గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు
ABN , Publish Date - Mar 01 , 2026 | 02:58 AM
అమెరికా, ఇజ్రాయెల్‌ల ఉమ్మడి దాడితో ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. తొలుత ఇజ్రాయెల్‌పైకి క్షిపణులను ప్రయోగించింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్‌ల ఉమ్మడి దాడితో ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. తొలుత ఇజ్రాయెల్‌పైకి క్షిపణులను ప్రయోగించింది. చాలా వరకు క్షిపణులను ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు అడ్డుకోగలిగినా.. రాజధాని టెల్ అవీవ్‌తోపాటు దేశ ఉత్తర ప్రాంతాల్లో పలుచోట్ల ఇరాన్ క్షిపణి దాడులతో పేలుళ్లు జరిగాయి. ఇజ్రాయెల్ తమ దేశ పౌరులందరినీ అప్రమత్తం చేసింది. కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. బాంబు షెల్టర్లకు సమీపంలో ఉండాలని సూచనలు చేసింది. మరోవైపు గల్ఫ్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలపైనా ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. ఖతార్‌లోని అల్ ఉదీద్ ఎయిర్‌బేస్, కువైట్‌లోని అల్ సలేమ్ ఎయిర్‌బేస్, యూఏఈలోని అల్ ధాఫ్రా ఎయిర్‌బేస్, బహ్రెయిన్‌లోని యూఎస్ ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం, సౌదీలోని రియాద్, జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపైకి కూడా క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించింది. ఖతార్‌లోని దోహాలో, దుబాయ్‌లో వరుసగా పేలుళ్లు జరిగాయి. అంతేకాదు.. ఇప్పుడు తాము ప్రయోగించినవి కేవలం ఉత్త తుప్పుపట్టిన క్షిపణులేనని, ఇరాన్ వద్ద ఉన్నవాటిలో అవి కొన్ని మాత్రమేనని ఐఆర్‌జీసీ మేజర్ జనరల్ ఇబ్రహీం జబారి ప్రకటించారు. అవసరమైతే ఇంతకుముందెన్నడూ చూడని ఆయుధాలను బయటికి తీస్తామని అమెరికా, ఇజ్రాయెల్‌లను హెచ్చరించారు. ఇరాన్ క్షిపణి దాడి, వాటిని మధ్యలోనే అడ్డుకోవడంతో క్షిపణి శకలాలు పడి అబుధాబిలో ఒకరు, దుబాయ్‌లో మరొకరు చనిపోయారు. దుబాయ్‌లోని ప్రపంచంలోనే అతి ఎత్తయిన భవనం బుర్జ్ ఖలీఫాకు సమీపంలోని ఓ భవనంపై ఇరాన్ డ్రోన్ దాడి జరిగింది. పదుల సంఖ్యలో గాయపడ్డారు.