కుప్పకూలనున్న అమెరికా సామ్రాజ్యం
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:08 AM
అమెరికా సామ్రాజ్యం పతనం దిశగా పయనిస్తోందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ చివరిసారిగా వ్యాఖ్యానించారు.
సగం మంది అమెరికన్లకు ట్రంప్ అంటే ఇష్టమే లేదు
ఇరాన్‌ను ఏమీ చేయలేరు.. చివరి ప్రసంగంలో ఖమేనీ
టెహ్రాన్, మార్చి 1: అమెరికా సామ్రాజ్యం పతనం దిశగా పయనిస్తోందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ చివరిసారిగా వ్యాఖ్యానించారు. జీవితంలో చివరిసారిగా చేసిన బహిరంగ ప్రసంగంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆయన మరణించిన అనంతరం చివరి ప్రసంగానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 1978లో జరిగిన తబ్రిజ్ విప్లవం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి 17న తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లో ఆయన చివరిసారిగా ప్రసంగించారు. ఈ ప్రసంగంలో అమెరికాను, ట్రంప్‌ను ఘాటుగా విమర్శించారు. ‘‘అమెరికా గురించి కొన్ని మాటలు చెప్పాలి. ఆ దేశ వ్యవస్థ నిజంగా పతనమవుతోంది. కుప్పకూలే దిశగా ఆ సామ్రాజ్యం పయనిస్తోంది. నిజంగా ఆ సామ్రాజ్యం కుప్పకూలుతుంది. వారి ఆర్థిక వ్యవస్థలో చాలా సమస్యలు ఉన్నాయి. విధానాల పరంగా, సమాజంలోనూ సమస్యలు ఉన్నాయి. ప్రస్తుత అధ్యక్షుడిని సగం మంది అమెరికన్లు ఆమోదించడం లేదు’’ అని వ్యాఖ్యానించారు. ఇరాన్-అమెరికా సంబంధాలపై ఖమేనీ మాట్లాడుతూ ‘‘ఇరాన్‌ను మింగేయాలని అమెరికా భావిస్తోంది. అది జరగకుండా ఇస్లామిక్ రిపబ్లిక్ అడ్డుపడుతోంది. ఇస్లామిక్ రిపబ్లిన్‌ను గత 47 ఏళ్లుగా అమెరికా నిర్మూలించలేకపోయిందని సాక్షాత్తూ అధ్యక్షుడే అన్నారు. అమెరికా నాయకులు ఏమీ చేయలేకపోయారని ఆయనే ఫిర్యాదు చేస్తున్నారు. ఆ అంగీకారం వాస్తవమైనదే. నేనొక మాట చెబుతున్నా.. ‘మీరు కూడా ఏమీ చేయలేరు’. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌ను నిర్మూలించలేరు’’ అని అన్నారు. దీర్ఘకాలిక యుద్ధం సంభవిస్తే నిలబడే సామర్థ్యం అమెరికాకు లేదని ఖమేనీ చెప్పారు. ‘‘ప్రపంచంలో అత్యంత బలమైన మిలటరీ శక్తి అని చెప్పుకొంటున్నప్పటికీ కొన్ని సార్లు కిందపడితే తిరిగి లేవలేదు’’ అని విమర్శించారు. సుప్రీం లీడర్ మరణించినట్టు ట్రంప్ ప్రకటించిన అనంతరం ఖమేనీ అధికారిక ఎక్స్ ఖాతాలో పర్షియన్ భాషలో మెసేజ్ దర్శనమిచ్చింది. ఆయనను హైదర్ అని కీర్తించారు. షియా ఇస్లాంలో మొదటి ఇమాం.. ‘హైదర్’ కావడం గమనార్హం.