Share News

హోర్ముజ్‌లో సైలెంట్‌ హంటర్స్‌!

ABN , Publish Date - Mar 23 , 2026 | 07:24 AM

హోర్ముజ్‌ జలసంధిలో ఇరాన్‌కు చెందిన మినీ జలాంతర్గాములు ప్రధాన ముప్పుగా మారాయి. చిన్నగా ఉండి శబ్ధం తక్కువగా చేసే ఘదీర్‌ సబ్‌మెరైన్లను ‘సైలెంట్‌ హంటర్లు’గా పిలుస్తారు.

హోర్ముజ్‌లో సైలెంట్‌ హంటర్స్‌!

  • జలసంధిలో వణికిస్తున్న ఇరాన్‌ ఘదీర్‌ క్లాస్‌ సబ్‌మెరైన్లు

న్యూఢిల్లీ, మార్చి 22: హోర్ముజ్‌ జలసంధిలో ఇరాన్‌కు చెందిన మినీ జలాంతర్గాములు ప్రధాన ముప్పుగా మారాయి. చిన్నగా ఉండి శబ్ధం తక్కువగా చేసే ఘదీర్‌ సబ్‌మెరైన్లను ‘సైలెంట్‌ హంటర్లు’గా పిలుస్తారు. వీటిని ఇరాన్‌ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ముఖ్యంగా.. పర్షియన్‌ గల్ఫ్‌, హోర్ముజ్‌ జలసంధి వంటి తక్కువ లోతున్న నీళ్లలో మోహరించేందుకు వీలుగా వీటిని తయారు చేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధం వేళ ఇరాన్‌.. ఈ సైలెంట్‌ హంటర్ల ద్వారానే హోర్ముజ్‌ జలసంధిని నియంత్రిస్తోంది. చమురు ట్యాంకర్ల రాకపోకలను అడ్డుకుంటోంది. చిన్నగా ఉండే ఘదీర్‌ తరగతి సబ్‌మెరైన్లను అదృశ్య నౌకాదళంగా భావిస్తుంటారు. ఇవి 29 మీటర్ల పొడవు.. 120 నుంచి 150 టన్నుల బరువు మాత్రమే ఉంటాయి. అంటే ఒక సంప్రదాయ దాడి జలాంతర్గామి పరిమాణంలో ఇది పదో వంతు మాత్రమే ఉంటుంది. చిన్నగా ఉండడం వల్ల 30 మీటర్ల లోతు మాత్రమే ఉన్న నీళ్లలోనూ సులువుగా ప్రయాణించగలదు. శత్రువుల కంటపడకుండా.. వారి నౌకలపై సమర్థవంతంగా దాడి చేయగలదు. అలాగే లోతైన జలాల్లో ప్రయాణించే జలాంతర్గాముల కోసం రూపొందించిన సోనార్‌ వ్యవస్థలకు ఇవి దాదాపు కనిపించవు. నీటి అడుగున నక్కి శత్రు నౌకలు దగ్గరకు వచ్చే వరకు వేచిచూసి టార్పెడోలు, క్షిపణులతో దాడి చేయగలవు. ఇరాన్‌ వద్ద ప్రస్తుతం ఘదీర్‌ తరగతి సబ్‌మెరైన్లు 20 వరకూ ఉండొచ్చని అంచనా.


ప్రాణాంతక ఆయుధాలు..

ఘదీర్‌లో సూపర్‌కావిటేటింగ్‌ టార్పెడోలు ఉంటాయి. ఇవి గంటకు 350 కిలోమీటర్లకుపైగా వేగంతో శత్రు నౌకలకు దొరకకుండా.. అత్యంత వేగంగా దూసుకెళ్లగలవు. ఈ సాంకేతికత వల్ల శుత్రు నౌకలు దీని నుంచి తప్పించుకోవడం అసాధ్యం. అలాగే దీనిలో జాక్‌-2 క్షిపణులు కూడా ఉన్నాయి. ఇవి 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగలవు. తొలి విడతలో రూపొందించిన 23 ఘదీర్‌ జలాంతర్గాముల్లో ప్రస్తుతం 16 వరకూ పనిచేస్తున్నాయని అంచనా.

హోర్ముజ్‌లో ప్రయాణం ప్రమాదకరం..

హోర్ముజ్‌ మార్గంలో ఘదీర్‌ జలాంతర్గాములు చాలా ప్రమాదకరమని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ నౌకా మార్గంలో రాత్రిపూట ఇది రహస్యంగా 4 నుంచి 8 నౌకా మందుపాతరలు అమర్చగలదు. వాటిని గుర్తించి, నిర్మూలించడం చాలా కష్టం. ఘదీర్‌ సబ్‌మెరైన్లను ఇరాన్‌ ఒక నిశ్శబ్ధ నీటి ఆయుధంగా భావిస్తుంది. వీటివల్ల హోర్ముజ్‌ జలసంధిలో ప్రస్తుతం అమెరికా నౌకలకు ముప్పు పొంచి ఉంది. ఈ సబ్‌మెరైన్లను పర్యవేక్షించడానికి అమెరికా తన ఏ-10 విమానాలు, అపాచీ హెలికాప్టర్లను రంగంలోకి దింపాల్సి ఉంటుంది.

Updated Date - Mar 23 , 2026 | 07:25 AM