Share News

ఇజ్రాయెల్‌ అణుకేంద్రంపై దాడి

ABN , Publish Date - Mar 23 , 2026 | 07:21 AM

తమ దేశంలోని నతాంజ్‌ అణుకేంద్రంపై దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌లోని డిమోనా అణుకేంద్రంపై ఇరాన్‌ క్షిపణులతో దాడి చేసింది.

ఇజ్రాయెల్‌ అణుకేంద్రంపై దాడి

  • నతాంజ్‌ అణుకేంద్రంపై దాడికి ప్రతీకారంగా క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్‌

  • డిమోనా, అరద్‌ పట్టణాల్లో విధ్వంసం

  • 180 మందికిపైగా గాయాలు

టెల్‌అవీవ్‌/దుబాయ్‌, మార్చి 22: తమ దేశంలోని నతాంజ్‌ అణుకేంద్రంపై దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌లోని డిమోనా అణుకేంద్రంపై ఇరాన్‌ క్షిపణులతో దాడి చేసింది. శనివారం అర్ధరాత్రి అనంతరం జరిగిన ఈ దాడుల్లో షిమోన్‌ పెరెస్‌ అణుపరిశోధన కేంద్రంతోపాటు డిమోనా నగరం, పక్కనే ఉన్న అరద్‌ పట్టణంలోనూ క్షిపణులు విధ్వంసం సృష్టించాయి. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి. 180 మందికిపైగా గాయపడ్డారని, అందులో పది మంది పరిస్థితి విషమంగా ఉందని ఇజ్రాయెల్‌ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎవరూ మరణించలేదని పేర్కొంది. అయితే భవనాలు కుప్పకూలి, తీవ్ర విధ్వంసం జరిగిందని.. శిథిలాలను తొలగిస్తే మృతులెవరైనా బయటపడొచ్చని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇరాన్‌ దాడుల్లో 4,564 మంది గాయపడినట్టు ఇజ్రాయెల్‌ ఆరోగ్య, సంక్షేమ శాఖ తెలిపింది. 2,700 మంది తమ ఇళ్లను ఖాళీ చేశారని వెల్లడించింది.


రక్షణ వ్యవస్థలు విఫలం!

ఇరాన్‌ ప్రయోగించిన రెండు బాలిస్టిక్‌ క్షిపణులు డిమోనా, అరద్‌ నగరాలను నేరుగా తాకి పేలుళ్లు సృష్టించాయి. గగనతల రక్షణ వ్యవస్థలు ఇంటర్‌సెప్టర్‌ క్షిపణులను ప్రయోగించినా.. అవి ఇరాన్‌ క్షిపణులను అడ్డుకోవడంలో విఫలమయ్యాయి. దీనిపై విచారణ జరుపుతున్నామని ఇజ్రాయెల్‌ రక్షణ దళాల ప్రతినిధి బ్రిగేడియర్‌ జనరల్‌ డెఫ్రిన్‌ తెలిపారు. కాగా, ఇరాన్‌ క్షిపణి సామర్థ్యాన్ని దాదాపు నాశనం చేశామని ఇజ్రాయెల్‌ ఇటీవల పలుమార్లు పేర్కొన్న నేపథ్యంలో ఈ క్షిపణి దాడులు చర్చనీయాంశంగా మారాయి. కాగా, డిమోనా అణు కేంద్రంపై ఇరాన్‌ క్షిపణి దాడితో రేడియోషన్‌ లీకవుతోందనే ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) వెల్లడించింది. పరస్పరం అణుకేంద్రాలపై దాడులు చేసుకోవడం నిలిపేయాలని విజ్ఞప్తి చేసింది.


ప్రపంచ దేశాలు యుద్ధంలో భాగస్వాములు కావాలి: నెతన్యాహు

అరద్‌ పట్టణంలో క్షిపణి దాడి జరిగిన ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు పరిశీలించారు. అమెరికా-ఇజ్రాయెల్‌లు ప్రపంచాన్ని కాపాడటం కోసమే పోరాడుతున్నాయని చెప్పారు. ప్రపంచ దేశాలు ఈ యుద్ధంలో భాగం కావాలని, ఇరాన్‌ను అంతం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. గత రెండు రోజుల ఇరాన్‌ దాడులను చూస్తే.. ఆ దేశం ఏం చేయగలదో, ఎంత దుర్మార్గానికి పాల్పడగలదో ప్రపంచానికి అర్థమైందని వ్యాఖ్యానించారు. ‘‘4 వేల కిలోమీటర్ల దూరంలోని డీగో గార్సియాపైకి ఇరాన్‌ క్షిపణులను ప్రయోగించింది. యూర్‌పలోని పారిస్‌, బెర్లిన్‌, లండన్‌ సహా ప్రధాన ప్రాంతాలన్నింటికీ ఇరాన్‌ క్షిపణులతో ముప్పు ఉందన్న విషయం స్పష్టమైంది. మాకు మాత్రమే కాదు, యూర్‌పకు, ప్రపంచానికి ఇరాన్‌తో ముప్పు ఉంది. పౌర ప్రాంతాలను, జేరుసలేంలో ఇస్లాం, యూదు, క్రిస్టియన్‌ మూడు మతాలకు పవిత్రమైన ప్రదేశాలను ఇరాన్‌ లక్ష్యం చేసుకోవడం వారి నిజరూపాన్ని స్పష్టం చేస్తోంది. ఇరాన్‌ అంతర్జాతీయ జల మార్గాన్ని, ఇంధన మార్గాన్ని అడ్డుకుని ప్రపంచాన్ని బ్లాక్‌మెయిల్‌ చేస్తోంది. ఇరాన్‌తో ప్రపంచానికి ముప్పు అని వీటన్నింటి కంటే మించి ఇంకే ఆధారాలు కావాలి? ఇరాన్‌పై పోరాటంలో ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలి’’ అని నెతన్యాహు పిలుపునిచ్చారు.


యుద్ధం సమీకరణాలు మారుతున్నాయి: ఐఆర్‌జీసీ

పశ్చిమాసియా యుద్ధంలో సమీకరణాలు మారుతున్నాయని.. ఇజ్రాయెల్‌ గగనతలానికి ఇక రక్షణేదీ లేనట్టేనని ఐఆర్‌జీసీ పేర్కొంది. ఇజ్రాయెల్‌పై తాజాగా చేసిన దాడుల్లో 200 మంది చనిపోయారని పేర్కొంది. అత్యాధునిక క్షిపణులు, డ్రోన్‌ వ్యవస్థలతో శనివారం అర్ధరాత్రి తర్వాత ఇజ్రాయెల్‌తోపాటు పశ్చిమాసియా వ్యాప్తంగా దాడులు చేశామని వెల్లడించింది. ఇజ్రాయెల్‌ గగనతల రక్షణ వ్యవస్థలు దెబ్బతిన్నాయని.. దానితో అరద్‌, డిమోనా, ఇలాత్‌, బీర్‌ షెవా, కిర్యత్‌గట్‌ తదితర ప్రాంతాల్లో ఇరాన్‌ క్షిపణులు తీవ్ర విధ్వంసం సృష్టించాయని పేర్కొంది. మృతుల సంఖ్యను, నష్టాన్ని ఇజ్రాయెల్‌ దాచిపెడుతోందని ఆరోపించింది. కాగా, ఆదివారం ఇజ్రాయెల్‌లోని బెన్‌గురియన్‌ విమానాశ్రయం, దానికి సమీపంలోని ప్రభుత్వ ఏరోస్పేస్‌ డిఫెన్స్‌ పరిశ్రమపై దాడులు చేసినట్టు ఐఆర్‌జీసీ ప్రకటించింది.

Updated Date - Mar 23 , 2026 | 07:22 AM