Share News

థ్యాంక్యూ ఇండియా!

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:21 AM

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ భారత్‌లో తన మూడు రోజుల పర్యటనను ముగించుకుని తిరుగు పయనమయ్యారు. తన పర్యటనపై...

థ్యాంక్యూ ఇండియా!

  • 3రోజుల భారత్‌ పర్యటనపై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20 : ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ భారత్‌లో తన మూడు రోజుల పర్యటనను ముగించుకుని తిరుగు పయనమయ్యారు. తన పర్యటనపై ‘థ్యాంక్యూ ఇండియా’ అంటూ ఆయన స్పందించారు. ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో పాలుపంచుకోవడంతోపాటు ప్రధాని మోదీతో మెక్రాన్‌ కీలకమైన ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ వివరాలు ‘ఎక్స్‌’లో పంచుకున్నారు. ఈ పర్యటనలో తాను పాల్గొన్న సమావేశాల వీడియోలను ఈ పోస్టుకు జత చేశారు. నమస్తే అంటూ ఆ పోస్టును ప్రారంభించిన ఆయన, తనను భారత్‌ గొప్పగా స్వాగతించిందంటూ సంతృప్తిని వ్యక్తం చేసింది. చివరిసారిగా 2024లో భారత్‌లో తాను చేసిన పర్యటనను గుర్తుచేసుకుంటూ, మోదీ నేతృత్వంలో జరిగిన ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో పాల్గొనడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని వ్యాఖ్యానించారు. డిజిటల్‌ భారత్‌ను చూస్తున్నానన్న ఆయన, దశాబ్దకాలంలోనే ఇంత పరివర్తనను భారత్‌ సాధించిందని ప్రశంసించారు. ‘‘పదేళ్ల క్రితం ఒక వీధి వ్యాపారికి బ్యాంకు ఖాతా తెరవడం తెలిసేది లేదు. సొంత చిరునామా లేని అతడికి ఖాతాను ఎలా తెరవాలో, దానికి ఎటువంటి పత్రాలు సమర్పించాలనేది తెలియదు. ఇప్పుడు అదే వీధి వ్యాపారి ఫోన్‌ పే ద్వారా చెల్లింపులను స్వీకరిస్తున్నాడు’’ అని తెలిపారు. భారత్‌లో140 కోట్లమంది డిజిటల్‌తో అనుసంధానమై ఉన్నారని, ప్రతి నెల 200 కోట్ల లావాదేవీలు డిజిటల్‌ మాధ్యమంలో జరుగుతున్నాయని, 50 కోట్ల డిజిటల్‌ హెల్త్‌ ఐడీ కార్డులు చెలామణిలో ఉన్నాయన్నారు. ప్రపంచంలో ఏ దేశానికీ సాధ్యం కాని అద్భుత పరివర్తన ఇదంటూ మెక్రాన్‌ కొనియాడారు. ఏఐ సమ్మిట్‌ సందర్భంగా గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌తో జరిగిన భేటీని ఆయన గుర్తు చేసుకున్నారు.

Updated Date - Feb 21 , 2026 | 12:21 AM