పాలస్తీనియన్ల ఉరిశిక్షకు ఓకే!
ABN , Publish Date - Apr 01 , 2026 | 03:42 AM
ప్రాణాంతక దాడులకు పాల్పడిన పాలస్తీనియన్లకు ఉరిశిక్ష అమలు చేసేందుకు అనుమతించే వివాదాస్పద బిల్లుకు ఇజ్రాయెల్ పార్లమెంటు ఆమోదం తెలిపింది
వివాదాస్పద బిల్లుకు ఇజ్రాయెల్ పార్లమెంటు ఆమోదం
టెల్ అవీవ్, మార్చి 31: ప్రాణాంతక దాడులకు పాల్పడిన పాలస్తీనియన్లకు ఉరిశిక్ష అమలు చేసేందుకు అనుమతించే వివాదాస్పద బిల్లుకు ఇజ్రాయెల్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. సోమవారం జాతీయ భద్రత మంత్రి ఇటమర్ బెన్‌గ్విర్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు అనుకూలంగా ప్రధానమంత్రి నెతన్యాహు సహా 62 మంది ఓటు వేశారు. 48 మంది ఎంపీలు ఈ బిల్లును వ్యతిరేకించగా, ఒకరు ఓటింగ్‌లో పాల్గొనలేదు. ‘మేం చరిత్ర సృష్టించాం. ఇచ్చిన హామీని అమలు చేశాం’ అని ఈ సందర్భంగా బెన్‌గ్విర్ ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. వెస్ట్‌బ్యాంక్‌లో నివసించే పాలస్తీనియన్లు ఉద్దేశపూర్వకంగా చేసిన దాడులను ఇజ్రాయెల్ మిలిటరీ కోర్టులు ఉగ్రవాద చర్యగా భావిస్తే నిందితులకు మరణశిక్ష అమలు చేయనున్నారు. ఈ చట్టాన్ని పాలస్తీనా ఖండించగా, అంతర్జాతీయంగానూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ చట్టంతో ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు ముప్పు అంటూ బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ సహా ఐరోపా దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే, ఇజ్రాయెల్‌కు ఆ సార్వభౌమ అధికారం ఉందంటూ అమెరికా సమర్థించింది.