‘లిటిల్ ఇండియా’పై ఇరాన్ దాడి!
ABN , Publish Date - Mar 23 , 2026 | 07:27 AM
దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతంలో ‘లిటిల్ ఇండియా’గా పిలిచే డిమోనా నగరంపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. శనివారం ఈ నగరంపై జరిపిన దాడుల్లో 33 మంది గాయపడగా, పలు భవనాలు ధ్వంసమయ్యాయి.
ఇజ్రాయెల్‌లోని డిమోనా నగరాన్ని తాకిన క్షిపణులు
అక్కడి జనాభాలో 30ు భారత సంతతి వారే..
న్యూఢిల్లీ, మార్చి 22: దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతంలో ‘లిటిల్ ఇండియా’గా పిలిచే డిమోనా నగరంపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. శనివారం ఈ నగరంపై జరిపిన దాడుల్లో 33 మంది గాయపడగా, పలు భవనాలు ధ్వంసమయ్యాయి. డిమోనాలో దాదాపు 30శాతం మంది భారత సంతతికి చెందిన వారు ఉండడంతో దాన్ని ‘లిటిల్ ఇండియా’గా పిలుస్తుంటారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఓ కీలక అణు కేంద్రానికి సమీపంలో ఉండే ఈ నగరంలో ప్రస్తుతం దాదాపు 7,500 మంది భారత యూదు కమ్యూనిటీకి చెందిన వారు నివసిస్తున్నారు. వీరంతా 1950-1960 ప్రాంతంలో భారత్ నుంచి ఇజ్రాయెల్‌కు వలస వెళ్లినట్లు టెల్ అవివ్‌లోని భారత రాయబార కార్యాలయ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎక్కువగా మహరాష్ట్ర(బెనె ఇజ్రాయెలీలు) నుంచి వలస వెళ్లగా.. కేరళ (కొచ్చిని యూదులు), కోల్‌కతా (బాగ్దాదీ యూదులు) నుంచి వెళ్లిన వారు కూడా కొంత మంది ఉన్నారు. ఇటీవలి కాలంలోనూ మిజోరం, మణిపూర్ నుంచి కూడా భారతీయ యూదులు ఇజ్రాయెల్‌కు వలస వెళ్లారు. డిమోనాలోని భారత సంతతి వారు మరాఠీ భాషలో అనర్గళంగా మాట్లాడగలుగుతారు. అక్కడక్కడా హిందీ మాటలు కూడా వినిపిస్తుంటాయి. భారత్‌లో అమితంగా ప్రేమించే క్రికెట్ కూడా అత్యధికంగా అభిమానులు ఉన్నారు. దీంతో పాటుగా వారు నడిపే దుకాణాల్లో సోన్‌పాపిడి, గులాబ్ జామున్, పాప్రి చాట్, భేల్‌పూరి వంటి భారతీయ రుచులూ పలకరిస్తాయి. ఇక్కడి భారతీయుల్లో అత్యధికులు వజ్రాల వ్యాపారులుగా, ఐటీ నిపుణులు, వృద్ధుల సంరక్షకులుగా కొనసాగుతున్నారు. డిమోనాలోని భారత సంతతి వారు ఆహారం విషయంలో మాత్రమే కాకుండా.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కూడా పాటిస్తారు. పండుగలను జరుపుకుంటారు.