌లోని మరికొన్ని ప్రాంతాలతోపాటు కీలకమైన తబ్రిజ్‌, ఇస్ఫహాన్‌ పట్టణాలు, బుషెహర్‌, మినాబ్‌లలోని ఇరాన్‌ నౌకాదళ స్థావరాలు, మరికొన్ని చోట్ల కూడా భారీగా క్షిపణి దాడులు జరిగాయి. కీలకమైన చబహార్‌ పోర్టు వద్ద కూడా భారీగా పేలుళ్లు జరిగాయి. శనివారం ఉదయం కాసేపు దాడులు చేసి ఆపేసిన అమెరికా, ఇజ్రాయెల్‌ రాత్రికి మళ్లీ దాడులు ప్రారంభించాయి. ఇరాన్‌ మిలటరీ బలానికి కీలకమైన క్షిపణి ప్రయోగ వ్యవస్థలను ధ్వంసం చేయడంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాయి. కాగా, చరిత్రలోనే తొలిసారిగా ఒకేసారి 200 యుద్ధ విమానాలతో దాడులు చేశామని, 500కుపైగా లక్ష్యాలను ఛేదించామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఇరాన్‌ క్షిపణి రక్షణ వ్యవస్థలు, లాంఛర్లను ధ్వంసం చేసి.. తర్వాతి దాడులకు మార్గం సుగమం చేశామని తెలిపింది.

పాఠశాలపై క్షిపణి దాడితో 85 మంది మృతి

ఇరాన్‌లోని మినాబ్‌లో బాలికల పాఠశాలపై క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనలో చిన్నారులు సహా 85 మంది మరణించినట్టుగా ఇరాన్‌కు చెందిన టాస్నిమ్‌ వార్తా సంస్థ ప్రకటించింది. మినాబ్‌లో ఇరాన్‌ కీలక మిలటరీ స్థావరం ఉంది. శనివారం ఉదయం దానిపై దాడి చేసిన ఇజ్రాయెల్‌.. క్షిపణి రక్షణ వ్యవస్థలు, రాడార్లను ధ్వంసం చేసింది. అయితే పాఠశాలపై దాడి అంశాన్ని పరిశీలిస్తున్నామని, సాధారణ పౌరులకు నష్టం జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలని బలగాలకు సూచించామని యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ శనివారం రాత్రి వెల్లడించింది. ఇక అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ వ్యాప్తంగా 201 మంది చనిపోయారని, 747 మంది గాయపడ్డారని ఇరాన్‌ రెడ్‌ క్రిసెంట్‌ సొసైటీ ప్రకటించింది.

Updated Date - Mar 01 , 2026 | 02:56 AM