ఇరాన్‌తో యుద్ధం..ఇజ్రాయెల్‌కు వారానికి 28 వేల కోట్ల నష్టం..!
ABN , Publish Date - Mar 06 , 2026 | 03:54 AM
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం వల్ల ఇజ్రాయెల్‌కు వారానికి సుమారు రూ.28వేల కోట్ల (3 బిలియన్ డాలర్లు) నష్టం వాటిల్లుతుందని ఇజ్రాయెల్...
జెరూసలేం, మార్చి 5: ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం వల్ల ఇజ్రాయెల్‌కు వారానికి సుమారు రూ.28వేల కోట్ల (3 బిలియన్ డాలర్లు) నష్టం వాటిల్లుతుందని ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఇరాన్‌తో యుద్ధ పరిస్థితుల వేళ హోంఫ్రంట్ కమాండ్ విధించిన ‘రెడ్’ ఆంక్షల వల్ల ఆర్థిక వ్యవస్థ భారీ నష్టాలను చవిచూస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. గత శనివారం ఉదయం ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు ప్రారంభించిన వెంటనే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) హోం ఫ్రంట్ కమాండ్ దేశవ్యాప్తంగా కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. అవసరమైన వ్యాపారాలు మినహా మిగిలిన అన్ని వ్యాపారాలు, కార్యాలయా లు, పాఠశాలలు మూసివేయాలని ఆదేశించింది. పని ప్రదేశాలకు పరిమితులు విధించింది. దీనివల్ల దేశ ఆర్థిక స్థిరత్వం.. ముఖ్యంగా హైటెక్, వాణిజ్య రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఆంక్షలను సడలించాలని కోరుతోంది. ఈ మేరకు హోంఫ్రంట్ కమాండ్ చీఫ్ మేజర్ జనరల్ షాయ్ క్లాపర్‌కు ఆర్థిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ ఇలాన్ రోమ్ లేఖ రాశారు. వ్యాపారాలు, ఇతర కార్యకలాపాలను పాక్షికంగా తిరిగి ప్రారంభించేందుకు వీలుగా నాటికి ఆంక్షలు సడలించాలని ఆ లేఖలో కోరినట్టు ‘టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’ నివేదించింది. ప్రస్తుతం ఉన్న ‘రెడ్’ ఆం క్షలను ‘ఆరెంజ్’ స్థాయికి సడలించాలని, దానివల్ల వారానికి సంభవించే నష్టం దాదాపు సగం (రూ.14వేల కోట్లు) తగ్గుతుందని రోమ్ తెలిపారు. ‘దేశ రక్షణ విధానాన్ని కాపాడుకోవాల్సిన అంశంపై వివాదం లేదు. కానీ.. ఆర్థిక వ్యవస్థను మూసివేయడం వల్ల భారీ ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి. దీనికి పరిష్కారం అవసరం’ అని తెలిపారు.