ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి
ABN , Publish Date - Feb 07 , 2026 | 03:56 AM
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ శుక్రవారం భీకర ఆత్మాహుతి దాడితో దద్దరిల్లింది. తర్లై ప్రాంతంలో షియా ముస్లింలకు చెందిన ఖదీజతుల్ కుబ్రా మసీదు, ఇమాంబర్గా.....
69 మంది మృతి.. 169 మందికి గాయాలు
షియాలకు చెందిన మసీదులో భారీ పేలుడు
మృతుల సంఖ్య మరింత పెరగవచ్చన్న అధికారులు
‘తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్థాన్’ పనేనని అనుమానం
ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు పాక్ పర్యటనలో ఉండగానే ఘటన
ఇస్లామాబాద్, ఫిబ్రవరి 6: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ శుక్రవారం భీకర ఆత్మాహుతి దాడితో దద్దరిల్లింది. తర్లై ప్రాంతంలో షియా ముస్లింలకు చెందిన ఖదీజతుల్ కుబ్రా మసీదు, ఇమాంబర్గా (అషూర్‌ఖానా)లో గుర్తు తెలియని ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకోవటంతో 69 మంది మరణించారు. 169 మంది గాయపడ్డారు. శుక్రవారం మఽధ్యాహ్నం ప్రార్థనల సమయంలో మసీదులోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆత్మాహుతి బాంబర్‌ను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవటంతో గేటువద్ద అతడు ఈ దాడికి పాల్పడ్డాడు. తనను తాను పేల్చేసుకోవటానికి ముందు అతడు కాల్పులు కూడా జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ పాకిస్థానీ జియో న్యూస్ టీవీ తెలిపింది. క్షతగాత్రులను పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిమ్స్)తోపాటు ఇతర ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకావం ఉందని అధికారులు తెలిపారు. నగరం మొత్తం అత్యవసర పరిస్థితి ప్రకటించారు. పేలుడు తీవ్రత అధికంగా ఉండటంతో ఘటనా స్థలంలో పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఈ పేలుడు శబ్దం కొన్ని కిలోమీటర్ల దూరం వినిపించినట్లు స్థానికులు మీడియాకు తెలిపారు. ఘటనా స్థలంలో చెల్లాచెదరుగా పడి ఉన్న మృతదేహాలు, శరీర భాగాల వీడియోలను స్థానిక మీడియా ప్రసారం చేసింది. సమీపంలోని ఆస్పత్రులు క్షతగాత్రులతో నిండిపోయాయి. ఈ దాడికి బాధ్యత వహిస్తూ వెంటనే ఎవరూ ప్రకటన చేయలేదు. అయితే, ఇది తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) పని అయి ఉండొచ్చని పోలీస్ వర్గాలు తెలిపాయి. దాడికి పాల్పడిన వ్యక్తి పాకిస్థాన్ పౌరుడు కాదని పేర్కొన్నాయి. రెండు రోజుల పర్యటన కోసం పాకిస్థాన్‌కు వచ్చిన ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్ ఇస్లామాబాద్‌లో ఉండగానే ఈ దాడి జరగటం సంచలనం సృష్టించింది. ఈ దాడిని భారత్ ఖండించింది.