Share News

భూగర్భంలో ఆయుధాగారం

ABN , Publish Date - Mar 19 , 2026 | 06:53 AM

పర్షియన్‌ గల్ఫ్‌ సముద్ర జలాల్లోనే అతి పెద్ద ద్వీపంగా పేరొందిన ఖెష్మ్‌.. ఇరాన్‌కు అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రాంతం. ఆ దేశంలోని బండార్‌ అబ్బాస్‌ నగరానికి 22 కి.మీ.ల దూరంలో ఉండే ఈ ద్వీపం 1,445 చదరపు కి.మీ.ల మేర విస్తరించి ఉంది.

భూగర్భంలో ఆయుధాగారం

  • ఇరాన్‌ మిసైల్‌సిటీ ఖేష్మ్‌ ఐలండ్‌

వాషింగ్టన్‌, మార్చి 18: పర్షియన్‌ గల్ఫ్‌ సముద్ర జలాల్లోనే అతి పెద్ద ద్వీపంగా పేరొందిన ఖెష్మ్‌.. ఇరాన్‌కు అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రాంతం. ఆ దేశంలోని బండార్‌ అబ్బాస్‌ నగరానికి 22 కి.మీ.ల దూరంలో ఉండే ఈ ద్వీపం 1,445 చదరపు కి.మీ.ల మేర విస్తరించి ఉంది. సుదీర్ఘమైన చరిత్రకు, అత్యంత అరుదైన భూవిజ్ఞానశాస్త్ర ఆనవాళ్లకు, ప్రకృతి సంపదకు నెలవైన ఈ ప్రాంతం పర్యాటక, వాణిజ్య కేంద్రంగా కొనసాగుతోంది. అయితే, ఇదంతా భూమి మీదే. భూగర్భంలో ఇరాన్‌ సైనిక ఆయుధ సంపత్తికి ముఖ్యంగా క్షిపణులకు.. ఖెష్మ్‌ ప్రధాన స్థావరంగా మారిందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఖెష్మ్‌ కింద ఇరాన్‌ ఏకంగా అనేక క్షిపణుల నగరాలనే నిర్మించిందంటారు. బాంబు దాడులను తట్టుకునేలా, గాలి వెలుతురు వచ్చేలా, విద్యుత్‌, రవాణా సదుపాయాలతో నిర్మితమైన ఈ మిసైల్‌ నగరాల్లో క్షిపణులేగాక పలు ఇతర కీలక ఆయుధ సామగ్రి నిల్వలు ఉన్నట్లు అల్‌జజీరా వార్తాసంస్థ ఒక కథనంలో తెలిపింది. నౌకలను లక్ష్యంగా చేసుకునే హెచ్‌వై-2 సిల్క్‌వామ్‌ మిసైళ్లు, క్వాయమ్‌-1, ఖైబర్‌ షేకన్‌, గదర్‌, ఇమాద్‌ వంటి బాలిస్టిక్‌ క్షిపణులు, ఎలకా్ట్రనిక్‌ నిఘా నుంచి కూడా తప్పించుకొని పని చేసే ఆయుధాలు ఇక్కడ ఉన్నట్లు తెలిపింది. భౌగోళికంగా ఖెష్మ్‌కు ఉన్న అనుకూలతలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో.. బయటకు కనిపించని నౌకాస్థావరాలను కూడా ఇరాన్‌ నిర్మించినట్లు సమాచారం. ప్రస్తుతం హొర్ముజ్‌ మార్గంలో ఆంక్షలు విధించిన ఇరాన్‌.. తన మిత్రదేశాలకు చెందిన నౌకలను ఖెష్మ్‌ మీదుగా వెళ్లటానికి అనుమతిస్తోంది. ఖెష్మ్‌తోపాటు దాని సమీపంలోని లారక్‌ తదితర ద్వీపాల మీదుగా నౌకల ట్రాఫిక్‌ను ఇరాన్‌ నియంత్రిస్తున్నట్లు తెలుస్తోంది. ఖెష్మ్‌కు ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యం దృష్ట్యాఅమెరికా, ఇజ్రాయెల్‌ ఈ ప్రాంతం కేంద్రంగా దాడులు జరుపుతున్నాయి. ఈ నెల 7వ తేదీన ఈ ద్వీపంలోని నిర్లవణీకరణ కేంద్రంపై దాడులు జరిపాయి.


ఖేష్మ్‌ దీవిపై బంకర్‌ బస్టర్‌ బాంబులతో దాడి

హోర్ముజ్‌ జలసంధిలో అత్యంత కీలకమైన ‘ఖేష్మ్‌’ దీవిపై అమెరికా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అక్కడి గుహలు, భూగర్భంలో ఉన్న క్షిపణులు, ఆయుధ నిల్వ స్థావరాలపై ఒక్కోటీ 2,268 కిలోల (5 వేల పౌండ్లు) బరువైన బంకర్‌-బస్టర్‌ బాంబులతో దాడి చేసింది. లోతుగా చొచ్చుకుపోయి, భారీ పేలుడు సంభవించే బాంబులను ఇరాన్‌ తీరప్రాంతంలోని క్షిపణి స్థావరాలపై వేశామని, ఆ స్థావరాల్లోని యాంటీ షిప్‌ క్షిపణులు హోర్ముజ్‌ జలసంధిలో నౌకా రవాణాకు ప్రమాదకరంగా పరిణమించాయని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ వెల్లడించింది. హోర్ముజ్‌ జలసంధిని తెరిచి, భద్రత కల్పించేందుకు యుద్ధనౌకలను పంపాలన్న ట్రంప్‌ విజ్ఞప్తిని నాటో, ఇతర దేశాలు తిరస్కరించడం.. దానితో ఆగ్రహించిన ట్రంప్‌ తమకు ఎవరూ అవసరం లేదని ప్రకటించడం నేపథ్యంలో.. ఖేష్మ్‌ దీవిపై భారీ దాడులకు దిగడం గమనార్హం.

Updated Date - Mar 19 , 2026 | 06:53 AM