హిజాబ్ లేకుండా పాట.. 74 కొరడా దెబ్బలు
ABN , Publish Date - Nov 25 , 2026 | 03:27 AM
మహిళల అణచివేతను ఎత్తిచూపే మరో ఘటన ఇరాన్‌లో వెలుగుచూసింది. సంగీత కచేరీలో హిజాబ్ లేకుండా పాట పాడినందుకు ప్రముఖ గాయని పరస్తూ అహ్మదీకి ఇరాన్..
ప్రముఖ గాయనికి ఇరాన్ న్యాయస్థానం శిక్ష
న్యూఢిల్లీ, నవంబరు 24: మహిళల అణచివేతను ఎత్తిచూపే మరో ఘటన ఇరాన్‌లో వెలుగుచూసింది. సంగీత కచేరీలో హిజాబ్ లేకుండా పాట పాడినందుకు ప్రముఖ గాయని పరస్తూ అహ్మదీకి ఇరాన్ న్యాయస్థానం 74 కొరడా దెబ్బల శిక్ష విధించింది. అహ్మదీతోపాటు ఆ బృందంలోని మరో నలుగురికి కూడా ఒక్కొక్కరికీ 74 కొరడా దెబ్బల శిక్ష అమలు చేసినట్టు ఆమె తరఫు న్యాయవాది మొస్తాఫా నీలీ వెల్లడించారు. 29 ఏళ్ల పరస్తూ అహ్మదీకి ఇరాన్‌లో మంచి గాయనిగా పేరుంది. 2024 డిసెంబరులో ఖోమ్ నగరంలో ఏర్పాటుచేసిన సంగీత కచేరీ సందర్భంగా ఆమె మరో నలుగురితో కలిసి హిజాబ్ లేకుండా పాటలు పాడారు. ఈ సందర్భంగా వారంతా బ్లాక్ కలర్ డ్రెస్‌లు ధరించగా.. అహ్మదీ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో కనిపించారు. దీనిపై ఇరాన్ న్యాయస్థానం కేసు నమోదు చేసింది. ఈ నెల 23న గాయని అహ్మదీతోపాటు ఆమె బృందంలోని నలుగురు సభ్యులకు శిక్ష అమలు చేశారు.