Share News

ఇజ్రాయెల్‌ కొత్త ప్రధాని ఐసెన్‌కోట్‌!

ABN , Publish Date - Nov 10 , 2026 | 03:24 AM

ఇజ్రాయెల్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సైన్యాధిపతి, యాషర్‌ పార్టీ నేత గడి ఐసెన్‌కోట్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసే బాధ్యతను దేశాధ్యక్షుడు ఇసాక్‌ హెర్జాగ్‌ అప్పగించారు.

ఇజ్రాయెల్‌ కొత్త ప్రధాని ఐసెన్‌కోట్‌!

  • యాషర్‌ పార్టీ నేతను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన అధ్యక్షుడు హెర్జాగ్‌

  • 67 మంది ఎంపీల మద్దతు.. కింగ్‌ మేకర్లుగా అరబ్‌ పార్టీలు

జెరూసలేం, నవంబరు 9: ఇజ్రాయెల్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సైన్యాధిపతి, యాషర్‌ పార్టీ నేత గడి ఐసెన్‌కోట్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసే బాధ్యతను దేశాధ్యక్షుడు ఇసాక్‌ హెర్జాగ్‌ అప్పగించారు. పార్లమెంట్‌లో 120 మంది సభ్యులకు గాను అత్యధికంగా 67 మంది ఎంపీల మద్దతు (కీలక మెజారిటీ మార్క్‌ 61) సాధించడంతో ఐసెన్‌కోట్‌కు ఈ అవకాశం లభించింది. ఈ పరిణామం ప్రస్తుత ప్రధాని నెతన్యాహుకు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు సేసి ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ (నెస్సెట్‌)లో మెజారిటీ నిరూపించుకునేందుకు ఐసెన్‌కోట్‌కు 28రోజుల గడువు ఉంటుంది. అవసరమైతే మరో 14రోజుల గడువు కోరొచ్చు. అప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమైతే నెతన్యాహుకు మరోసారి అవకాశం లభించే వీలుంది. ఇద్దరు నేతలూ విఫలమైతే మళ్లీ ఎన్నికలు జరిగే పరిస్థితి ఏర్పడవచ్చు.


అతిపెద్ద పార్టీ అయినప్పటికీ

అక్టోబర్‌ 27న జరిగిన ఎన్నికల్లో నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్‌ 27స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ, ఆయన ఆధ్వర్యంలోని జాతీయవాద కూటమి బలం గతంలో ఉన్న 68 నుంచి 53 స్థానాలకు తగ్గిపోగా.. ఆయన వ్యతిరేక కూటమి ‘చేంజ్‌ బ్లాక్‌’ 48 స్థానాలను సాధించింది. ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ (61 స్థానాలు) లభించకపోవడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ దశలో అరబ్‌ పార్టీలకు చెందిన రెండు కూటములు (రామ్‌, ద జాయింట్‌ లిస్ట్‌) సంయుక్తంగా 19 స్థానాలను గెలుచుకుని కింగ్‌ మేకర్లుగా మారాయి. నెతన్యాహును అధికారం నుంచి తప్పించాలన్న ఏకైక లక్ష్యంతో అవి ఐసెన్‌కోట్‌కు మద్దతు ప్రకటించాయి.

Updated Date - Nov 10 , 2026 | 03:25 AM