Share News

పొరుగు దేశాలపై ఇరాన్‌ దాడులను ఆపాలి

ABN , Publish Date - Mar 20 , 2026 | 05:00 AM

పొరుగు దేశాలపై చేస్తోన్న దాడులను ఇరాన్‌ తక్షణమే ఆపాలని అరబ్‌, ఇస్లామిక్‌ దేశాలకు చెందిన పలువురు విదేశాంగ శాఖ మంత్రులు గురువారం డిమాండ్‌ చేశారు.

పొరుగు దేశాలపై ఇరాన్‌ దాడులను ఆపాలి

  • గల్ఫ్‌, ఇస్లామిక్‌ దేశాల డిమాండ్‌

రియాద్‌, మార్చి 19: పొరుగు దేశాలపై చేస్తోన్న దాడులను ఇరాన్‌ తక్షణమే ఆపాలని అరబ్‌, ఇస్లామిక్‌ దేశాలకు చెందిన పలువురు విదేశాంగ శాఖ మంత్రులు గురువారం డిమాండ్‌ చేశారు. అజర్‌బైజన్‌, బహ్రెయిన్‌, ఈజిప్ట్‌, జోర్దాన్‌, కువైట్‌, లెబనాన్‌, పాకిస్థాన్‌, ఖతార్‌, సౌదీ అరేబియా, సిరియా, తుర్కియే, యూఏఈ దేశాల విదేశాంగ మంత్రులు రియాద్‌లో గురువారం సమావేశమయ్యారు. పొరుగున ఉన్న గల్ఫ్‌ దేశాల్లోని ఇంధన మౌలిక వసతుల, నివాస సముదాయాలపై బాలిస్టిక్‌ క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్‌ చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఈ సమావేశం అనంతరం ఓ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఇరాన్‌ తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. యూఎన్‌ చార్టర్‌లోని ఆర్టికల్‌ 51 ప్రకారం తమని తాము రక్షించుకునే హక్కు ఆయా దేశాలకు ఉంటుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ ఇరాన్‌ ఇప్పటికైనా దాడులను ఆపాలని స్పష్టం చేశారు. అలాగే, లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ చేస్తోన్న దాడులను కూడా ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులు ఖండించారు. ఇరుదేశాలూ చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకొని, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డారు.

Updated Date - Mar 20 , 2026 | 05:00 AM