ఖమేనీ అంత్యక్రియలు ప్రారంభం
ABN , Publish Date - Jul 05 , 2026 | 05:59 AM
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసిన దాడుల్లో ...
ప్రజల సందర్శనార్థం టెహ్రాన్‌లో ఆయన పార్థివదేహం
టెహ్రాన్, జూలై 4: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసిన దాడుల్లో ఖమేనీతోపాటు ఆయన కుటుంబసభ్యులు పలువురు మరణించారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఖమేనీ అంత్యక్రియలను ఇన్నాళ్లూ నిర్వహించలేదు. ఇస్లాం ఆచారాలకు అనుగుణంగా ఎలాంటి రసాయనాలు పూయకుండా, మత పెద్దల అనుమతితో ఇరాన్ ప్రభుత్వం ఖమేనీ భౌతికకాయాన్ని దాదాపు నాలుగు నెలలుగా కోల్డ్ స్టోరేజీలో భద్రపరిచింది. ప్రస్తుతం పరిస్థితులు కొంత సాధారణ స్థితికి రావడంతో అంత్యక్రియలను ప్రారంభించింది. అంత్యక్రియల్లో భాగంగా తొలి రోజు శనివారం.. ఖమేనీ భౌతికకాయాన్ని భద్రపరిచిన శవపేటికను దేశ రాజధాని టెహ్రాన్‌లోని గ్రాండ్ మోసల్లా మసీదులో ప్రజల సందర్శనార్థం ఉంచింది. ఖమేనీ పార్థివ దేహాన్ని ఇరాన్ జాతీయ పతాకంతో కప్పి ఉంచారు. ఖమేనీతో పాటు మరణించిన 14 నెలల వయస్సున్న ఆయన మనవరాలితోపాటు ఇతర కుటుంబసభ్యుల శవపేటికలను కూడా పక్కనే ఉంచారు. ఖమేనీకి నివాళులర్పించేందుకు లక్షలాది ప్రజలు తరలివచ్చారు. వారంతా ఎర్ర జెండాలు పట్టుకొని ‘‘డెత్ ఆఫ్ అమెరికా’’ అనే నినాదాలు చేసినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. ఖమేనీ అంత్యక్రియల్లో ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ భద్రతా కారణాల వల్ల పాల్గొనలేదు. ఖమేనీ పార్థివ దేహాన్ని ఆయన స్వస్థలం ఇరాన్‌లోని మషద్ పట్టణంలో ఈ నెల 9న ఖననం చేయనున్నారు. మరోవైపు, ‘‘మేము మంచివాళ్లం కాబట్టి అంత్యక్రియల కోసం వీకా్‌ఫ(సెలవు) ఇచ్చాం’’ అని ఓ కార్యక్రమంలో ట్రంప్ ఇరాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.