హోర్ముజ్‌లో సురక్షిత ప్రయాణానికి కప్పం
ABN , Publish Date - Mar 21 , 2026 | 03:47 AM
హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకలు సురక్షిత ప్రయాణం సాగించేందుకు ఇరాన్ భారీగా సొమ్ము కట్టించుకుంటోంది. ఓ ప్రైవేటు ఆయిల్ ట్యాంకర్ కంపెనీ నుంచి 20 లక్షల డాలర్లు వసూలు చేసిందని లాయిడ్స్ ...
దుబాయ్, మార్చి 20: హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకలు సురక్షిత ప్రయాణం సాగించేందుకు ఇరాన్ భారీగా సొమ్ము కట్టించుకుంటోంది. ఓ ప్రైవేటు ఆయిల్ ట్యాంకర్ కంపెనీ నుంచి 20 లక్షల డాలర్లు వసూలు చేసిందని లాయిడ్స్ లిస్ట్ అనే మారిటైమ్ వార్తా సంస్థ నివేదించింది. మరోవైపు హోర్ముజ్ జలసంధిలోని తన ప్రాదేశిక జలాల గుండా ఇరాన్ ఒక ‘సురక్షిత’ షిప్పింగ్ కారిడార్‌ను ఏర్పాటు చేసిందని, ఇందులో భాగంగా ఎంపిక చేసిన, పరిశీలన చేసిన నౌకలకు ప్రయాణ సౌకర్యం కల్పిస్తోందని పేర్కొంది. ‘ఆమోదం’ పొందిన నౌకల సురక్షిత ప్రయాణానికి ఐఆర్‌జీసీ అధికారులు కొత్తగా షిప్ రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టారని తెలిపింది. షిప్పింగ్ ఆపరేటర్లు క్లియరెన్స్ కోసం నౌక యాజమాన్యం, సరుకు, గమ్యస్థానం వంటి వివరాలను మధ్యవర్తుల ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ఇరాన్ అధికారుల నుంచి అనుమతి పొందిన నౌకలకు మాత్రమే ఈ కారిడార్‌ను ఉపయోగించుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఇరాన్ లారక్ దీవీకి సమీపంగా ఉండే ఈ కారిడార్‌ను ఇప్పటికే తొమ్మిది నౌకలు ఉపయోగించుకోగా, వాటిల్లో భారత్‌కు చెందిన మూడు గ్యాస్ ట్యాంకర్లు ఉన్నాయి. చాలా వరకు ఆమోదాలను దౌత్యపరమైన సమన్వయంతో ఇరాన్ అధికారులు మంజూరు చేస్తున్నారు. కాగా, హోర్ముజ్ గుండా వెళ్లే నౌకలపై రవాణా రుసుములు విధించే బిల్లును ఇరాన్ పార్లమెంట్ పరిశీలిస్తోందని చట్టసభ సభ్యుడొకరు గురువారం తెలిపారు.