హోర్ముజ్‌లో సీమైన్స్.. జాగ్రత్త!
ABN , Publish Date - Apr 10 , 2026 | 03:22 AM
హోర్ముజ్ జలసంధిలో పలు చోట్ల సముద్రపు మందుపాతరలు (సీమైన్స్) ఏర్పాటు చేశామని, ఆ మార్గాల్లో ప్రయాణించకుండా జాగ్రత్తగా ఉండాలని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్....
ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించండి.. ఒమన్ తీరానికి దగ్గరగా ప్రమాదకర ప్రాంతం
మ్యాప్‌ను విడుదల చేసిన ఐఆర్‌జీసీ
జలసంధిలో భద్రమైన ప్రయాణం కోసం ఇరాన్ నౌకాదళంతో సమన్వయం చేసుకోవాలని సూచన
టెహ్రాన్, ఏప్రిల్ 9: హోర్ముజ్ జలసంధిలో పలు చోట్ల సముద్రపు మందుపాతరలు (సీమైన్స్) ఏర్పాటు చేశామని, ఆ మార్గాల్లో ప్రయాణించకుండా జాగ్రత్తగా ఉండాలని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) హెచ్చరించింది. ఈ మేరకు భద్రమైన రాకపోకల కోసం ప్రయాణ మార్గాలను సూచిస్తూ ఒక మ్యాప్‌ను విడుదల చేసింది. ఈ మేరకు ఇరాన్‌కు చెందిన టాస్నిమ్ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. మ్యాప్‌లో ఒమన్ వైపు ఉన్న జలసంధి ప్రాంతంపై ఎరుపు రంగు వృత్తాన్ని సూచిస్తూ.. ‘ప్రమాదకర ప్రాంతం’ అని పేర్కొంది. హోర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించే నౌకలు ఏవైనా సీమైన్స్ బారినపడకుండా తప్పించుకునేందుకు ఇరాన్ నౌకా దళంతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. ఐఆర్‌జీసీ విడుదల చేసిన మ్యాప్‌లో పర్షియన్ గల్ఫ్‌లోకి వచ్చేందుకు, వెళ్లేందుకు రెండు వేర్వేరు మార్గాలను పేర్కొంది. అయితే ఈ మార్గాలు ఇరాన్ భూభాగానికి, లారక్ ద్వీపానికి చాలా దగ్గరగా ఉండటం గమనార్హం. అంటే జలసంధిలో ప్రయాణించే నౌకలన్నీ కూడా ఇరాన్ పూర్తి పర్యవేక్షణలో ఉంటాయి.
ఇరాన్‌కు నిఘా సమాచారమేదీ ఇవ్వలేదు: చైనా
యుద్ధానికి సంబంధించి ఇరాన్‌కు ఎలాంటి నిఘా సమాచారం ఇవ్వలేదని చైనా వెల్లడించింది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, బలగాల కదలికలపై చైనా సంస్థలు ఇచ్చిన ఉపగ్రహ చిత్రాల సాయంతోనే ఇరాన్ దాడులు చేపట్టిందన్న అమెరికా అధికారుల ఆరోపణలను చైనా రక్షణ శాఖ ప్రతినిధి ఝాంగ్ షియావోగాంగ్ ఖండించారు. పశ్చిమాసియాలో శాంతి కోసం దౌత్య పరిష్కారాలు, చర్చల కోసం చైనా ప్రయత్నించిందని.. అంతే తప్ప మంటల్లో పెట్రోల్ పోసే తరహాలో ఎప్పుడూ వ్యవహరించలేదని పేర్కొన్నారు. యుద్ధాలను ఎవరు సృష్టిస్తున్నారో, పైకి ఒకటి చెబుతూ, లోపల మరొకటి చేస్తున్నారో ప్రపంచానికి తెలుసని వ్యాఖ్యానించారు.
‘విరమణ’లో హోర్ముజ్ దాటిన నౌకలు ఆరే!
అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటన జరిగి.. తిరిగి మూసివేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించడానికి మధ్య సుమారు 20 గంటల సమయం గడిచింది. ఈ 20 గంటల్లోనూ హోర్ముజ్ జలసంధిని దాటేందుకు నౌకలేవీ సాహసించలేదు. ఈ సమయంలో కేవలం ఐదు నౌకలు మాత్రమే హోర్ముజ్ దాటాయని.. అందులో ఐదు సరుకు రవాణా క్యారియర్లు, ఒక చమురు ట్యాంకర్ ఉన్నాయని నౌకా రవాణా ట్రాకింగ్ డేటాను విశ్లేషిస్తూ రాయిటర్స్ కథనం ప్రచురించింది. యుద్ధానికి ముందు రోజుకు సగటున 140 నౌకలు హోర్ముజ్ మీదుగా ప్రయాణించేవని పేర్కొంది.