Share News

ఖమేనీ ప్రతి కదలికపైనా నిఘా

ABN , Publish Date - Mar 04 , 2026 | 03:53 AM

అమెరికా-ఇజ్రాయెల్‌ నిర్వహించిన వైమానిక దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మృతి.. యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఖమేనీ ప్రతి కదలికపైనా నిఘా

  • ట్రాఫిక్‌ కెమెరాలు, ఫోన్‌ నెట్‌వర్క్‌ హ్యాక్‌ చేసిన ఇజ్రాయెల్‌

  • ఇజ్రాయెల్‌-అమెరికా కొన్నేళ్ల నిఘా ఫలితమే ఖమేనీ మృతి

  • టెక్నాలజీ సాయంతో పసిగట్టి.. టార్గెట్‌పై 30 బాంబులతో దాడి

న్యూఢిల్లీ, మార్చి 3: అమెరికా-ఇజ్రాయెల్‌ నిర్వహించిన వైమానిక దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మృతి.. యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ దాడి రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదని.. ఇజ్రాయెల్‌-అమెరికా కొన్నేళ్లుగా పెట్టిన నిఘా ఫలితం వల్లే ఖమేనీ టార్గెట్‌ మిస్‌ కాలేదని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్‌ నిఘా విభాగం ప్రణాళిక ప్రకారం ఇరాన్‌ రాజధాని నగరం ట్రెహాన్‌లోని ట్రాఫిక్‌ కెమెరా నెట్‌వర్క్‌, మొబైల్‌ ఫోన్‌ వ్యవస్థలను హ్యాక్‌ చేసిందని తెలిపాయి. టెహ్రాన్‌లోని దాదాపు అన్ని ట్రాఫిక్‌ కెమెరాలు హ్యాకింగ్‌కు గురవుతున్నాయని, ఆ ఫుటేజీలను ఎప్పటికప్పుడు తెప్పించుకున్నట్టు ఇజ్రాయెల్‌ నిఘా విభాగంలో పనిచేసిన ఇద్దరు అధికారులు తెలిపారు. టెహ్రాన్‌లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ప్రాంగణంలో ఖమేనీ సహా ఇతర సీనియర్‌ అధికారులు, వారి భద్రతా సిబ్బంది వాహనాలు ఎక్కడ పార్కింగ్‌ చేసేది, ఆ ప్రాంగణంలో రోజువారీ కార్యకలాపాలు వంటి కీలక సమాచారాన్ని ఇజ్రాయెల్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షించినట్టు పేర్కొన్నారు. అలాగే ఇరాన్‌ అగ్ర నాయకుల భద్రతా సిబ్బంది, వారి చిరునామాలు, డైలీ షెడ్యూల్‌, ప్రయాణించే మార్గాలపైనా నిఘా పెట్టినట్టు తెలిపారు. వీటి ప్రకారం ఖమేనీ ఎప్పుడు ఎక్కడ ఉంటారు.. ఎవరెవరిని కలుస్తారు.. అనే విషయాలను నిశితంగా అధ్యయనం చేసినట్టు చెప్పారు. వాస్తవానికి ఎన్నో ఏళ్ల క్రితం నుంచే ఖమేనీ ఇజ్రాయెల్‌ టార్గెట్‌లో ఉన్నారు. ఆయన ప్రతి కదలికపైనా ఇజ్రాయెల్‌ నిఘా పెడుతూ వస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌-అమెరికా సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ) ఖమేనీ గత శనివారం ఉందయం తన కార్యాలయంలో ఉన్నారని, ఆయనతోపాటు ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని పసిగట్టింది. ఇరాన్‌లో ప్రతి శుక్రవారం ప్రభుత్వ సెలవు దినం. ఖమేనీ ప్రతి శనివారం తన అధికారిక నివాసంలో కీలక ప్రభుత్వ పెద్దలు, సైనిక ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించేవారు. దీంతో శనివారం ఉదయం టెహ్రాన్‌లో ఇరాన్‌ అత్యున్నత స్థాయి అధికారుల సమావేశం ఉంటుందని ఇజ్రాయెల్‌ తెలుసుకొని దాడి చేసింది. ఈ క్రమంలో అమెరికా నిఘా సంస్థ సీఐఏ ఇచ్చిన సమాచారం కూడా కీలకమైంది. ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ నివేదిక ప్రకారం.. ఇద్దరు సీనియర్‌ అధికారులు ఖమేనీ ఉనికిని, ఆయనతోపాటు ఉన్నవారి గుర్తింపును ఒకటికి రెండుసార్లు ధ్రువీకరించారని తెలిసింది.


టెహ్రాన్‌ మాకు జెరూసలేం లాగే..

పాశ్చర్‌ స్ట్రీట్‌ సమీపంలోని దాదాపు డజను మొబైల్‌ ఫోన్‌ టవర్లను కూడా ఇజ్రాయెల్‌ హ్యాక్‌ చేసినట్టు తెలిసింది. దీనివల్ల లైన్లు బిజీ వచ్చినట్టు సమాచారం. ఆ సమయంలో ఖమేనీ భద్రతా బృందానికి హెచ్చరికలు అందకుండా ఉండేందుకే ఈ చర్యలకు పాల్పడినట్టు ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ నివేదించింది. అలాగే ఖమేనీపై దాడికి చాలాకాలం ముందు... ‘మాకు జెరూసలేం ఎంత బాగా తెలుసో.. టెహ్రాన్‌ కూడా అంతే బాగా తెలుసు..’ అని ప్రస్తుత ఇజ్రాయెల్‌ నిఘా అధికారి ఒకరు చెప్పినట్టు ఈ నివేదిక పేర్కొంది. ఇజ్రాయెల్‌ కొన్నేళ్లుగా సేకరించిన సమాచారాన్ని ఒక క్రమంలోకి తీసుకొచ్చేందుకు ఏఐ టూల్స్‌, అల్గారిథమ్స్‌ను ఉపయోగించినట్టు తెలిసింది. గత శనివారం కూడా ఖమేనీని అత్యంత కచ్చితత్వంతో టార్గెట్‌ చేయడానికి ఈ డేటానే ఉపయోగపడింది. కొన్ని దశాబ్దాలుగా ఇజ్రాయెల్‌ విదేశాల్లోని వందలాది హత్యలు చేసింది. తీవ్రవాద నాయకులు, అణు శాస్త్రవేత్తలు, రసాయన ఇంజనీర్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేసి హతమార్చింది. గతేడాది జూన్‌లో 12 రోజులపాటు సాగిన యుద్ధంలోనూ ఇజ్రాయెల్‌ నిఘా ప్రయోజనం స్పష్టంగా కనిపించింది. ఆ సమయంలో చేసిన ప్రారంభ దాడిలోనే 12 మందికిపైగా ఇరాన్‌ అణు శాస్త్రవేత్తలు, సీనియర్‌ సైనిక అధికారులు నిమిషాల వ్యవధిలోనే హతమయ్యారు. టెక్నాలజీని ఇంత దూకుడుగా వినియోగిస్తున్న ఇజ్రాయెల్‌పై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ.. రోరింగ్‌ లయన్‌..

గత శుక్రవారం మధ్యాహ్నం 3.38 గంటలకు ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో టెక్సా్‌సకు వెళ్తున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆపరేషన్‌ ‘ఎపిక్‌ ఫ్యూరీ’కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇజ్రాయెల్‌ సాయంతో ఇరాన్‌పై దాడి చేసే ఆపరేషన్‌కు అమెరికా పెట్టిన పేరిది. ఇజ్రాయెల్‌ దీనికి ఆపరేషన్‌ ‘రోరింగ్‌ లయన్‌’ అని పేరుపెట్టింది. ఈ క్రమంలో ఇరాన్‌ ప్రతిస్పందించే సామర్థ్యాన్ని దెబ్బతీసేలా సైబర్‌ దాడిని ప్రారంభించిన అమెరికా.. ఖమేనీ ఆవరణపై బాంబులతో దాడి చేయడానికి ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలకు మార్గం సుగమం చేసిందని అమెరికా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ చైర్మన్‌ జనరల్‌ డాన్‌ కెయిన్‌ చెప్పినట్టు ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ నివేదించింది. అమెరికా నిఘా మద్దతులో ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు (ఐడీఎఫ్‌) ఖమేనీ స్థావరంపై 30 బాంబులు వేశాయని కెయిన్‌ చెప్పారని పేర్కొంది.

Updated Date - Mar 04 , 2026 | 03:53 AM