Share News

ఇరాన్‌ దెబ్బ.. అమెరికా అబ్బ!

ABN , Publish Date - Sep 16 , 2026 | 06:08 AM

ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా దారుణంగా నష్టపోయింది. అనేక యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, ఇతర ఆయుధ సంపత్తిని మాత్రమే కాదు..

ఇరాన్‌ దెబ్బ.. అమెరికా అబ్బ!

  • యుద్ధంలో 50కిపైగా యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు, గగనతల రీఫిల్లింగ్‌ ట్యాంకర్లు, డ్రోన్లు ధ్వంసం

  • వాటిలో ఎఫ్‌-35ఏ కూడా..

  • మొత్తంగా రూ.37,258 కోట్ల నష్టం.. వెల్లడించిన అమెరికా రక్షణశాఖ

వాషింగ్టన్‌, సెప్టెంబరు 15: ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా దారుణంగా నష్టపోయింది. అనేక యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, ఇతర ఆయుధ సంపత్తిని మాత్రమే కాదు.. గల్ఫ్‌ దేశాల్లో అమెరికా సైనిక, దౌత్య కార్యకలాపాలకు సంబంధించిన వందలాది భవనాలు, మౌలిక సదుపాయాలు నేలమట్టమయ్యాయి. యుద్ధం ప్రభావం అమెరికా మీద ఏ స్థాయిలో ఉందంటే.. ప్రస్తుతం అగ్రరాజ్యం ఆయుధాలు, మందుగుండు కొరతను ఎదుర్కొంటోంది. ఈ విషయాన్ని స్వయంగా అమెరికానే వెల్లడించటం గమనార్హం. ఆ దేశ రక్షణశాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ సోమవారం విడుదల చేసిన నివేదికలో.. ఇరాన్‌తో ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి జూన్‌ 30 వరకు జరిగిన యుద్ధంలో సంభవించిన నష్టాలను పూసగుచ్చారు. దీని ప్రకారం ఒక ఎఫ్‌-35ఏ విమానం (ఇది అమెరికా వద్దనున్న అత్యాధునిక ఫైటర్‌జెట్‌. యుద్ధరంగంలో శత్రువు దీనిని దెబ్బతీయటం ఇదే తొలిసారి), నాలుగు ఎఫ్‌-15ఈ యుద్ధవిమానాలు, ఒక ఏ-10 యుద్ధవిమానం, ఏడు కేసీ-135 భారీ గగనతల ఇంధన రీఫిల్లింగ్‌ ట్యాంకర్లు, ఒక ఈ-3 సెంట్రీ విమానం, ఒక హెచ్‌హెచ్‌-60డబ్ల్యూ హెలికాప్టర్‌, ఒక ఎంక్యూ-4సీ ట్రిటోన్‌ నిఘా విమానం, నాలుగు ఏహెచ్‌-6 హెలికాప్టర్లు, ఒక ఏహెచ్‌-64 అపాచీ హెలికాప్టర్‌, ఒక ఎంహెచ్‌-6ఓఎస్ హెలికాప్టర్‌, కనీసం 30 ఎంక్యూ-9 రీపర్‌ మానవ రహిత యుద్ధవిమానాలు నేలకూలాయి.


ఇరాన్‌ దాడుల కారణంగా 18 మంది అమెరికా సైనికులు మరణించగా.. 417 మంది గాయపడ్డారు. ఇరాన్‌పై యుద్ధం కోసం అమెరికా 3,340 కోట్ల డాలర్లు వ్యయం చేసిందని, దీంట్లో ఆయుధాలు, మందుగుండు మీదనే 2,230 కోట్ల డాలర్లు ఖర్చు అయ్యిందని ఈ నివేదిక వెల్లడించింది. యుద్ధానికి సంబంధించిన ఇతర ఖర్చుల కింద మరో 740 కోట్ల డాలర్లు అమెరికా రక్షణ శాఖ వ్యయం చేసిందని తెలిపింది (మొత్తం 4,080 కోట్ల డాలర్లు=రూ.3,91,385 కోట్లు). కాగా, ఇరాన్‌ దాడిలో 370 కోట్ల డాలర్ల విలువైన ఆయుధ సామగ్రి, 18.40 కోట్ల డాలర్ల విలువైన భవనాలు, మౌలిక సదుపాయలు ధ్వంసమయ్యాయని(రూ.37,258 కోట్లు) పేర్కొంది. యుద్ధం ప్రారంభంలో ఇరాన్‌ మీద భారీ ఎత్తున ఆయుధాలను ప్రయోగించటంతో.. క్రమేణా ఆయుధాల కొరత ఏర్పడిందని తెలిపింది. తద్వారా తమ వద్ద కుప్పలుగా ఆయుధాలు ఉన్నాయన్న ట్రంప్‌ ప్రకటన అబద్ధమని కుండబద్ధలు కొట్టింది.


ఇజ్రాయెల్‌ను సాయం కోరిన సౌదీ!

ముస్లింలకు అత్యంత పవిత్రమైన మక్కా నగరంతోపాటు పశ్చిమతీరంలోని పలు పట్టణాలపై క్షిపణి, డ్రోన్‌ దాడులు జరగొచ్చంటూ సౌదీ అరేబియా తన పౌరులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్‌ దాడుల తీవ్రత పెరుగుతుండడంతో సౌదీ ఈ హెచ్చరికలు చేసింది. మరోవైపు హౌతీ దాడులను ఎదుర్కోవడంలో సౌదీ అరేబియాకి మిత్రదేశమైన పాకిస్థాన్‌ సహాయం చేయడానికి నిరాకరించింది. దీంతో సాయం కోసం సౌదీ అరేబియా ఇజ్రాయెల్‌ను సంప్రదించినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

అంతరిక్షంలో ఆయుధాలు మోహరించాం: అమెరికా

శత్రువుల నుంచి పొంచి ఉన్న ముప్పు దృష్ట్యా అంతరిక్షంలో ఆయుధాలను మోహరించామని అమెరికా వెల్లడించింది. అమెరికాలోని మేరీల్యాండ్‌లో జరిగిన వార్షిక ‘వాయు, అంతరిక్ష, సైబర్‌ సదస్సు’లో చైనా, రష్యాలను పరోక్షంగా ఉద్దేశించి అమెరికా వాయుసేన మంత్రి ట్రాయ్‌ మీంక్‌ ఈ ప్రకటన చేశారు. తమకు ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో అంతరిక్షంలో నియంత్రణ కోసం ఆయుధాల మెహరింపు జరిగిందని తెలిపారు. అయితే, అవి ఎటువంటి ఆయుధాలు అన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. అమెరికా మీద ‘గోల్డెన్‌ డోమ్‌ క్షిపణి రక్షణ వ్యవస్థ’ను నిర్మిస్తామని ట్రంప్‌ గతంలో ప్రకటించారు. దాంట్లో భాగంగానే అంతరిక్ష ఆయుధాల మోహరింపు జరిగి ఉంటుందన్న అంచనాలున్నాయి.

Updated Date - Sep 16 , 2026 | 06:09 AM