Share News

అమెరికా నిఘా ఆయువుపట్టుపై దాడి

ABN , Publish Date - Mar 05 , 2026 | 05:30 AM

అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులతో కకావికలం అవుతున్న ఇరాన్‌.. ఒక్క క్షిపణితో అమెరికా నిఘా ఆయువుపట్టును దెబ్బతీసింది. ఖతార్‌లోని అల్‌ ఉదేద్‌ అమెరికా సైనిక స్థావరంలో ........

అమెరికా నిఘా ఆయువుపట్టుపై దాడి

  • ఖతార్‌ అల్‌ ఉదేద్‌ ఎయిర్‌బేస్‌లోని రాడార్‌ వ్యవస్థ ధ్వంసం

  • వివిధ సైనిక విభాగాల మధ్య సమన్వయంపై తీవ్ర ప్రభావం

  • హోర్ముజ్‌లో వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించలేమన్న అమెరికా

దుబాయ్‌, మార్చి 4: అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులతో కకావికలం అవుతున్న ఇరాన్‌.. ఒక్క క్షిపణితో అమెరికా నిఘా ఆయువుపట్టును దెబ్బతీసింది. ఖతార్‌లోని అల్‌ ఉదేద్‌ అమెరికా సైనిక స్థావరంలో ఉన్న కీలకమైన ‘ఏఎన్‌/ఎఫ్‌పీఎస్-132 ఫేజ్డ్‌ అర్రే రాడార్‌’ వ్యవస్థను బుధవారం ధ్వంసం చేసింది. ఇది అమెరికాకు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఇరాన్‌ ఒకే సమయంలో ప్రయోగించిన రెండు క్షిపణుల్లో ఒకదానిని రక్షణ వ్యవస్థ అడ్డుకుందని, కానీ రెండో క్షిపణి మాత్రం రాడార్‌ వ్యవస్థను ఢీకొని పేలుళ్లు సృష్టించిందని ఖతార్‌ రక్షణ శాఖ వెల్లడించింది. అమెరికా లక్షల కోట్ల వ్యయంతో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రాడార్‌, నిఘా వ్యవస్థలను అనుసంధానం చేసి.. వాటన్నింటి సమాచారాన్ని విశ్లేషించి, వివిధ సైనిక విభాగాలకు అందించేలా అమెరికా అల్‌ ఉదేద్‌ స్థావరంలో రూ.10,130 కోట్ల (1.1 బిలియన్‌ డాలర్లు)తో ఫేజ్డ్‌ అర్రే రాడార్‌ను ఏర్పాటు చేసింది. అందుకే ఈ రాడార్‌ వ్యవస్థను అమెరికా నిఘాకు నాడీ మండలం’గా అభివర్ణిస్తారు. ఇప్పుడీ వ్యవస్థ దెబ్బతినడంతో గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా పేట్రియాట్‌, థాడ్‌ క్షిపణి రక్షణ వ్యవస్థలు పాక్షికంగా అంధకారం (పార్షియల్లీ బ్లైండ్‌)కి వెళ్లిపోయినట్టేనని నిపుణులు చెబుతున్నారు. దీనికితోడు ఇప్పటికే బహ్రెయిన్‌లోని అమెరికా నావికాదళ స్థావరంలో కమాండ్‌ సెంటర్‌ను ఇరాన్‌ డ్రోన్లు ధ్వంసం చేశాయి. ఈ పరిణామాలతో వివిధ సైనిక విభాగాల మధ్య సమన్వయంపై ప్రభావం పడుతుందని అంటున్నారు. ఇప్పటికే హోర్ముజ్‌ జలసంధిలో అమెరికా నేవీపై ప్రభావం పడిందని వివరిస్తున్నారు. ఇరాన్‌ డ్రోన్‌ దాడులను అడ్డుకుని వాణిజ్య నౌకలను హోర్ముజ్‌ జలసంధి దాటిస్తామని తొలుత ప్రకటించిన అమెరికా నేవీ.. తాజాగా తాము రక్షణ కల్పించలేమని ప్రకటించిందని గుర్తుచేస్తున్నారు.

Updated Date - Mar 05 , 2026 | 05:30 AM