అమెరికా దాడికి దిగితే ప్రతీకార దాడులు తప్పవు
ABN , Publish Date - Feb 09 , 2026 | 01:32 AM
అమెరికా ఇరాన్‌పై దాడి చేస్తే పశ్చిమాసియాలోని ఆ దేశ సైనిక స్థావరాలపై విరుచుకుపడతామని ఇరాన్ హెచ్చరించింది. అయితే ఈ దాడులను అమెరికా సైన్యానికి ఆతిథ్యం ఇస్తున్న దేశాలపై దాడులుగా చూడకూడదని...
ఆ దేశ సైనిక స్థావరాలపై విరుచుకుపడతాం: ఇరాన్
కైరో, ఫిబ్రవరి 8: అమెరికా ఇరాన్‌పై దాడి చేస్తే పశ్చిమాసియాలోని ఆ దేశ సైనిక స్థావరాలపై విరుచుకుపడతామని ఇరాన్ హెచ్చరించింది. అయితే ఈ దాడులను అమెరికా సైన్యానికి ఆతిథ్యం ఇస్తున్న దేశాలపై దాడులుగా చూడకూడదని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ అన్నారు. ఇరాన్ అణు కార్యక్రమం గురించి పరోక్ష చర్చలు కొనసాగించడానికి టెహ్రాన్, వాషింగ్టన్ అంగీకరించిన మరుసటి రోజే అరాఖ్చీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒమన్‌లో చర్చలు సానుకూలంగా జరిగాయని అంతకుముందు ఇరు పక్షాలు తెలిపాయి. అయితే తదుపరి చర్చల విషయమై తేదీ నిర్ణయించలేదని అరాఖ్చీ చెప్పగా.. వచ్చే వారం మొదట్లో చర్చలు జరగవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇటు.. ఇరాన్‌లో పౌరుల తిరుగుబాటుకు 114 మంది నోబెల్ గ్రహీతల బృందం మద్దతు పలికింది. ఇరాన్ వ్యాప్తంగా మతాధికారుల నియంతృత్వం, క్రూరమైన అణచివేతను ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదిలాఉండగా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జైల్లో నిరాహార దీక్షకు దిగిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్ మొహమ్మదీకి ఇరాన్ కోర్టు ఏడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది.