లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ దళాలు!
ABN , Publish Date - Mar 04 , 2026 | 04:02 AM
ఇజ్రాయెల్ పదాతి దళాలు లెబనాన్‌లోకి ప్రవేశించాయి. టెహ్రాన్, బీరుట్‌లపై పెద్ద ఎత్తున వైమానిక దాడులను కొనసాగిస్తున్న ఇజ్రాయెల్..
ప్రత్యక్ష పోరుకు సిద్ధమన్న హెజ్బొల్లా
బీరుట్, మార్చి 3: ఇజ్రాయెల్ పదాతి దళాలు లెబనాన్‌లోకి ప్రవేశించాయి. టెహ్రాన్, బీరుట్‌లపై పెద్ద ఎత్తున వైమానిక దాడులను కొనసాగిస్తున్న ఇజ్రాయెల్.. మంగళవారం తన సైనిక దళాలను దక్షిణ లెబనాన్‌లోకి పంపింది. ‘‘లెబనాన్‌తో సరిహద్దులోని మరిన్ని కమాండింగ్ ప్రాంతాలను నియంత్రణలోకి తెచ్చుకోవాలని ప్రధాని నెతన్యాహు, నేను కలిసి ఇజ్రాయెల్ రక్షణ దళాలకు ఆదేశాలిచ్చాం’’ అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ తెలిపారు. లెబనాన్‌లోని హెజ్బొల్లా ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు చేస్తామని వెల్లడించారు. ఇజ్రాయెల్‌పై దాడులు చేసినందుకు గాను హెజ్బొల్లా ఉగ్ర సంస్థ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కాగా, సైన్యాన్ని దక్షిణ లెబనాన్‌లోకి పంపడాన్ని సరిహద్దుల్లో వ్యూహాత్మక చర్యగా ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంది. ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమని హెజ్బొల్లా సంస్థ ప్రకటించిన నేపథ్యంలోనే సరిహద్దులకు అదనపు బలగాలను పంపినట్లు తెలిపింది. మరోవైపు హెజ్బొల్లా ఉగ్రవాదుల వేటలో ఇజ్రాయెల్‌కు సహాయపడతామని లెబనాన్ ప్రకటించింది. ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’లో భాగంగా తమ సైనికులు దక్షిణ లెబనాన్‌లో పనిచేస్తున్నారని, సరిహద్దులో అదనపు బలగాలను మోహరించామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దక్షిణ లెబనాన్‌లోని 80కిపైగా గ్రామాలు, పట్టణాల ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి కనీసం కిలోమీటరు దూరం వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. ఆ ప్రాంతాల్లోని హెజ్బొల్లా ఉగ్ర స్థావరాలపై దాడులు చేస్తామని తెలిపింది. ఉగ్రవాద సంస్థకు పట్టున్న ప్రాంతాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇప్పటికే 52 మంది మరణించారు.
3 ఇజ్రాయెల్ స్థావరాలపై దాడి చేశాం: హెజ్బొల్లా
డ్రోన్లు, రాకెట్లతో ఇజ్రాయెల్‌కు చెందిన 3 సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ మంగళవారం ప్రకటించింది. బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలతో సహా లెబనాన్‌లోని తమ బేస్‌లపై దాడులకు స్పందనగానే ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. కాగా, లెబనాన్ నుంచి వచ్చిన రెండు డ్రోన్లను అడ్డగించామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. కాగా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హెజ్బొల్లా టీవీ, రేడియో కేంద్రాలు ధ్వంసమయ్యాయి.