Share News

అరబ్‌ దేశాలు అతలాకుతలం!

ABN , Publish Date - Mar 02 , 2026 | 01:15 AM

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు.. ఇరాన్‌ ప్రతిదాడులతో పశ్చిమాసియా దేశాలు దద్దరిల్లుతున్నాయి. తమ దేశ సుప్రీంలీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ హత్యతో ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్‌..

అరబ్‌ దేశాలు అతలాకుతలం!

  • ఇరాన్‌ క్షిపణి దాడులతో ప్రజల్లో తీవ్ర ఆందోళన.. దాడుల వల్ల నష్టం తీవ్రంగా లేకున్నా ఉద్రిక్తంగా పరిస్థితి

  • ఆయా దేశాల్లోని భారతీయుల క్షేమంపై మనదేశంలో ఆందోళన

హైదరాబాద్‌ సిటీ, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు.. ఇరాన్‌ ప్రతిదాడులతో పశ్చిమాసియా దేశాలు దద్దరిల్లుతున్నాయి. తమ దేశ సుప్రీంలీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ హత్యతో ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్‌.. సౌదీ, ఖతార్‌, కువైట్‌, యూఏఈ, ఇరాక్‌, బహ్రెయిన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై విచక్షణా రహితంగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. దాడులు ఆపాలని ఆయా దేశాలతోపాటు అమెరికా, ఇజ్రాయెల్‌ హెచ్చరించినా ఇరాన్‌ వెనక్కు తగ్గటం లేదు. ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్లు జనావాసాలపై కూడా పడుతుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. తమకు సంబంధంలేని యుద్ధాన్ని తమపై రుద్దారని యూఏఈ, ఖతార్‌, సౌదీ తదితర దేశాల ప్రజలు అసహనంతో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

భారతీయుల్లో ఆందోళన

ఈ దేశాల్లో భారతీయులు భారీగా ఉన్నారు. యుద్ధం నేపథ్యంలో అక్కడి తమ బంధుమిత్రుల యోగక్షేమాలపై మనదేశంలో ఉన్న వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందో అన్న భయంతో గడుపుతున్నారు. ఎప్పటికప్పుడు అక్కడి వాళ్ల క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు. ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లిన భారతీయుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు కూడా భారీగా ఉన్నారు. యూఏఈలో 4 లక్షల మంది తెలుగువారున్నారని అంచనా. సౌదీ అరేబియాలో 3.9 లక్షలు, బహ్రెయిన్‌లో 50 వేలు, కువైట్‌లో రెండు లక్షల మంది తెలుగువారు నివసిస్తున్నారు. రంజాన్‌ మాసం కావడంతో వీరిలో కొంతమంది స్వదేశానికి తిరుగు పయనమయ్యారు. అమెరికా, యూరప్‌ తదితర దేశాల నుంచి స్వదేశానికి వస్తూ కనెక్టింగ్‌ ఫ్లైట్స్‌ కోసం దుబాయి, అబుదాబీ, షార్జా తదితర విమానాశ్రయాల్లో కొందరు ఆగిపోయారు. ఈ దేశాల్లో విమాన సర్వీసులన్నీ రద్దు కావటంతో వీరంతా ఆయా చోట్ల చిక్కుకుపోయారు. కువైట్‌లోని తమ బంధువులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని హైదరాబాద్‌లోని పురానా హవేలీకి చెందిన మొహమ్మద్‌ సైఫుద్దీన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. బహ్రెయిన్‌లోని తన తమ్ముడి పరిస్థితి కూడా అలాగే ఉందని చాంద్రాయణగుట్టకు చెందిన షకీల్‌ మొహియుద్దీన్‌ చెప్పారు.

Updated Date - Mar 02 , 2026 | 01:15 AM