ట్రాన్స్‌పాండర్ ఆపేసి..పక్కనే మరో విమానాన్ని నడిపి..!
ABN , Publish Date - Apr 12 , 2026 | 03:23 AM
చర్చల కోసం ఇస్లామాబాద్‌కు వచ్చిన ఇరాన్, అమెరికా బృందాలకు పశ్చిమాసియా ప్రాంతం నుంచి పాకిస్థాన్ యుద్ధ విమానాలు రక్షణగా నిలిచాయి...
వ్యూహాత్మకంగా పాక్‌కు ఇరాన్ బృందం విమానం
ఇస్లామాబాద్, ఏప్రిల్ 11: చర్చల కోసం ఇస్లామాబాద్‌కు వచ్చిన ఇరాన్, అమెరికా బృందాలకు పశ్చిమాసియా ప్రాంతం నుంచి పాకిస్థాన్ యుద్ధ విమానాలు రక్షణగా నిలిచాయి. కీలక వ్యక్తులు ప్రయాణిస్తుండటంతో దాడులు జరిగే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో భారీ స్థాయిలో రక్షణ ఏర్పాట్లు చేశారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు 400 కిలోమీటర్ల దూరంలో కాస్పియన్ సముద్ర ప్రాంతంలో ఉన్న గోర్గన్ విమానాశ్రయం నుంచి ఎయిర్‌బస్ ఏ300 విమానంలో ఇరాన్ బృందం బయలుదేరింది. ఒక అవాక్స్ గగనతల నిఘా విమానంతోపాటు పలు పాకిస్థాన్ ఫైటర్ జెట్లు దానికి రక్షణగా వచ్చాయి. రాడార్లలో కనిపించకుండా ఇరాన్ బృందం విమానంలోని ట్రాన్స్‌పాండర్‌ను ఆఫ్ చేశారు. దానికితోడు ఆ విమానానికి సమాంతరంగా పాకిస్థాన్‌కు చెందిన ఎయిర్‌బస్ ఏ321 పౌర విమానాన్ని నడిపించారు. ప్రపంచవ్యాప్తంగా రాడార్లన్నీ అది ఇరాన్ విమానమని భావించాయి. ఇక ఇరాన్ బృందం విమానాన్ని నేరుగా పాకిస్థాన్‌కు కాకుండా తొలుత ఆఫ్ఘనిస్థాన్‌వైపు ప్రయాణించి, తర్వాత ఇస్లామాబాద్ వైపు మళ్లించారు. మధ్యలో నూర్‌ఖాన్ ఎయిర్‌బే్‌సలో ఇరాన్ విమానం ల్యాండ్ అయింది. ఇక అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం వచ్చిన అమెరికా ఎయిర్‌ఫోర్స్ విమానం బోయింగ్ సీ-32ఏ చుట్టూ ఐదు పాక్ ఎఫ్-16లు రక్షణగా ప్రయాణించాయి.
ఇరాన్ బృందానికి ఆర్మీ డ్రెస్‌లో.. వాన్స్‌కు సూట్‌లో
చర్చల కోసం ఇస్లామాబాద్‌కు వచ్చిన ఇరాన్, అమెరికా ప్రతినిధులకు స్వాగతం పలికిన సందర్భంగా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ధరించిన వస్త్రాలు చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ గలీబఫ్, విదేశాంగ మంత్రి అరాగ్చీ తదితరులు వచ్చినప్పుడు మునీర్ సైనిక దుస్తుల్లో స్వాగతం పలికారు. అదే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను మాత్రం సూట్‌లో స్వాగతించారు. దీనివెనుక అమెరికా ప్రతినిధి బృందానికి తాను రాజకీయ నాయకుడిలా, దౌత్యపరమైన వ్యక్తిలా హుందాగా కనిపించాలన్న మునీర్ ప్రయత్నం కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఉన్నతస్థాయి చర్చల స్వభావం, వాతావరణాన్ని బట్టి కీలక వ్యక్తులు ధరించే దుస్తులు ఆధారపడి ఉంటాయని పేర్కొంటున్నారు.