17 దేశాలపై యుద్ధ ప్రత్యక్ష ప్రభావం
ABN , Publish Date - Mar 06 , 2026 | 03:57 AM
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా ప్రారంభించిన యుద్ధం పశ్చిమాసియాలో భారీ విధ్వంసాన్నే సృష్టిస్తోంది. బుధవారం నాటికి ఈ యుద్ధంతో ప్రత్యక్ష్యంగా దాదాపు 17 దేశాలు ప్రభావితం అయినట్లు....
పెద్ద సంఖ్యలో మరణాలు, ఆస్తుల ధ్వంసం
జెరూసలేం, మార్చి5: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా ప్రారంభించిన యుద్ధం పశ్చిమాసియాలో భారీ విధ్వంసాన్నే సృష్టిస్తోంది. బుధవారం నాటికి ఈ యుద్ధంతో ప్రత్యక్ష్యంగా దాదాపు 17 దేశాలు ప్రభావితం అయినట్లు అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) తెలిపింది. పెద్ద సంఖ్యలో మరణాలతోపాటు రూ.వేలకోట్ల విలువైన ఆస్తులు ధ్వంసమైనట్లు పేర్కొంది. ఈ యుద్ధానికి ప్రధాన క్షేత్రంగా ఉన్న ఇరాన్‌లో బుధవారం నాటికి 1,045 మంది మరణించినట్లు తెలిపింది. వీరిలో పాఠశాల విద్యార్థులే 160 మంది ఉన్నారు. దేశ రాజధాని టెహ్రాన్ సహా అనేక ప్రాం తాల్లో బాంబు దాడుల్లో వేలకోట్ల ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్, పాలస్తీనాల్లో ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడుల్లో 11 మంది పౌరులు మరణించారు. పవిత్ర నగరం జెరూసలేంలో పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. లెబనాన్‌లో హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 72 మంది మరణించారు. మృతుల్లో ఏడుగురు చిన్నారు లు ఉన్నారు. 84 వేల మంది నిరాశ్రయులయ్యారు. అనేక భవనాలు దెబ్బతిన్నాయి. కువైట్‌లో ఇరాన్ దాడిలో ఆరుగురు అమెరికా సైనికులు సహా 8 మంది మరణించారు. మృతుల్లో ఒక వలస కార్మికుడు కూడా ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. ఇరాన్ ప్రతీకార దాడిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తీవ్రంగా నష్టపోయింది. క్షిపణి, డ్రోన్ దాడుల్లో నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లకు చెందిన ముగ్గురు కార్మికులు మర ణించారు. మొత్తంగా 68 మంది గాయపడ్డారు. అంతర్జాతీయ విమానాశ్రయం సహా అనేక విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయి. బహ్రెయిన్‌లో ఒక వలస కార్మికుడు మరణించాడు. సిరియాలో ఇరాన్ క్షిపణి శకలాలు పడి ఏడుగురు పౌరులు మరణించారు. ఇరాక్‌లో ఇరాన్‌కు మద్దతిస్తున్న మిలీషియా గ్రూపులపై అమెరికా భారీ ఎత్తున దాడులు చేసింది. అయితే, ఈ దాడుల్లో ఎంతమంది మరణించారన్న సమాచారం లేదు. జోర్డాన్‌లో ఐదుగురు మరణించారు. సౌదీ అరేబియాలోని చమురు శుద్ధి కేంద్రాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకొని దాడులు చేయటంతో ఆ దేశానికి భారీగానే నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఆ దేశంలోని తనూరా చమురు శుద్ధి కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. అయితే, తమకు నష్టం స్వల్పంగానే ఉందని సౌదీ రక్షణ శాఖ తెలిపింది. ఆఫ్రికా ఖండంలో భాగమైన ఈజిప్టులో దాడులు జరగనప్పటికీ చమురు, సరుకు రవాణా నౌకలు సూయజ్ కాలువ ద్వారా రవాణాను నిలిపివేయటంతో ఆర్థికంగా ఆ దేశం నష్టపోతోంది. ఖతార్‌లో ఇరాన్ దాడులతో ఆస్తులకు నష్టం జరిగింది. ఒమన్ తీరంలో నౌకపై దాడి జరగటంతో అందులో విధులు నిర్వహిస్తున్న ఓ భారతీయుడు మరణించాడు. టర్కీపై కూడా బాలిస్టిక్ క్షిపణితో దాడి చేసినప్పటికీ.. నాటో గగన రక్షణ వ్యవస్థ దానిని కూల్చివేసింది.