ఇజ్రాయెల్‌లో విధ్వంసం!
ABN , Publish Date - Mar 30 , 2026 | 04:08 AM
అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో తీవ్రంగా నష్టపోతున్న ఇరాన్.. ఆదివారం భీకరంగా ప్రతిదాడులకు దిగింది. ఇరాన్‌తోపాటు లెబనాన్‌లోని ఇరాన్ అనుకూల హెజ్బొల్లా, ఇరాక్‌లోని ఇస్లామిక్ రిపబ్లిక్ మిలీషియాలు..
భారీ సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లు, రాకెట్లతో విరుచుకుపడిన ఇరాన్, హెజ్బొల్లా
బీర్‌షెబాలోని భారీ రసాయన ప్లాంటు ధ్వంసం
టెల్‌అవీవ్/దుబాయ్, మార్చి 29: అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో తీవ్రంగా నష్టపోతున్న ఇరాన్.. ఆదివారం భీకరంగా ప్రతిదాడులకు దిగింది. ఇరాన్‌తోపాటు లెబనాన్‌లోని ఇరాన్ అనుకూల హెజ్బొల్లా, ఇరాక్‌లోని ఇస్లామిక్ రిపబ్లిక్ మిలీషియాలు.. పెద్ద సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లు, రాకెట్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డాయి. దీనితో సుమారు వంద పట్టణాల్లో ఆదివారం రోజంతా సైరన్లు మోగుతూనే ఉన్నాయి. బీర్‌షెబాలోని నియోట్ హొవావ్ పారిశ్రామిక ప్రాంతంపై ఇరాన్ క్షిపణులు పడి భారీ పేలుళ్లు సంభవించాయి. అక్కడి ఏడీఏఎంఏ రసాయన పరిశ్రమలో భారీగా మంటలు చెలరేగి, విషవాయువులు వెలువడుతున్నాయి. దీనితో ఆ ప్రాంతంలోని ప్రజలెవరూ బయటికి రావొద్దని.. కిటికీలు, తలుపులు మూసేసుకుని ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. ఇక నెగేవ్, టెల్ అవీవ్, జేరుసలేం, ఆష్‌డోడ్ ప్రాంతాల్లో పేలుళ్లు వినిపించాయి. ఉత్తర ఇజ్రాయెల్‌లోని అక్రే సమీపంలో మిలిటరీ పరిశ్రమపై రాకెట్ దాడి జరిగింది. భారీ చమురు రిఫైనరీ ఉన్న హైఫా పట్టణంలో ఇరాన్, హెజ్బొల్లా క్షిపణి దాడులతో మంటలు చెలరేగాయి. మరోవైపు యూఏఈ, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియాలపైనా ఇరాన్ దాడులు కొనసాగాయి. కువైట్‌లోని సైనిక స్థావరంపై దాడిలో 10 మంది గాయపడ్డారు. మరోవైపు, ఇరాన్‌లోని టెహ్రాన్‌తోపాటు ఇస్ఫహాన్, షిరాజ్, తబ్రిజ్ తదితర ప్రాంతాల్లో అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగాయి. ఇరాన్‌లో మృతుల సంఖ్య 2,076కు పెరిగింది. ఇస్ఫహాన్ యూనివర్సిటీ క్యాంప్‌సలో వైమానిక దాడి జరిగింది. టెహ్రాన్‌లోని ఖతార్‌కు చెందిన అల్ అరబీ టీవీ చానల్ కార్యాలయంపై వైమానిక దాడి జరిగింది.