మళ్లీ పాక్‌కు ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ
ABN , Publish Date - Apr 27 , 2026 | 04:16 AM
ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ ఆదివారం సాయంత్రం మళ్లీ పాకిస్థాన్‌కు వచ్చారు. వాస్తవానికి అమెరికాతో శాంతి చర్చల కోసం ఆయన శుక్రవారమే పాకిస్థాన్ వచ్చారు.
ఇస్లామాబాద్, ఏప్రిల్ 26: ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ ఆదివారం సాయంత్రం మళ్లీ పాకిస్థాన్‌కు వచ్చారు. వాస్తవానికి అమెరికాతో శాంతి చర్చల కోసం ఆయన శుక్రవారమే పాకిస్థాన్ వచ్చారు. యుద్ధ విరమణపై పాకిస్థాన్ ప్రతినిధులతో చర్చించారు. అయితే, చర్చల కోసం అమెరికా ప్రతినిధులు పాకిస్థాన్‌కు చేరుకోకముందే ఆయన తిరిగి ఇరాన్ వెళ్లిపోయారు. కానీ, మూడు రోజుల వ్యవధిలోనే మళ్లీ ఆయన పాకిస్థాన్‌కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఇక్కడికి రావడానికి ముందు అరాగ్చీ ఒమన్‌కు వెళ్లి.. హోర్ముజ్‌లో భద్రత, అమెరికాతో యుద్ధాన్ని ముగించే అంశంపై సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ అల్ సయీద్‌తో చర్చలు జరిపినట్లు డాన్ పత్రిక పేర్కొంది. ఇక ఇస్లామాబాద్‌లో స్వల్ప పర్యటనలో భాగంగా పలువురు పాకిస్థాన్ సీనియర్ అధికారులను అరాగ్చీ కలుసుకోనున్నట్లు, అనంతరం మాస్కోకు వెళ్లనున్నట్లు ఆ పత్రిక తెలిపింది. అరాగ్చీ పాక్ పర్యటనను ఇరాన్ అధికారిక మీడియా కూడా ధ్రువీకరించింది. కానీ, పాకిస్థాన్ అధికారులు మాత్రం దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు.