Share News

అన్నీ తగలబెట్టేస్తాం!

ABN , Publish Date - Mar 14 , 2026 | 04:28 AM

అమెరికా, ఇజ్రాయెల్‌ గనక తమదేశంలోని చమురు కేంద్రాలను, ఇంధన వసతులను, ఓడరేవులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తే..

అన్నీ తగలబెట్టేస్తాం!

  • మా ఇంధన వసతులపై దాడి చేస్తే విధ్వంసకరంగా స్పందిస్తాం

  • అమెరికా, దాని మిత్ర దేశాల చమురు, గ్యాస్‌ మౌలికవసతులను నాశనం చేస్తాం: ఐఆర్‌జీసీ

న్యూఢిల్లీ, మార్చి 13: అమెరికా, ఇజ్రాయెల్‌ గనక తమదేశంలోని చమురు కేంద్రాలను, ఇంధన వసతులను, ఓడరేవులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తే.. అత్యంత తీవ్రమైన, విధ్వంసకరమైన ప్రతిస్పందన ఉంటుందని ఇరాన్‌ హెచ్చరించింది! అలాంటి దాడులకు ప్రతిగా.. అమెరికా, దాని మిత్రదేశాలకు సంబంధించి పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్నచమురు, గ్యాస్‌ మౌలికసదుపాయాలన్నింటినీ తగలబెట్టి సర్వనాశనం చేస్తామని ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ ఒక ప్రకటన ద్వారా తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. మరోవైపు.. ట్రంప్‌ ఘోరమైన తప్పుడు అంచనాతో ఈ యుద్ధాన్ని ప్రారంభించారని ఇరాన్‌కు చెందిన అగ్రశ్రేణి భద్రతాధికారి అలి లారిజానీ మండిపడ్డారు. ‘‘తాను శీఘ్ర విజయం కోసం చూస్తున్నానని ట్రంప్‌ చెబుతున్నారు. యుద్ధాన్ని ప్రారంభించడం సులభమే కానీ.. కొన్ని ట్వీట్లతో దాన్ని గెలవలేరు. ఈ ఘోరమైన తప్పుడు అంచనా వేసినందుకుగాను మీరు పశ్చాత్తాపపడే స్థితి వచ్చేవరకూ మేం వెనక్కి తగ్గం’’ అని ఆయన ‘ఎక్స్‌’లో ఒక పోస్టు పెట్టారు. కాగా.. ఐఆర్‌జీసీ హెచ్చరికల నేపథ్యంలో హోర్ముజ్‌ జలసంధి వద్ద చిక్కుకుపోయిన ఎనిమిది భారత ఎల్పీజీ ట్యాంకర్లను సురక్షితంగా ఇండియాకు తీసుకొచ్చేందుకు మన అధికారులు ఇరాన్‌ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఈ విషయంలో ఇరాన్‌ అధికారులు సానుకూలంగా స్పందిస్తున్నారని.. త్వరలోనే ఆ నౌకలు హోర్ముజ్‌ను దాటే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దేశంలో వంటగ్యాస్‌ కొరతపై ఆందోళన పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఎల్పీజీ లభ్యతను పెంచేందుకు కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. ఇరాన్‌కు చెందిన దాదాపు 250 మంది నావికులు ప్రస్తుతం భారతదేశంలో ఉన్నారు. వారంతా తమ దేశానికి తిరిగి వెళ్లడానికి వేచిచూస్తున్నారు. వారికి ఆశ్రయం ఇచ్చిన భారత ప్రభుత్వం.. తిరిగి వెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. తద్వారా.. ‘‘మీవారికి మానవతా సాయం అందిస్తున్నాం కాబట్టి మా గ్యాస్‌/ముడిచమురు సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోండి’’ అనే పరోక్ష సంకేతాన్ని భారత ప్రభుత్వం ఇరాన్‌కు పంపుతోంది. హోర్ముజ్‌ జలసంధి మూసివేత కారణంగా.. మన దేశానికి చెందిన 28 నౌకలు అక్కడ చిక్కుకుపోయాయి. వాటిలో 24 నౌకలు 677 మంది సిబ్బందితో హోర్ముజ్‌ జలసంధికి పశ్చిమం వైపున (పర్షియన్‌ గల్ఫ్‌వైపు) నిలిచిపోగా.. 101 మంది సిబ్బందితో నాలుగు నౌకలు తూర్పు వైపున (ఓమన్‌ గల్ఫ్‌ వైపు.. అంటే, లోపలికి వెళ్లలేక) ఆగిపోయాయి.

Updated Date - Mar 14 , 2026 | 04:28 AM