యుద్ధరంగంలోకి డ్యాన్సింగ్ మిసైల్
ABN , Publish Date - Mar 17 , 2026 | 03:47 AM
అమెరికా, ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ తన అమ్ముల పొదిలోని మరో అత్యాధునిక ఆయుధాన్ని బయటకు తీసింది.
అత్యాధునిక సెజ్జిల్ క్షిపణిని ప్రయోగించిన ఇరాన్
టెహ్రాన్, మార్చి 16: అమెరికా, ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ తన అమ్ముల పొదిలోని మరో అత్యాధునిక ఆయుధాన్ని బయటకు తీసింది. మూడు వారాలుగా సాగుతున్న భీకర యుద్ధంలో తొలిసారి డ్యాన్సింగ్ మిసైల్‌గా పిలిచే మధ్య శ్రేణి సెజ్జిల్ క్షిపణిని ప్రయోగించింది. దీనిని ఇరాన్ సొంతంగా అభివృద్ధి చేసింది. 2,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఈ క్షిపణి సునాయాసంగా చేధించగలదు. 700 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగల దీని పొడవు 18 మీటర్లు, వ్యాసార్థం 1.25 మీటర్లు, బరువు 23,600 కిలోలు అని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (సీఎ్‌సఐఎస్) వెల్లడించింది. ఈ క్షిపణిని పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ఆదివారం ప్రయోగించినట్లు సమాచారం. ఘన ఇంధనంతో పనిచేసే ఈ క్షిపణి ఆకాశంలో అత్యంత ఎత్తులో ప్రయాణిస్తూ శత్రువు క్షిపణి రక్షణ వ్యవస్థను ఏమార్చి లక్ష్యాన్ని ధ్వంసం చేయగలదు. అందుకే దీనిని డ్యాన్సింగ్ మిసైల్ అని పిలుస్తున్నారు. దీని అసలు పేరు సెజ్జిల్. అషౌరా, అషురా అని కూడా పిలుస్తున్నారు. ఈ క్షిపణి అభివృద్ధి కార్యక్రమాన్ని ఇరాన్ 1990ల్లో ప్రారంభించింది. 2008లో తొలిసారి పరీక్షించగా 700 కిలోమీటర్లు ప్రయాణించింది. 2009లో నిర్వహించిన పలు పరీక్షల్లో 1,900 కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని సీఎ్‌సఐఎస్ వెల్లడించింది.