ఏఐ పనితీరు.. ప్చ్!
ABN , Publish Date - Jul 06 , 2026 | 03:02 AM
కృత్రిమ మేధ(ఏఐ) శక్తిసామర్థ్యాలను అతిగా నమ్ముకొని ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తున్న కంపెనీల పరిస్థితి.. ‘మబ్బుల్లో నీళ్లు చూసి ముంతలో ...
ఏఐ ఏజెంట్లు మేం అనుకున్నంత వేగంగా పురోగతి సాధించలేదు: జుకెర్‌బర్గ్
న్యూయార్క్, జూలై 5: కృత్రిమ మేధ(ఏఐ) శక్తిసామర్థ్యాలను అతిగా నమ్ముకొని ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తున్న కంపెనీల పరిస్థితి.. ‘మబ్బుల్లో నీళ్లు చూసి ముంతలో నీళ్లు ఒలకబోసిన’ చందంగా మారుతోంది! ఏఐ పనితీరు తాము ఆశించిన స్థాయిలో లేదంటూ ఫోర్డ్ కంపెనీ ఇటీవలికాలంలో 350 మందికిపైగా పాత సిబ్బందిని ఉద్యోగంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా.. కంపెనీ పునర్వ్యవస్థీకరణ పేరుతో ఈ ఏడాది మొదట్లో 8000 మంది ఉద్యోగులను తొలగించిన ఫేస్‌బుక్ మాతృసంస్థ ‘మెటా’ సీఈవో జుకెర్‌బెర్గ్ కూడా ఇప్పుడు అదే మాట చెబుతున్నారు. ఏఐ ఏజెంట్లు తాము అనుకున్నంత వేగంగా పురోగతి సాధించలేదన్నారు. ఈ సంవత్సరం ఆరంభంలో ఆ సంస్థ తన మొత్తం సిబ్బంది(గ్లోబల్ వర్క్‌ఫోర్స్)లో 10 శాతాన్ని (8000 మందిని) తొలగించడంతోపాటు.. మరో 7 వేల మందిని ఏఐ విభాగాల్లోకి మెటా బదిలీ చేసింది. కానీ.. తాము చేపట్టిన ఈ భారీ పునర్వ్యవస్థీకరణ ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని.. సంస్థలోని టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఏఐ ఏజెంట్ల వేగాన్ని తప్పుగా అంచనా వేశారని జుకెర్‌బెర్గ్ పేర్కొన్నారు.