చర్చలకు మేం సిద్ధం!
ABN , Publish Date - Mar 04 , 2026 | 04:03 AM
అమెరికా, ఇజ్రాయెల్‌లతో తాము చర్చలకు సిద్ధమని ఇరాన్ ప్రకటించింది. ముందుగా దాడులను నిలిపివేసి, గౌరవప్రదంగా చర్చలు చేపట్టాలని కోరింది...
ఇరాన్ సుప్రీంలీడర్ ప్రత్యేక ప్రతినిధి అబ్దుల్ ఇలాహి వెల్లడి
దుబాయ్, మార్చి 3: అమెరికా, ఇజ్రాయెల్‌లతో తాము చర్చలకు సిద్ధమని ఇరాన్ ప్రకటించింది. ముందుగా దాడులను నిలిపివేసి, గౌరవప్రదంగా చర్చలు చేపట్టాలని కోరింది. ఇరాన్ సుప్రీంలీడర్ ప్రత్యేక ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి ఈ మేరకు ప్రకటన చేశారు. ‘‘మేం యుద్ధాన్ని నిలిపేయడానికి సిద్ధంగా ఉన్నాయం. చర్చలకు సిద్ధంగా ఉన్నాం. అయితే ముందస్తుగా ఇరాన్‌కు బలవంతపు షరతులు విధించకుడా.. గౌరవప్రదంగా చర్చలు జరగాలి. ఎందుకంటే మేం మా హక్కుల కోసం మాత్రమే పోరాడుతున్నాం. భవిష్యత్తులో మాపై దాడి చేయబోమని హామీ ఇవ్వాలి. మాపై ఆంక్షలు ఎత్తివేయాలనేదే మా విజ్ఞప్తి’’ అని పేర్కొన్నారు. ఒకవైపు దాడులు చేస్తూ, మరోవైపు చర్చలకు రావడం సాధ్యం కాదని.. దాడులు ఆపితే చర్చలకు అనువైన పరిస్థితి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ యుద్ధాన్ని ఇరాన్ మొదలుపెట్టలేదని.. అమెరికానే మొదలుపెట్టిందని, ఇప్పుడు వాళ్లే మొదట ఆపాలని పేర్కొన్నారు. దాడులకు ముందు ఒమన్ మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చలు దాదాపు ఒప్పందం స్థాయికి వచ్చాయని.. దీనిపై ఒమన్ విదేశాంగ మంత్రి హర్షం కూడా వ్యక్తం చేశారని గుర్తుచేశారు. కానీ అమెరికా, ఇజ్రాయెల్ ఏకపక్షంగా దాడులకు దిగాయని పేర్కొన్నారు.
మషాద్‌లో ఖమేనీ అంత్యక్రియలు
అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందిన సుప్రీంలీడర్ అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలను పవిత్ర నగరంగా భావించే మషాద్ నగరంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఖమేనీ పుట్టినది కూడా ఇదే నగరంలో కావడం గమనార్హం. అయితే అంత్యక్రియల తేదీని వెల్లడించలేదు