Share News

సమాచార యుద్ధంలోనూ ఢీ అంటే ఢీ

ABN , Publish Date - Apr 14 , 2026 | 04:31 AM

యుద్ధరంగంలోనే కాదు.. సమాచార యుద్ధరంగంలోనూ అమెరికా, ఇజ్రాయెల్‌లను ఇరాన్‌ దీటుగా తిప్పికొడుతోంది! తాను ప్రచారం చేయాలనుకున్న విషయాలను...

సమాచార యుద్ధంలోనూ ఢీ అంటే ఢీ

  • పాశ్చాత్య మీడియా ప్రచారాలకు దీటుగా ఇరాన్‌ ఇన్ఫర్మేషన్‌ వార్‌

యుద్ధరంగంలోనే కాదు.. సమాచార యుద్ధరంగంలోనూ అమెరికా, ఇజ్రాయెల్‌లను ఇరాన్‌ దీటుగా తిప్పికొడుతోంది! తాను ప్రచారం చేయాలనుకున్న విషయాలను.. వారిని మించిన వేగంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తోంది!! యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28వ తేదీ నుంచే అమెరికా యథావిధిగా సమాచార యుద్ధాన్ని కూడా మొదలుపెట్టింది. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీని చంపేశామని, ప్రధాన లక్ష్యాలన్నింటినీ నాశనం చేశామని.. ఈ యుద్ధంలో గెలిచేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నుంచి అంతా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కానీ, అంతా అమెరికా ఆశించినట్టుగా జరగట్లేదని.. యుద్ధంలో అమెరికా కూడా గట్టిగా దెబ్బతింటోందనే వాస్తవాన్ని ఇరాన్‌ సమర్థంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. ఉదాహరణకు.. అమెరికాకు చెందినఎఫ్‌/ఏ 18 యద్ధవిమానాన్ని ఇరాన్‌ కూల్చివేసిన వీడియో కేవలం 69 నిమిషాల్లో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ అయ్యింది. ఆ వీడియో తొలుత ఇరాన్‌కు చెందిన అనామక ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ అయ్యింది. ఆ తర్వాత ఒక్క నిమిషం వ్యవధిలోనే ఐఆర్‌జీసీ దాన్ని తమ టెలిగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. మరుక్షణమే అన్ని దేశాల్లో ఉన్న ఇరాన్‌ దౌత్యకార్యాలయాలు, వాటి సిబ్బంది ఆ పోస్టును షేర్‌ చేశారు. ఇరాన్‌ ప్రభుత్వ టెలివిజన్‌ ఆ వీడియోను ప్రసారం చేసింది. తర్వాత కొద్దిసేపటికే రష్యా, చైనా ప్రభుత్వాలకుచెందిన ఖాతాలు, అధికారిక మీడియాలు దాన్ని వైరల్‌ చేశాయి. కేవలం పది నిమిషాల వ్యవధిలో ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత.. 2 కోట్ల మంది ఫాలోయర్లున్న రష్యన్‌ అనుకూల ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఒకరు ఆ వీడియోను పోస్ట్‌ చేశాడు. క్షణాల్లో దానికి 20 లక్షల వ్యూస్‌ వచ్చాయి. వేలాది బాట్లు ఆయా పోస్టుల కింద లక్షలాది కామెంట్లు పెట్టాయి. అమెరికా విమానం కూలిపోయినందుకు సంతోషం వ్యక్తం చేస్తే ఎమోజీలు పెట్టాయి. ఇదంతా యాదృచ్ఛికంగా జరిగింది కాదు.. ఇరాన్‌ ప్రభుత్వం రష్యా, చైనా అండతో పకడ్బందీగా జరిపిన సమాచార యుద్ధంలో భాగం. ‘అమెరికా ప్రపంచమంతా అనుకుంటున్నంత బలమైన దేశమేమీ కాదు.. ఆ దేశ యుద్ధవిమానాలను సైతం కూల్చే సత్తా మాకుంది’ అని చెప్పడమే ఇరాన్‌ ఇన్ఫర్మేషన్‌ వార్‌ లక్ష్యం. అమెరికా ప్రభుత్వం దీనిపై స్పందించడానికి.. తమ విమానమేదీ కూలలేదని చెప్పడానికి 69 నిమిషాలు పట్టింది. కానీ.. ఆలోగానే ఈ వార్త ప్రపంచమంతా చుట్టొచ్చింది.


నెట్‌వర్క్‌.. ఏఐ..

సమాచార యుద్ధం చేయడానికి ముందే సిద్ధమైన ఇరాన్‌.. అందుకు బహుళ పొరల వ్యవస్థను ముందే రెడీ చేసి పెట్టుకుంది. తన అధికారిక ఖాతాలతోపాటు.. రష్యా యంత్రాంగాన్ని, కోవర్ట్‌ ఇన్‌ఫ్లూయెన్సర్ల నెట్‌వర్క్‌, బాట్లను ఉపయోగించుకుని తాను చేరవేయాల్సిన సమాచారాన్ని క్షణాల్లో ప్రపంచం మొత్తానికీ చేరేలా ఏర్పాట్లు చేసింది. ఒకవైపు ఇలా సీరియస్‌ పోస్టులు పెడుతూనే.. మరోవైపు కృత్రిమ మేధను ఉపయోగించి వ్యంగ్య చిత్రాలు, వీడియోలు, కార్టూన్లను రూపొందించి వాటిని కూడా ఇరాన్‌ వైరల్‌ చేసింది. ఈ చిత్రాలు, కార్టూన్లు, వీడియోల్లో ఇరాన్‌కు ముడిసరుకు.. ట్రంప్‌, నెతన్యాహులే. ఒక్క చిన్న నిజం చుట్టూ టన్ను అబద్ధాలను పేర్చి.. అన్నీ నిజాలే అన్నట్టుగా ప్రచారం చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. పాశ్చాత్య దేశాల సమాచార యుద్ధరీతినే ఇరాన్‌ అక్షరాలా కాపీ చేసి అమెరికాను కంగు తినిపించిందంటే అతిశయోక్తి కాదు.

- సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - Apr 14 , 2026 | 04:31 AM