ఇజ్రాయెల్ కొమ్ములు విరుస్తాం
ABN , Publish Date - Apr 13 , 2026 | 05:09 AM
పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికా మధ్య యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నాలు కొనసాగుతుండగానే అదే ప్రాంతంలో మరో సైనిక ఘర్షణకు పూర్వరంగం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.
లిబియాలోకి వెళ్లినట్లే ఇజ్రాయెల్‌లోకీ చొచ్చుకెళ్లగలం
తుర్కియే అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ హెచ్చరిక
సొంత ప్రజలపైనే ఎర్డోగన్ మారణహోమం: నెతన్యాహు
అంకారా/ జెరూసలేం, ఏప్రిల్ 12: పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికా మధ్య యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నాలు కొనసాగుతుండగానే అదే ప్రాంతంలో మరో సైనిక ఘర్షణకు పూర్వరంగం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. గాజాను పూర్తిగా నేలమట్టం చేసి, ప్రస్తుతం లెబనాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్‌కు తుర్కియే అధ్యక్షుడు రిసెప్ తెయ్యిప్ ఎర్డోగన్ తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయని ఎర్డోగన్ విమర్శించగా, ఎర్డోగన్ తన సొంత ప్రజలపైనే మారణహోమం కొనసాగిస్తున్నారని నెతన్యాహు మండిపడ్డారు. ఆ తర్వాత రెండు దేశాల నేతల మాటల యుద్ధంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కిం ది. శనివారం అంకారాలో ఓ కార్యక్రమంలో ఎర్డోగన్ మాట్లాడారు. ‘అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించకపోయి ఉంటే.. ఇజ్రాయెల్‌కు దాని స్థానమేంటో చూపించేవాళ్లం. నెతన్యాహుకు రక్తం, ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి. లిబియా, కరబాఖ్‌లోకి వెళ్లినట్లే మేమూ ఇజ్రాయెల్‌లోకి చొచ్చుకెళ్లగలం’ అని ఎర్డోగన్ హెచ్చరించారు.
మీలా సొంత ప్రజలను మేము చంపలేం: నెతన్యాహు
ఎర్డోగన్ హెచ్చరికలకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దీటుగా బదులిచ్చారు. ‘ఇరాన్ ఉగ్రవాద పాలకులపై, ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్ర ముఠాలపై మేము యుద్ధం కొనసాగిస్తాం. సొంత పౌరులైన కుర్దులపై మీరు మారణహోమం సాగిస్తున్నట్లుగా మేము చేయం’ అని అన్నారు. తుర్కియే యూదు వ్యతిరేక వైఖరి అనుసరిస్తోందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఆరోపించారు.