ఇరాన్ తెలివైన యుద్ధం!
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:46 AM
క్షిపణులు, శతఘ్నులు, భారీ యుద్ధ విమానాలతో ఒక దేశం మరో దేశం మీద దండయాత్రకు దిగడం.. పాత యుద్ధ రీతి! ఉక్రెయిన్‌పై రష్యా..
ముందు జాగ్రత్తగా జీపీఎస్ నిలిపివేత
చైనాకు చెందిన ‘బేదో-3’ వ్యవస్థ వినియోగం
సయ్యాద్-4 క్షిపణి, నిఘా వ్యవస్థ, కోబ్రా-వీ8తో శత్రు డ్రోన్లు, క్షిపణుల నిర్వీర్యం
హోర్ముజ్ జలసంధి, ఎర్రసముద్రాల్లో కిల్‌జోన్లు
అగ్రనాయకత్వం చనిపోయినా సైన్యం తనపని తాను చేసుకుపోయేలా.. వ్యవస్థల వికేంద్రీకరణ
టెహ్రాన్: క్షిపణులు, శతఘ్నులు, భారీ యుద్ధ విమానాలతో ఒక దేశం మరో దేశం మీద దండయాత్రకు దిగడం.. పాత యుద్ధ రీతి! ఉక్రెయిన్‌పై రష్యా.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా అనుసరిస్తున్న యుద్ధ నీతి ఇదే!! కానీ.. ఇది 20వ శతాబ్దపు సంప్రదాయం అని.. ఈ 21వ శతాబ్దంలో కూడా అలాగే యుద్ధం చేస్తామంటే, బండగా మొండిగా ఒక దేశం మీద పడిపోతామంటే కుదరదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ వైఖరి ఇలాగే ఉందని.. కానీ, ఆ రెండు దేశాలనూ నిలువరించడానికి ఇరాన్ అత్యంత తెలివైన, ఆధునిక యుద్ధ పోకడలను అనుసరిస్తోందని ప్రముఖ రక్షణ రంగ నిపుణుడు, భారత సైన్యంలో సేవలందించిన మాజీ అధికారి ప్రవీణ్ సాహ్నీ అభిప్రాయపడ్డారు. ఈ యుద్ధం కారణంగా దేశం విచ్ఛిన్నం కాకుండా, విదేశీ శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా ఇరాన్ విభిన్న పద్ధతులను అవలంబిస్తోందని, దేశ అగ్ర నాయకత్వం మరణించినా సైన్యం తన పని తాను చేసుకుపోయేలా వికేంద్రీకృత వ్యవస్థలను ఏర్పాటు చేసుకుందని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా ఏ దేశ సైన్యమైనా ఉన్నతస్థాయి నుంచి వచ్చే ఆదేశాల మేరకు పనిచేస్తుంది. కానీ, శత్రు దేశాలు సదరు అగ్రనాయకత్వంపై దాడులు జరిపితే ఆదేశాలు అందక సైన్యం మొత్తం గందరగోళంలో పడిపోతుంది. అలా కాకుండా ఇరాన్ తన సైనిక శక్తిని చిన్నచిన్న విభాగాలుగా విడగొట్టి వాటికి స్వయంప్రతిపత్తి ఇచ్చింది. దీనివల్ల.. పై నుంచి ఆదేశాలు రాని పరిస్థితుల్లో స్థానిక కమాండర్లు తమకు తాముగా నిర్ణయాలు తీసుకుని యుద్ధం చేయగలరు. తద్వారా.. ఎవరిని కొడితే ఈ యుద్ధం ఆగిపోతుందో తెలియని అయోమయ పరిస్థితిలోకి శత్రుసైన్యాలు వెళ్లిపోతాయి.
సాంకేతిక యుద్ధం..
అమెరికా, ఇజ్రాయెల్ తనపై ఎప్పటికైనా దాడి చేయడం తథ్యమన్న సంగతి ఇరాన్‌కు తెలుసు కాబట్టి.. తాను అప్పటిదాకా వాడుతున్న జీపీఎ్‌సకు(ఇది అమెరికాది) బదులుగా, చైనాకు చెందిన బేదో-3 శాటిలైట్ వ్యవస్థను వాడడం మొదలుపెట్టింది. ఇరాన్ కూడా జీపీఎస్‌పై ఆధారపడి ఉంటే ఈపాటికే ఇరాన్ ఓటమి సంపూర్ణమయ్యేది! అలా జరక్కుండా చైనా నేవిగేషన్ సిస్టమ్‌పై ఆధారపడ్డం ఇరాన్‌ను బాగా కాపాడింది. అలాగే.. ఈ యుద్ధంలో ఇరాన్ ఉపయోగిస్తున్న మరో రెండు కీలక అస్త్రాలు.. కోబ్రా-వీ8, సయ్యాద్-4. అమెరికా ప్రయోగించే స్టెల్త్ సామర్థ్యం ఉన్న విమానాలు ఇరాన్ దిశగా వస్తుంటే.. వాటిని గుర్తించగల పాసివ్ రేడార్ సామర్థ్యం సయ్యాద్-4 క్షిపణి, నిఘా వ్యవస్థకు ఉంది. రేడియో తరంగాలతో ఆ విమానాలు కూలిపోయేలా, దారిమళ్లేలా, శత్రువుల సెన్సర్ల సర్క్యూట్లు పూర్తిగా మొరాయించేలా చేసే సత్తా కూడా ఉంది. ఇక, కోబ్రా వీ8.. శత్రువుల విమానాలు, డ్రోన్లు, యుద్ధనౌకలు ఉపయోగించే రేడియో తరంగాలను పూర్తిగా స్తంభింపజేస్తుంది. దాదాపు 250 కిలోమీటర్ల పరిధిలో డిజిటల్ చీకటిని సృష్టిస్తుంది. ‘రేడార్ బ్లైండింగ్’ ద్వారా.. శత్రువుల రేడార్ స్ర్కీన్లపై వేలకొద్దీ తప్పుడు టార్గెట్లను సృష్టిస్తుంది.

కిల్‌జోన్..
ప్రవీణ్ సాహ్నీ ప్రకారం.. ఇరాన్ తన యాంటీ షిప్ క్షిపణులు, డ్రోన్లు, సముద్రంలో అమర్చిన స్మార్ట్ మైన్ల ద్వారా హోర్ముజ్ జలసంధిని, ఎర్ర సముద్రాన్ని చాలాకాలం క్రితమే అమెరికాకు కిల్ జోన్‌గా మార్చేసింది. వీటి దెబ్బ తట్టుకోలేక అమెరికా 2024 నవంబరులోనే తన అతి పెద్ద విమానవాహక యుద్ధనౌక అబ్రహాం లింకన్‌ను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇరాన్ సృష్టించిన ఈ కిల్ జోన్ దెబ్బకు అమెరికా తన నౌకాదళాన్ని హోర్ముజ్ జలసంధి సమీప ప్రాంతాలకు తరలించడానికి కూడా భయపడుతోందంటే అతిశయోక్తి కాదు. వీటన్నింటి వల్లనే ఇరాన్ తన అస్తిత్వాన్ని ఇప్పటికీ కాపాడుకోగలుగుతోంది. అంతేకాదు, ఇరాన్ తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికే పరిమితం కాకుండా.. పాశ్చాత్య సేనలన్నింటినీ పశ్చిమాసియా దేశాల నుంచి తొలగించడమే లక్ష్యంగా యుద్ధాన్ని కొనసాగిస్తోందని ప్రవీణ్ సాహ్నీ అభిప్రాయపడ్డారు.