బహ్రెయిన్‌పై ఇరాన్ భీకర దాడి
ABN , Publish Date - Nov 16 , 2026 | 02:57 AM
గల్ఫ్ దేశం బహ్రెయిన్ ఆదివారం పేలుళ్లతో దద్దరిల్లింది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించే ఒప్పందంపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో..
అమెరికా వైమానిక, రక్షణ రేడార్ లక్ష్యంగానే..
మూడు రోజుల వ్యవధిలో ఇది రెండో దాడి
ఇరాన్ వద్ద ఇంకా 2,500 క్షిపణులు
అమెరికా నిఘా సంస్థల అంచనా
న్యూఢిల్లీ, నవంబరు 15: గల్ఫ్ దేశం బహ్రెయిన్ ఆదివారం పేలుళ్లతో దద్దరిల్లింది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించే ఒప్పందంపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో.. బహ్రెయిన్‌లోని అల్-రిఫా హెలికాప్టర్ స్థావరం వద్ద ఉన్న అమెరికా వైమానిక రక్షణ రేడార్ లక్ష్యంగా దాడి చేసినట్టు టెహ్రాన్ పేర్కొంది. దీనిపై ఆరు డ్రోన్లతో దాడి చేసినట్టు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) తెలిపిందని ఇరాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రెస్ టీవీ తెలిపింది. మూడు రోజుల వ్యవధిలో బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఇలా దాడి చేయడం ఇది రెండోసారి. కాగా, బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ వైమానిక దాడులను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకుని ధ్వంసం చేశాయని బహ్రెయిన్ ప్రకటించింది. ఈ దాడుల నేపథ్యంలో ప్రజలు ఎత్తయిన ప్రదేశాలను వదిలి వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరికలు జారీచేసినట్టు తెలిపింది. కాగా, అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై వైమానిక దాడులు ప్రారంభించి తొమ్మిది నెలలవుతోంది. ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలపై అమెరికా-ఇజ్రాయెల్ నెలల తరబడి విడతలవారీగా దాడులు చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఇరాన్ వద్ద ఇంకా 1,500 నుంచి 2,500 క్షిపణుల వరకూ ఉన్నాయని అమెరికా నిఘా సంస్థలు భావిస్తున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ఆధారంగా ఈ అంచనా వేశాయి. అయితే భూగర్భ స్థావరాల్లో నిల్వ ఉంచిన, ప్రయోగానికి సిద్ధంగా ఉన్న క్షిపణుల సంఖ్యను గుర్తించడం కష్టం కాబట్టి.. ఈ అంచనాలపై పూర్తి స్పష్టత రాలేదని అమెరికా అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ సైనిక అధికారులు కూడా ఇరాన్ వద్ద 1,500 కంటే ఎక్కువ బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇరాన్ సైనిక శక్తి దాదాపు నాశనమైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇతర అధికారులు చేసిన ప్రకటనలకు, అమెరికా నిఘా వర్గాల నివేదిక పూర్తి విరుద్ధంగా ఉంది.
హోర్ముజ్‌లో 20 లక్షల బ్యారెళ్ల చమురు సముద్రం పాలు
ప్రపంచ నౌకయానానికి కీలకమైన హోర్ముజ్ జలసంధిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సముద్ర మందుపాతర తగిలి 20 లక్షల బ్యారెళ్ల చమురును రవాణా చేస్తున్న భారీ నౌక సముద్రంలో మునిగిపోయిందని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్‌జీసీ) ఆదివారం ప్రకటించింది. హోర్ముజ్ జలసంధి దక్షిణ భాగంలోని అనధికార మార్గంలో ప్రయాణిస్తున్న రెండు చమురు రవాణా నౌకలు మందుపాతరలను ఢీకొట్టాయని, దీంతో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయని ఐఆర్‌జీసీ పేర్కొంది. ఆ రెండు నౌకల్లో ఒకదాంట్లో 20 లక్షల బ్యారెళ్ల చమురు ఉందని వెల్లడించింది.