Share News

హోర్ముజ్‌ జలసంధి మూసివేత

ABN , Publish Date - Mar 04 , 2026 | 04:04 AM

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్‌ జలసంధిని మూసివేస్తున్నట్టు ఇరాన్‌ ప్రకటించింది. ఆ దారిలో వచ్చే ఏ నౌకపై అయినా కాల్పులు జరుపుతామని ‘ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌....

హోర్ముజ్‌ జలసంధి మూసివేత

  • ఆ దారిన వెళ్లే నౌకల్ని పేల్చేస్తాం

  • ఐఆర్‌జీసీ జనరల్‌ ఎబ్రహీం జబ్బరీ హెచ్చరిక

టెహ్రాన్‌: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్‌ జలసంధిని మూసివేస్తున్నట్టు ఇరాన్‌ ప్రకటించింది. ఆ దారిలో వచ్చే ఏ నౌకపై అయినా కాల్పులు జరుపుతామని ‘ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌’ సీనియర్‌ అధికారి ఎబ్రహీం జబ్బరీ తెలిపినట్టు రాయ్‌టర్స్‌ వార్తాసంస్థ ఒక కథనంలో పేర్కొంది. అంతేకాదు.. యుద్ధంలో భాగంగా తమదేశంలోని ముఖ్య కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తే, పశ్చిమాసియాలోని అన్ని ఆర్థిక కేంద్రాలనూ సర్వనాశనం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే హోర్ముజ్‌ జలసంధిని మూసివేయడం వల్ల చమురు ధర బ్యారెల్‌ 80 డాలర్లకు చేరుకుందని.. త్వరలోనే క్రూడాయిల్‌ ధర బ్యారెల్‌ 200 డాలర్లకు చేరుతుందని జబ్బరీ పేర్కొన్నట్టు అల్‌జజీరా సంస్థ తన కథనంలో వెల్లడించింది. పర్షియన్‌ గల్ఫ్‌ను, ఓమన్‌ గల్ఫ్‌ను కలుపుతూ 33 కిలోమీటర్ల వెడల్పున ఉండే హోర్ముజ్‌ జలసంధిని స్ట్రాటజిక్‌ చోక్‌పాయింట్‌గా వ్యవహరిస్తారు! ఎందుకంటే.. ఈ జలసంధిని మూసివేస్తే ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం ఆగిపోతుంది. భారతదేశం తన చమురు అవసరాల్లో దాదాపుగా 40 నుంచి 55 శాతం మేర గల్ఫ్‌ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఈ మార్గం మూసేయడం వల్ల ఇప్పటికప్పుడు భారత్‌పై తీవ్ర ప్రభావం పడకపోవచ్చుగానీ.. 2-3 వారాలకు మించి మూసివేత కొనసాగితే మాత్రం భారత్‌కు ఇబ్బందులు తప్పవు. అందుకే కేంద్రం ఇప్పటికే అప్రమత్తమై ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. రష్యా, అమెరికాతోపాటు కొన్ని ఆఫ్రికా దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది.

ఇరాన్‌ అణుబాంబు తయారు చేసేది: నెతన్యాహు

ఇరాన్‌ తన అణు కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించినందువల్లే ఆ దేశంపై దాడి చేయాల్సి వచ్చిందని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు అన్నారు. తాము అమెరికాతో కలిసి దాడులు చేయకపోతే కొన్ని నెలల్లోనే ఇరాన్‌ అణుబాంబును తయారు చేసేదని పేర్కొన్నారు. ‘‘ఇరాన్‌ కొత్తగా అనేక ప్రాంతాల్లో సొరంగాలు తవ్వి అణు కేంద్రాలను, బంకర్లను నిర్మిస్తోంది. బాలిస్టిక్‌ మిసైళ్లను, అణుబాంబులను తయారు చేసి అందులో దాచేయాలని ప్లాన్‌ చేసింది. ఈ సమయంలో ఏ చర్య తీసుకోకపోతే భవిష్యత్తులో ఇరాన్‌ను ఏమీ చేయలేం’’ అని నెతన్యాహు చెప్పారు. మిడిల్‌ ఈస్ట్‌లో 95శాతం సమస్యలకు ఇరానే కారణమన్నారు.

Updated Date - Mar 04 , 2026 | 04:04 AM