అమెరికా స్థావరాలకు రూ.7,500 కోట్ల నష్టం
ABN , Publish Date - Mar 24 , 2026 | 04:52 AM
యుద్ధం మొదలైన రెండు వారాల్లోనే పశ్చిమాసియాలోని అమెరికా మిలిటరీ స్థావరాలపై ఇరాన్ జరిపిన వైమానిక దాడుల్లో అమెరికాకు సుమారు రూ.7,500 కోట్ల(800 మిలియన్ డాలర్లు) నష్టం వాటిల్లింది.
న్యూఢిల్లీ, మార్చి 23: యుద్ధం మొదలైన రెండు వారాల్లోనే పశ్చిమాసియాలోని అమెరికా మిలిటరీ స్థావరాలపై ఇరాన్ జరిపిన వైమానిక దాడుల్లో అమెరికాకు సుమారు రూ.7,500 కోట్ల(800 మిలియన్ డాలర్లు) నష్టం వాటిల్లింది. అమెరికాకు చెందిన మేధోమథన సంస్థ సీఎస్ఐఎస్(సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్) తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించినట్టు బ్రిటన్‌కు చెందిన ఒక వార్తా సంస్థ తెలిపింది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా ఆస్తులపై ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. అయితే, ఈ దాడుల వల్ల అమెరికాకు వాటిల్లిన ఆస్తి నష్టాన్ని తక్కువగా చూపిస్తున్నారని సీఎ్‌సఐఎస్ ప్రతినిధి మార్క్ కాన్సియన్ తెలిపారు. జోర్డాన్, యూఏఈ, ఇతర గల్ఫ్ దేశాల్లోని అమెరికా గగనతల రక్షణ వ్యవస్థలు, ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థలే లక్ష్యంగా ఇరాన్ దాడులు జరుపుతోంది. జోర్డాన్‌లోని ఓ అమెరికా వైమానిక స్థావరంలో అమర్చిన థాడ్(అధిక ఎత్తైన రాడార్ రక్షణ వ్యవస్థ)కు భారీగా నష్టం వాటిల్లింది. దీని విలువే సుమారు రూ.4,536 కోట్లు(485 మిలియన్ డాలర్లు) ఉంటుందని సీఎ్‌సఐఎస్ తెలిపింది. అలాగే, పశ్చిమాసియాలో అమెరికాకు చెందిన ఇతర వైమానిక స్థావరాలు, మౌలిక సదుపాయాలు, భవనాలకు వాటిల్లిన నష్టం విలువ సుమారు రూ.2,900 కోట్లు(310 మిలియన్ డాలర్లు)గా సీఎ్‌సఐఎస్ విశ్లేషించింది. కువైత్‌లోని అలీ అల్-సలీం స్థావరం, ఖతార్‌లోని అల్ ఉదీద్ స్థావరం, సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ స్థావరంలపై దాడులు జరిగినట్టు ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయని తెలిపింది. అలాగే యుద్ధంలో ఇప్పటివరకు 13 మంది అమెరికా సైనికులు చనిపోయినట్లు తెలిపింది.