Supreme Leader Khamenei: రష్యాకు పారిపోవడానికి ఖమేనీ ప్లాన్!
ABN , Publish Date - Jan 08 , 2026 | 03:13 AM
ఇరాన్‌లో ఆందోళనలు మరింత తీవ్రమైతే ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ దేశాన్ని వీడి వెళ్లిపోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని టైమ్స్ కథనం పేర్కొంది.
దుబాయ్, జనవరి 7: ఇరాన్‌లో ఆందోళనలు మరింత తీవ్రమైతే ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ దేశాన్ని వీడి వెళ్లిపోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని టైమ్స్ కథనం పేర్కొంది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ నివేదికను ఉటంకిస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ కథనం ప్రకారం.. ఇరాన్‌లో ఆందోళనలను సైన్యం అదుపులోకి తీసుకురాలేదని, సాధ్యం కాదని భావించిన మరుక్షణమే ఖమేనీ(86) తన కుటుంబంతో పాటు సన్నిహితులైన దాదాపు ఇరవై మందితో దేశాన్ని వీడి వెళ్లడానికి ప్రణాళిక వేసుకున్నారు. ఆయన రష్యాకు వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు, ఆందోళనకారులపై హింసాత్మక విధానాలను అవలంబిస్తే జోక్యం చేసుకుంటామన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆమిర్ హతామీ తీవ్రంగా స్పందించారు. అవసరమైతే ఇరానే ముందు జాగ్రత్తగా సైనిక చర్య చేపడుతుందన్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి ఆయన ఈ హెచ్చరిక చేశారు. ఇరాన్ సైన్యం గతేడాది జూలైలో ఇజ్రాయెల్‌తో జరిగిన 12రోజుల యుద్ధం నాటికన్నా మరింత సమర్థంగా, సంసిద్ధంగా ఉందని ఆమిర్ అన్నారు. ఇదిలా ఉండగా, ధరల పెరుగుదల నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం నిత్యావసరాల కొనుగోలు కోసం ఆ దేశ పౌరులకు నెలకు 7డాలర్ల చొప్పున సబ్సిడీని ప్రకటించింది. కుటుంబ పెద్దల బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేస్తోంది. దీనివల్ల 7.1కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి వెళ్లరాదని, అక్కడ ఉన్న తమ పౌరులు జాగ్రత్తగా ఉండాలని పలు దేశాలు సూచిస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా కూడా తమ పౌరులకు అలాంటి సూచనే చేసింది. ఇరాన్‌లో ఉన్న ఆస్ట్రేలియా పౌరులు వెంటనే తిరిగి వచ్చేయాలని కోరింది. భారత్ కూడా ఈ మేరకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.