Share News

ఉషా తెగ గురించి అమ్మ ఆరా!

ABN , Publish Date - Jun 20 , 2026 | 04:02 AM

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తన వైవాహిక జీవితంలోని ఓ ఆసక్తికర ఘట్టాన్ని పంచుకున్నారు. పెళ్లికి ముందు తన భార్య ఉషాకు చెందిన భారతీయ మూలాల గురించి...

ఉషా తెగ గురించి అమ్మ ఆరా!

  • ‘ఇండియన్‌’ అంటే అర్థంకాక తికమక పడ్డారు

  • ఉషాతో పరిణయంలోని ఆసక్తికర అంశాన్ని

  • పంచుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌

వాషింగ్టన్‌, జూన్‌ 19: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తన వైవాహిక జీవితంలోని ఓ ఆసక్తికర ఘట్టాన్ని పంచుకున్నారు. పెళ్లికి ముందు తన భార్య ఉషాకు చెందిన భారతీయ మూలాల గురించి చెప్పగా, ‘ఆమెది ఏ తెగ?’ అని తన తల్లి ప్రశ్నించినట్టు జేడీ వాన్స్‌ గుర్తు చేసుకున్నారు. ప్రపంచంలోని భిన్న సంస్కృతుల గురించిన అవగాహన లేకపోవడంతో ఆమె తొలుత తికమక పడ్డారని తెలిపారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో పుట్టి పెరిగిన ఉషా వాన్స్‌ పూర్వీకులది ఆంధ్రప్రదేశ్‌ అనేది తెలిసిందే. ఓ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో వాన్స్‌ తన పెళ్లికి ముందు జరిగిన కొన్ని సంగతులు గుర్తుచేసుకున్నారు. ‘‘ఉష గురించి చెప్పినప్పుడు మా అమ్మ తొలి స్పందన.. ‘ఆమె జాతి ఏమై ఉంటుంది?’ అని. ఆమె ఇండియన్‌ అని నేను చెప్పగా, ‘ఏ తెగ ఆమెది?’ అని మా అమ్మ ఆరా తీసింది. వారిద్దరూ వేర్వేరు ప్రపంచాల నుంచి వచ్చినవారు కావడమే దీనికి కారణం. అంతేగానీ, ఇతర సంస్కృతులను, తెగలను తక్కువ చేసే ఉద్దేశం మా అమ్మకు లేదు’’ అని వాన్స్‌ తెలిపారు. ‘కమ్యూనియన్‌-ఫైండింగ్‌ మై వే బ్యాక్‌ టూ ఫేయిత్‌’ అనే పేరుతో వాన్స్‌ పుస్తకం రచించారు. క్యాథలిక్‌ మతంలోకి మారడం తన జీవితాన్ని ఎలా మార్చివేసిందనేది ఈ పుస్తకంలో ఆయన వివరించారు. పుస్తక ఆవిష్కరణ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు ఆయన పంచుకున్నారు. ఇండియన్‌లు అంటే నేటివ్‌, రెడ్‌.. ఇలా అమెరికాలో వివిధ పేర్లతో తెగలు ఉన్న సంగతి తెలిసిందే.

Updated Date - Jun 20 , 2026 | 04:02 AM