ఇప్పటిదాకా ఇంధనం.. ఇకపై ఇంటర్నెట్!
ABN , Publish Date - May 19 , 2026 | 04:18 AM
హోర్ముజ్ మూసివేతతో అమెరికా, ఇరాన్‌ను వ్యూహాత్మకంగా ఎదుర్కొంటున్న ఇరాన్ ఇప్పుడు హోర్ముజ్‌లో సమద్రగర్భంలోని ఇంటర్నెట్ కేబుళ్లపైనా పట్టు బిగించేలా ప్రణాళికలు వేస్తున్నట్టు ఐఆర్‌జీసీ అనుబంధ మీడియా వెల్లడించింది.
సముద్ర గర్భంలోని కేబుల్ వ్యవస్థపై పట్టుకు ఇరాన్ యత్నం
హోర్ముజ్ మూసివేతతో అమెరికా, ఇరాన్‌ను వ్యూహాత్మకంగా ఎదుర్కొంటున్న ఇరాన్ ఇప్పుడు హోర్ముజ్‌లో సమద్రగర్భంలోని ఇంటర్నెట్ కేబుళ్లపైనా పట్టు బిగించేలా ప్రణాళికలు వేస్తున్నట్టు ఐఆర్‌జీసీ అనుబంధ మీడియా వెల్లడించింది. ఈ ఇంటర్నెట్ కేబుళ్ల నిర్వహణ, రిపేర్లపై ఇక నుంచి ఇరాన్ రుసుములు విధించనుందని తెలిపింది. ఇదే జరిగితే.. ప్రపంచ డిజిటల్ వ్యవస్థ తీవ్ర అంతరాయానికి గురయ్యే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. దిగ్గజ కంపెనీలైన గూగుల్, మెటా, అమెజాన్, మైక్రోసా్‌ఫ్టలకు చెందిన కంప్యూటింగ్ డేటా సహా ఆర్థిక లావాదేవీలు, ఏఐ వర్క్ లాడ్స్, కమ్యూనికేషన్ హాండిళ్లను ఇరాన్ తన నియంత్రణలోకి తీసుకున్నట్టు అవుతుంది. దాదాపు ప్రపంచ ఇంటర్నెట్ ప్రసారాలన్నీ కేబుళ్ల ద్వారా కడలి గర్భం నుంచే జరుగుతున్నాయి. వీటికి అంతరాయం కలిగితే.. వాట్సాప్, గూగుల్ సెర్చ్ సహా స్టాక్ మార్కెట్లు, క్లౌడ్ కంప్యూటింగ్‌పై ప్రభావం పడనుంది. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థ భారీగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అలానే లాజిస్టిక్స్ నెట్‌వర్క్, ఫైనాన్షియల్ మార్కెట్లు, ఎంటర్‌ప్రైజెస్ కమ్యూనికేషన్స్ కూడా తీవ్ర ప్రభావానికి గురవుతాయి. విద్యుత్‌కు పవర్ గ్రిడ్స్ మాదిరిగా.. డేటా, ఇంటర్నెట్‌లకు సముద్ర గర్భ కేబుళ్లు అత్యంత కీలకమని నిపుణులు చెబుతున్నారు. గల్ఫ్ ప్రాంతం ప్రస్తుతం ఏఐ, డేటా కేంద్రాలకు హబ్‌గా ఉందని.. యూఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాయని పేర్కొన్నారు. కాగా, కడలి కేబుల్ వ్యవస్థపై ఇరాన్ పట్టుబిగిస్తే..ఆ ప్రభావం భారత్‌పై మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా. భారత్ నుంచి యూరప్ దేశాలకు వెళ్లే కేబుల్ వ్యవస్థ పూర్తిగా గల్ఫ్, ఎర్రసముద్ర మార్గం నుంచే ఉంది. ఈ మార్గంలో ఏ చిన్న అంతరాయం కలిగినా.. భారత్‌లోని ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాంలకు ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. - సెంట్రల్ డెస్క్