Share News

ఐదు షరతులతో..సంధికి ఇరాన్‌ సై

ABN , Publish Date - Mar 30 , 2026 | 04:24 AM

అమెరికాతో సంధి చర్చల కోసం ఇరాన్‌ ముందుకొచ్చింది. కానీ ఐదు షరతులను ముందు పెట్టింది. వాటికి అంగీకరిస్తేనే చర్చలు జరుపుతామని స్పష్టం చేసింది....

ఐదు షరతులతో..సంధికి ఇరాన్‌ సై

  • అమెరికా, ఇజ్రాయెల్‌ వెంటనే దాడులు ఆపాలి

  • భవిష్యత్తులో కూడా దాడులు చేయకూడదు

  • అమెరికా హామీలు అమలు చేసేలా బాధ్యత తీసుకుంటామని ‘చర్చల కూటమి’ హామీ ఇవ్వాలి

  • అమెరికా నుంచి సూత్రప్రాయ అంగీకారం

  • త్వరలోనే తాత్కాలిక కాల్పుల విరమణపై ప్రకటన

  • పాక్‌, ఈజిప్ట్‌, తుర్కియే, సౌదీ దౌత్యవర్గాల వెల్లడి

  • పాక్‌లో నాలుగు దేశాల విదేశాంగ మంత్రుల భేటీ

  • చర్చలు అంటూనే భూతల దాడులకు అమెరికా అధ్యక్షుడి ప్లాన్‌: ఇరాన్‌ స్పీకర్‌

  • యుద్ధ నష్టం రూ.28,455 కోట్లు..!

  • ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ

  • కీలకమైన ‘ఈ-3 అవాక్స్‌’ విమానం ధ్వంసం

  • భారీ సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లు, రాకెట్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడిన ఇరాన్‌, హెజ్బొల్లా

ఇస్లామాబాద్‌/దుబాయ్‌/న్యూఢిల్లీ, మార్చి 29: అమెరికాతో సంధి చర్చల కోసం ఇరాన్‌ ముందుకొచ్చింది. కానీ ఐదు షరతులను ముందు పెట్టింది. వాటికి అంగీకరిస్తేనే చర్చలు జరుపుతామని స్పష్టం చేసింది. ముఖ్యంగా వెంటనే దాడులు నిలిపివేయాలని, భవిష్యత్తులో భద్రతకు హామీ ఇవ్వాలని పేర్కొంది. అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధ విరమణ కోసం ప్రయత్నిస్తున్న పాకిస్థాన్‌, ఈజిప్ట్‌, తుర్కియే, సౌదీ అరేబియా దేశాల ఉన్నతస్థాయి దౌత్యవర్గాలు ఈ వివరాలను వెల్లడించాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ఉపశమనం దిశగా ఇదొక కీలక అడుగు అని పేర్కొన్నాయి. అమెరికా, ఇరాన్‌ త్వరలోనే కాల్పుల విరమణ ప్రకటించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాయి. అమెరికాతో యుద్ధం నిలిపివేతపై చర్చల కోసం ఇరాన్‌ ప్రాథమికంగా పెట్టిన ఐదు షరతులు.. ఒకటి వెంటనే ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులను నిలిపివేయాలి. రెండోది భవిష్యత్తులో దాడులు చేయబోమని ఆ రెండు దేశాల నుంచి కచ్చితమైన హామీ అందాలి. మూడోది ఇరాన్‌ డిమాండ్లను అమెరికా పరిగణనలోకి తీసుకునేలా చూస్తామని, అమెరికా హామీలు అమలు చేసేలా బాధ్యత తీసుకుంటామని పాకిస్థాన్‌, ఈజిప్ట్‌, సౌదీ, టర్కీ గట్టి హామీ ఇవ్వాలి. నాలుగోది యుద్ధంతో ఇరాన్‌లో జరిగిన నష్టానికి తగిన పరిహారం అందేలా చూడాలి. చివరిగా ఆంక్షల ఎత్తివేత, హోర్ముజ్‌ జలసంధిపై ఇరాన్‌ హక్కు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.


ఇలా ఇరాన్‌ పెట్టిన షరతుల విషయంలో నాలుగు దేశాల చర్చల కూటమికి అమెరికా నుంచి సూత్రప్రాయ అంగీకారం వచ్చిందని దౌత్యవర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే మధ్యవర్తిత్వం కోసం తగిన రోడ్‌మ్యా్‌పను సిద్ధం చేసేందుకు ఇస్లామాబాద్‌లో చర్చల కూటమి సమావేశం జరుగుతోందని తెలిపాయి. చర్చల్లో ఇరాన్‌ పాల్గొనేందుకు వీలుగా.. త్వరలోనే తాత్కాలికంగా కాల్పుల విరమణ లేదా దాడుల నిలిపివేతపై ఇరువర్గాల నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉందని వివరించాయి.

ఇస్లామాబాద్‌ వేదికగా చర్చలు

అమెరికా, ఇరాన్‌ యుద్ధ విరమణ దిశగా పాకిస్థాన్‌ చొరవ తీసుకుంది. ఈజిప్ట్‌, తుర్కియే, సౌదీ అరేబియాలతో చర్చల కూటమిగా ఏర్పడి అటు అమెరికాతో, ఇటు ఇరాన్‌తో మాట్లాడుతోంది. ఆ ప్రయత్నాలు కొంత ఫలించి ట్రంప్‌ 15 సూత్రాల ప్రణాళికను పాకిస్థాన్‌ ద్వారా ఇరాన్‌కు పంపారు. వాటిని ఇరాన్‌ పూర్తిగా తిరస్కరించి, తన డిమాండ్లను ముందు పెట్టింది. వాటిని అమెరికా తోసిపుచ్చింది. ఈ క్రమంలో ఇరువైపులా ఒత్తిడి చేసిన చర్చల కూటమి దేశాలు.. కొంత సానుకూలత తీసుకువచ్చినట్టు దౌత్యవర్గాలు చెబుతున్నాయి. దీనితో చర్చల కూటమి పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో సమావేశాలను ఏర్పాటు చేసింది. ఆదివారం పాక్‌, ఈజిప్ట్‌, తుర్కియే, సౌదీ విదేశాంగ మంత్రులు ఇషాక్‌ దార్‌, బద్ర్‌ అబ్దెలాట్టీ, హకాన్‌ ఫిదాన్‌, ప్రిన్స్‌ ఫైసల్‌ బిన్‌ ఫర్హాన్‌ సమావేశమయ్యారు. యుద్ధ విరమణ కోసం మధ్యవర్తిత్వం పశ్చిమాసియాలో పరిస్థితులు, పరస్పర ప్రయోజనాలపై చర్చించారు.

వారం రోజులు కీలకం!

నాలుగు దేశాల చర్చల కూటమి ప్రయత్నాలు ప్రస్తుతానికి సానుకూలంగానే కనిపిస్తున్నాయి. ఇస్లామాబాద్‌లో జరిగే చర్చల్లో ఎలాంటి ఫలితం వెలువడుతుంది? దాని తర్వాత అమెరికా, ఇరాన్‌ ప్రతినిధులు నేరుగా చర్చల్లో పాల్గొంటారా? కాల్పుల విరమణ, హోర్ముజ్‌ను తెరవడంపై ఎలాంటి నిర్ణయాలు రావొచ్చనేది చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా వచ్చే వారం రోజులు కీలకమని.. ఏప్రిల్‌ తొలివారంలో ఉద్రిక్తతలకు పరిష్కారం లభించే అవకాశం ఉందని దౌత్యవేత్తలు చెబుతున్నారు.

ట్రంప్‌కు ఇజ్రాయెల్‌ బ్లాక్‌మెయిల్‌!

ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు చేతిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పావుగా మారారని.. జెఫరీ ఎప్‌స్టీన్‌ కేసును అడ్డుపెట్టుకుని ట్రంప్‌ను ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొసాద్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తోందని ఇరాన్‌ సైన్యం అధికార ప్రతినిధి ఆరోపించారు. ఒకవేళ ట్రంప్‌ ఇరాన్‌పై భూతల దాడులకు దిగితే.. అమెరికా సైనికులు పర్షియన్‌ గల్ఫ్‌ సముద్రంలోని షార్క్‌ చేపలకు ఆహారంగా మారుతారని హెచ్చరించారు.

పరిహారం, హోర్ముజ్‌పై అధికారం కావాలి

అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌లో మౌలిక సదుపాయాలు, ప్రజల ఇళ్లకు భారీగా నష్టం జరిగిందని ఇరాన్‌ ప్రభుత్వ ప్రతినిధి ఫతేమె మొహజెరానీ తెలిపారు. ఈ క్రమంలో ఎలాంటి చర్చలైనా సరే.. తమకు నష్టపరిహారం చెల్లించడం, హోర్ముజ్‌ జలసంధిపై ఇరాన్‌ అధికారాన్ని గుర్తించడం తమ కీలక డిమాండ్లు అని చెప్పారు. సుస్థిర శాంతి దిశగా అడుగులు పడాలని కోరుకుంటున్నామని తెలిపారు.

Updated Date - Mar 30 , 2026 | 06:01 AM