ఇరాన్ తీవ్రంగా ప్రతిఘటించే ప్రమాదం!
ABN , Publish Date - Mar 18 , 2026 | 04:05 AM
ఇరాన్‌పై దాడులు చేస్తే ఆ దేశం తీవ్రస్థాయిలో ప్రతిఘటించే అవకాశం ఉందని యుద్ధానికి ముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను నిఘా వర్గాలు హెచ్చరించాయి.
నిఘా వర్గాల హెచ్చరికలు... ఖాతరు చేయని ట్రంప్
టెల్ అవీవ్/ వాషింగ్టన్: ఇరాన్‌పై దాడులు చేస్తే ఆ దేశం తీవ్రస్థాయిలో ప్రతిఘటించే అవకాశం ఉందని యుద్ధానికి ముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను నిఘా వర్గాలు హెచ్చరించాయి. గల్ఫ్‌లోని అమెరికా మిత్ర దేశాలపై టెహ్రాన్ విరుచుకుపడుతుందని, అలాగే హోర్ముజ్ జలసంధిని మూసేసే ప్రమాదం కూడా ఉందని వివరించినట్లు కొందరు అమెరికా ఉన్నతాధికారులు తెలిపారు. ఈ హెచ్చరికలను ఖాతరు చేయని ట్రంప్ యుద్ధానికి కాలు దువ్వారు. మరోవైపు, అమెరికా చేస్తున్న దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ మంగళవారం విరుచుకుపడింది. ఇజ్రాయెల్‌పై గత రాత్రంతా క్షిపణుల వర్షం కురిపించింది. మంగళవారం వేకువజామున బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించినట్లు ఇరాన్ భద్రతా వర్గాలు వెల్లడించాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి జరిగిన అత్యంత తీవ్రమైన దాడి ఇదేనని తెలిపాయి. అలాగే యూఏఈపై ఇరాన్ జరిపిన దాడులతో ఆ దేశ గగనతలాన్ని తాత్కాలికంగా మూసేయాల్సి వచ్చింది. ఎమిరేట్స్‌లో కీలకమైన ఫుజైరా ఓడరేవులోని చమురు కేంద్రంపై వరుసగా రెండోరోజు కూడా డ్రోన్ దాడి జరిగింది. ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, కువైత్‌తో సహా పొరుగు దేశాలపై ఇరాన్ జరిపిన దాడులు ఆశ్చర్యపరిచాయని ట్రంప్ అన్నారు. పశ్చిమాసియాలోని ఈ దేశాలన్నింటిపైనా ఇరాన్ దాడులు చేస్తుందనుకోలేదని వ్యాఖ్యానించారు. దీనిని ఎవరూ ఊహించలేదని, తాము దిగ్ర్భాంతికి గురయ్యామని చెప్పారు. అయితే నిఘా వర్గాల ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ఆయన మాటలన్నీ ఉత్తవేనని తేలిపోయింది.