Share News

చర్చలకు మొజ్తాబా ఓకే!

ABN , Publish Date - Mar 25 , 2026 | 03:40 AM

యుద్ధం ముగించే దిశగా అమెరికాతో చర్చలకు ఇరాన్‌ నూతన సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ అంగీకరించారని, ఆ దిశగానే రహస్యంగా చర్చలు జరుగుతున్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

చర్చలకు మొజ్తాబా ఓకే!

  • పాకిస్థాన్‌ వేదికగా చర్చలు.. భద్రతా హామీలపై ఇరాన్‌కు ముందస్తు భరోసా

దుబాయ్‌, మార్చి 24: యుద్ధం ముగించే దిశగా అమెరికాతో చర్చలకు ఇరాన్‌ నూతన సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ అంగీకరించారని, ఆ దిశగానే రహస్యంగా చర్చలు జరుగుతున్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ మేరకు సౌదీ అరేబియాకు చెందిన అల్‌ అరబియా తాజాగా కథనం ప్రచురించింది. ఆ దిశగానే ఈజిప్ట్‌, తుర్కియే, సౌదీ అరేబియా, పాకిస్థాన్‌ తదితర దేశాలు మధ్యవర్తులుగా చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. ఇక అజర్‌బైజాన్‌, ఈజిప్ట్‌, ఒమన్‌, పాకిస్థాన్‌, రష్యా, దక్షిణ కొరియా, తుర్కియే, తుర్క్‌మెనిస్థాన్‌ విదేశాంగ మంత్రులతో ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ చర్చిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఫోన్‌లో చర్చలు జరిగాయని, త్వరలో పాకిస్థాన్‌ వేదికగా చర్చలు జరగనున్నాయని ఇరాన్‌ రెవెల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఇరాన్‌కు చెందిన ఉన్నతస్థాయి బృందం పాకిస్థాన్‌కు వెళ్లనుందని.. ఇరాన్‌కు ఇచ్చే కచ్చితమైన భద్రతా హామీలపై మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశాల నుంచి ముందస్తుగానే భరోసా తీసుకుంటుందని పేర్కొన్నాయి. ఆ తర్వాతే అమెరికాతో నేరుగా చర్చలు జరుగుతాయని వెల్లడించాయి. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌ వేదికగా ఇరాన్‌ ఉన్నతస్థాయి బృందంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కాఫ్‌, ట్రంప్‌ సలహాదారు జేర్‌డ్‌ కుష్నర్‌ చర్చలు జరిపే అవకాశం ఉందని అమెరికా రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

దాడులకు సమయం కోసమే ‘చర్చ’ల ప్రతిపాదన?

ట్రంప్‌ చర్చల ప్రతిపాదనలపై ఇరాన్‌ మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఫిబ్రవరి చివరి వారంలో ఉన్నతస్థాయి చర్చలు జరుగుతున్న సమయంలోనే.. అమెరికా, ఇజ్రాయెల్‌ ఏకపక్షంగా ఇరాన్‌పై దాడికి దిగిన అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. ఇప్పుడు కూడా అదే తరహాలో విరుచుకుపడే ప్రమాదమూ ఉందని భావిస్తోంది. ఇరాన్‌కు కీలకమైన ఖార్గ్‌ దీవి, హోర్ముజ్‌ జలసంధిలోని తీర ప్రాంతాల స్వాధీనానికి వీలుగా భూతల దాడులకు అమెరికా సిద్ధమైనట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ బలగాలు చేరుకోవడానికి కొన్నిరోజులు పట్టనుంది. ఈ క్రమంలోనే చర్చల పేరిట దృష్టి మళ్లించేందుకు అమెరికా ప్రయత్నిస్తోందనే విశ్లేషణలూ వెలువడుతున్నాయి.

Updated Date - Mar 25 , 2026 | 03:40 AM