Share News

ఎఫ్‌-35ను తాకిన ఇరాన్‌ క్షిపణి

ABN , Publish Date - Mar 21 , 2026 | 03:59 AM

ఇరాన్‌పై యుద్ధంలో అమెరికాకు నష్టం పెరిగిపోతోంది. తాజాగా అమెరికా ఐదో తరం స్టెల్త్‌ యుద్ధ విమానం ఎఫ్‌-35ను ఇరాన్‌ క్షిపణి తాకి తీవ్రంగా దెబ్బతిన్నది.

ఎఫ్‌-35ను తాకిన ఇరాన్‌ క్షిపణి

  • అమెరికా అత్యాధునిక స్టెల్త్‌ యుద్ధ విమానాన్ని ఢీకొట్టామని ఇరాన్‌ ప్రకటన

  • ఇప్పటివరకు దెబ్బతిన్న 16 విమానాలు

వాషింగ్టన్‌/ న్యూఢిల్లీ, మార్చి 20: ఇరాన్‌పై యుద్ధంలో అమెరికాకు నష్టం పెరిగిపోతోంది. తాజాగా అమెరికా ఐదో తరం స్టెల్త్‌ యుద్ధ విమానం ఎఫ్‌-35ను ఇరాన్‌ క్షిపణి తాకి తీవ్రంగా దెబ్బతిన్నది. వెంటనే ఆ యుద్ధ విమానాన్ని సమీపంలోని అమెరికా సైనిక స్థావరంలో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. పైలట్‌ క్షేమంగా ఉన్నట్టు అమెరికా అధికారులు ప్రకటించారు. ప్రపంచంలో ప్రస్తుతమున్న సమర్థవంతమైన, శత్రువులకు చిక్కకుండా దూసుకెళ్లగల ఆధునిక యుద్ధ విమానాల్లో ఒకటిగా ఎఫ్‌-35కి పేరుంది. అలాంటిది ఇరాన్‌ క్షిపణి తాకి దెబ్బతినడం చర్చనీయాంశంగా మారింది. ఎఫ్‌-35 ఫైటర్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినదిగా చెబుతున్న వీడియోను ఇరాన్‌ విడుదల చేసింది. ఎఫ్‌-35 ఫైటర్‌ను తొలిసారిగా దెబ్బతీసింది తామేనని ప్రకటించింది. ఇది రాడార్లకు చిక్కని స్టెల్త్‌ ఫైటర్‌ అని పేరున్నా.. ఇరాన్‌ రాడార్‌లో విమానం స్పష్టంగా కనిపించడం గమనార్హం. అయితే ఎంత స్టెల్త్‌ పరిజ్ఞానం ఉన్నా ఫైటర్ల ఇంజన్ల నుంచి వెలువడే మంటల వేడి కారణంగా ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సర్లకు చిక్కే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి అత్యంత అధునాతన వ్యవస్థలు ఎఫ్‌-35 ఫైటర్‌ సొంతం. దాని ఆకారం, వినియోగించిన లోహాలు, ఆయుధాలు బయటికి కనబడకుండా ఉండే ఏర్పాట్లు వంటివాటితో శత్రువుల రాడార్లకు చిక్కదు. ఇక శత్రువులను, లక్ష్యాలను గుర్తించేందుకు రాడార్‌ డేటా, ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సర్లు, శాటిలైట్‌ డేటా, ఇతర విమానాల నుంచి అందే సిగ్నళ్లన్నింటికీ ఏకకాలంలో విశ్లేషించి, క్రోడీకరించి లక్ష్యంపై దాడి చేసే సామర్థ్యం ఉంది. ఒక్కో ఎఫ్‌-35 ఫైటర్‌ ధర రూ.930 కోట్లు ఉంటుందని అంచనా.


మొత్తంగా 16 విమానంకు నష్టం

పశ్చిమాసియాలో ఇప్పటివరకు అమెరికాకు చెందిన 16 ఎయిర్‌క్రా్‌ఫ్టలకు నష్టం జరిగినట్టు బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. కువైట్‌ ఎయిర్‌డిఫెన్స్‌ వ్యవస్థలు పొరపాటుగా మూడు ఎఫ్‌-15ఈ ఫైటర్లను కూల్చివేశాయి. ఇరాక్‌ గగనతలంలో ప్రయాణిస్తున్న ఒక కేసీ-135 ట్యాంకర్‌ విమానాన్ని ఇరాన్‌ అనుకూల ఇస్లామిక్‌ రెసిస్టెన్స్‌ మిలీషియా కూల్చివేసింది. 10 ఎంక్యూ-9 రీపర్‌ డ్రోన్లను కూల్చివేసినట్టు ఇరాన్‌ ప్రకటించింది. మానవ రహిత విమానాలైన ఎంక్యూ-9 రీపర్‌ డ్రోన్‌ ఒక్కోటీ సుమారు రూ.300 కోట్లు ఖరీదైనవి కావడం గమనార్హం. ఇక సౌదీలోని అమెరికా బేస్‌పై జరిగిన ఇరాన్‌ క్షిపణి దాడిలో ఐదు కేసీ-135 ట్యాంకర్‌ విమానాలు ధ్వంసమయ్యాయి. అయితే అక్కడ ఒక విమానం మాత్రమే దెబ్బతిన్నట్టు అమెరికా అధికారులు పేర్కొన్నారు. తాజాగా ఎఫ్‌-35కి నష్టం జరిగింది. అధికారికంగానే ఏడు విమానాలు, 9 డ్రోన్లను నష్టపోయినట్టు బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. ఇక ఇరాక్‌ విమాన ప్రమాదంలో ఆరుగురు, బహ్రెయిన్‌, యూఏఈలలో జరిగిన దాడుల్లో ఏడుగురు కలిపి 13 మంది అమెరికా సైనికులు మృతిచెందారు. కాగా, పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాల్లో అత్యంత విలువైన ఆస్తులను ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్లతో ధ్వంసం చేసింది. ముఖ్యంగా ఖతార్‌లోని అల్‌ ఉదేద్‌ అమెరికా సైనిక స్థావరంలో ఉన్న కీలకమైన ‘ఏఎన్‌/ఎఫ్‌పీఎస్‌-132 ఫేజ్డ్‌ అర్రే రాడార్‌’ వ్యవస్థను, బహ్రెయిన్‌లోని అమెరికా నేవీ ఫిఫ్త్‌ ఫ్లీట్‌ కమాండ్‌ సెంటర్‌ను, రాడార్లను నాశనం చేసింది. యూఏఈ, సౌదీ, కువైట్‌లలోని పలు పేట్రియాట్‌, థాఢ్‌ క్షిపణి రక్షణ వ్యవస్థలనూ ధ్వంసం చేసింది.

రెండు యుద్ధ నౌకలకూ నష్టం

ఇరాన్‌పై దాడి కోసం అమెరికా మోహరించిన రెండు భారీ యుద్ధ విమాన వాహక నౌకలకూ నష్టం జరిగింది. అందులో యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌పై క్షిపణి దాడులు చేసినట్టు ఇరాన్‌ ప్రకటించింది. అయితే, లింకన్‌కు నష్టమేమీ జరగలేదని అమెరికాసెంట్రల్‌ కమాండ్‌ పేర్కొంది. కానీ ఈ ఘటన తర్వాత ఆ నౌక గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌ నుంచి వెనక్కి వెళ్లడం గమనార్హం. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ విమాన వాహక నౌక అయిన యూఎ్‌సఎస్‌ గెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. దానికి కారణంపై స్పష్టత రాకున్నా.. ఆ నౌకను ఎర్ర సముద్ర ప్రాంతం నుంచి తిరిగి అమెరికాకు తరలించారు.

Updated Date - Mar 21 , 2026 | 03:59 AM