Share News

యుద్ధం రెండో రోజే ఇరాన్‌ ‘తెల్ల జెండా’!

ABN , Publish Date - Mar 06 , 2026 | 04:20 AM

ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా వరుసగా ఇరాన్‌పై భీకర దాడులు సాగిస్తోంది. ఇరాన్‌ కూడా అదే స్థాయిలో ప్రతిఘటిస్తోంది. మాటల యుద్ధాన్ని కూడా .....

యుద్ధం రెండో రోజే ఇరాన్‌ ‘తెల్ల జెండా’!

  • అమెరికాకు కాల్పుల విరమణ ప్రతిపాదన

  • తోసిపుచ్చిన అమెరికా..యుద్ధం తీవ్రతరం

  • ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ కథనం

న్యూఢిల్లీ, మార్చి 5: ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా వరుసగా ఇరాన్‌పై భీకర దాడులు సాగిస్తోంది. ఇరాన్‌ కూడా అదే స్థాయిలో ప్రతిఘటిస్తోంది. మాటల యుద్ధాన్ని కూడా ఇరుపక్షాలూ తీవ్రస్థాయిలోనే కొనసాగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇరాన్‌ ‘తెల్ల జెండా’ చూపిందని, కాల్పుల విరమణ కోసం అమెరికాను అభ్యర్థించిందని వస్తున్న వార్తలు సంచలనంగా మారాయి. యుద్ధానికి స్వస్తి పలకడం గురించి మాట్లాడుకుందామంటూ ఇరాన్‌ నిఘాశాఖ అధికారులు అమెరికా గూఢచార్య సంస్థ సీఐఏను సంప్రదించినట్టు ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ ఒక కథనం ప్రచురించింది. ఇరాన్‌ కోసం ‘మూడో దేశం’ ఈ మేరకు మధ్యవర్తిత్వం నెరిపినట్టు తెలిపింది. గత నెల 28న యుద్ధం మొదలుకాగా, మర్నాడే అమెరికాకు ఇరాన్‌ శాంతి సందేశం పంపినట్టు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ‘ట్రూత్‌ సోషల్‌’లో గత మంగళవారం ఒక పోస్టు పెట్టారు. ఇరాన్‌ నుంచి చర్చల కోసం ప్రతిపాదన వచ్చిందని, అప్పటికే ఆలస్యమైపోయిందని ట్రంప్‌ అన్నా రు. ‘ఇరాన్‌ నాయకత్వంతోపాటు ఆ దేశ రక్షణ, వైమానిక, నావికా వ్యవస్థలు తుడిచిపెట్టుకుపోయాయి. ఆ సమయంలో వారు చర్చలను కోరారు. కానీ, అప్పటికే బాగా ఆలస్యమైంది’ అని ఆయన అప్పట్లో తెలిపారు. తాజా కథనం ఆయన ప్రకటనకు దగ్గరగా ఉండటం గమనార్హం. ఈ కథనం ప్రకారం, ఇరాన్‌ ప్రతిపాదన పట్ల సీఐఏ అధికారులు తటపటాయించారు. యుద్ధం మొదలై ఒక్కరోజే కావడంతో, ఇంత తక్కువ సమయంలో చర్చలు జరపడం సాధ్యమేనా అనే సందేహాన్ని వెలిబుచ్చారు. ఇరాన్‌ అగ్ర నాయకత్వం దాడులకు గురికావడమో, అంతం కావడమో జరుగుతున్న సందర్భం అది. పైగా, ఆ సమయంలో ఇరుపక్షాలూ ‘తగ్గేదే లే’ అన్నట్టు యుద్ధ ప్రకటనలు చేస్తున్నాయి. దీంతో ఇరాన్‌ ప్రతిపాదన వీగిపోయిందని, ఆ తర్వాత నుంచి ఇజ్రాయెల్‌- అమెరికాలపై దాడులను ఇరాన్‌ పెంచేసిందని ఆ కథనం తెలిపింది.

Updated Date - Mar 06 , 2026 | 04:20 AM