మంటల్లో గల్ఫ్ దేశాలు!
ABN , Publish Date - Apr 06 , 2026 | 04:01 AM
ఇరాన్ దాడుల్లో గల్ఫ్ దేశాలు మంటల్లో చిక్కుకున్నాయి. తమ దేశంలోని పెట్రోకెమికల్ పరిశ్రమలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని చమురు, ఇంధన వ్యవస్థలు....
కువైట్, బహ్రెయిన్, యూఏఈలోని చమురు వ్యవస్థలపై ఇరాన్ దాడులు
దుబాయ్, ఏప్రిల్ 5: ఇరాన్ దాడుల్లో గల్ఫ్ దేశాలు మంటల్లో చిక్కుకున్నాయి. తమ దేశంలోని పెట్రోకెమికల్ పరిశ్రమలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని చమురు, ఇంధన వ్యవస్థలు, ఇతర మౌలిక సదుపాయాలపైనా ఇరాన్ ఆదివారం క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. దీనితో సుమారు ఎనిమిది పెట్రోకెమికల్ కంపెనీల ప్లాంట్లలో మంటలు చెలరేగాయి. బహ్రెయిన్‌లోని గల్ఫ్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీపై, ఆ దేశ ప్రభుత్వానికి చెందిన బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ (బప్కో)పై డ్రోన్ దాడులతో భారీగా మంటలు చెలరేగాయి. బప్కో ప్లాంటులో భారీ ఇంధన ట్యాంకుకు నిప్పు అంటుకుంది. యూఏఈలో భాగమైన అబుధాబిలోని బొరూగ్ పెట్రోకెమికల్ ప్లాంట్‌లో పలుచోట్ల మంటలు చెలరేగాయి. దీనితో ప్లాంటును తాత్కాలికంగా మూసివేశారు. యూఏఈలోని ఖోర్ ఫక్కన్ పోర్టుపై డ్రోన్ దాడి జరిగింది. ఒక నౌకలో మంటలు చెలరేగాయని, ప్రాణనష్టమేమీ జరగలేదని అధికారులు వెల్లడించారు. సౌదీ అరేబియా దక్షిణ ప్రాంతంలోని చమురు క్షేత్రాలపైకి ఇరాన్ క్షిపణులు దూసుకువచ్చాయి. వాటిని మధ్యలోనే అడ్డుకున్నామని సౌదీ రక్షణ శాఖ తెలిపింది. ఇరాన్‌లోని భారీ వంతెన కూల్చివేత, టెహ్రాన్ శివార్లలోని పెట్రోకెమికల్ సంస్థలపై అమెరికా, ఇజ్రాయెల్‌ల దాడులకు ప్రతీకారంగానే ఆదివారం గల్ఫ్ దేశాల్లోని ఇంధన వ్యవస్థలు, మౌలిక సదుపాయాలపై దాడులు చేపట్టామని ఐఆర్‌జీసీ ప్రకటించింది. ఇరాన్‌లో పౌర మౌలిక సదుపాయాలపై మళ్లీ దాడులుగానీ జరిగితే.. ఈసారి గల్ఫ్ దేశాలపై మరింత ఉధృతంగా, దారుణమైన దాడులు చేస్తామని హెచ్చరించింది. ఇజ్రాయెల్‌లోని డిమోనాలోని పెట్రోకెమికల్ కంపెనీలపై దాడులు చేసినట్టు వెల్లడించింది.
దాడులతో కువైట్ కకావికలం
ఆదివారం తెల్లవారుజామున ఇరాన్ దాడులతో కువైట్ కకావికలమైంది. కువైట్ చమురు, ఆర్థిక శాఖల భవనాలు, కువైట్ ఆయిల్ సంస్థ ప్రధాన కార్యాలయంపై డ్రోన్ దాడులు జరిగాయి. దీనితోపాటు ప్రభుత్వ సంస్థ కువైటీ ఆయిల్ అండ్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్‌కు చెందిన ఐదు ప్లాంట్లు, ఇంధన నిల్వ కేంద్రాల్లో మంటలు చెలరేగాయి. తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లినట్టు కంపెనీ ప్రకటించింది. ఇక రెండు విద్యుత్ కేంద్రాలు, మరో రెండు సముద్ర నీటి శుద్ధి కేంద్రాల(డీసాలినేషన్ ప్లాంట్లు)పైనా డ్రోన్ దాడులు జరిగాయి. విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. గల్ఫ్ దేశాల్లో తాగునీటి కోసం చాలా వరకు డీసాలినేషన్ ప్లాంట్లే దిక్కు. కువైట్‌లో అయితే 90శాతం తాగునీరు ఈ ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యేదే కావడం గమనార్హం.