Share News

అమెజాన్‌పై దాడి

ABN , Publish Date - Apr 02 , 2026 | 02:41 AM

అన్నట్టుగానే అమెరికా టెక్‌ కంపెనీలు, అమెరికన్‌ కంపెనీల భాగస్వామ్యమున్న గల్ఫ్‌ సంస్థలపై ఇరాన్‌ దాడులకు దిగింది. బుధవారం బహ్రెయిన్‌లోని అమెజాన్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ డేటా సెంటర్‌పైకి క్షిపణులు....

అమెజాన్‌పై దాడి

  • అన్నంతపనీ చేసిన ఇరాన్‌.. అమెరికన్‌ టెక్‌ కంపెనీ లక్ష్యంగా క్షిపణులు

  • బహ్రెయిన్‌లో డేటా సెంటర్‌ ధ్వంసం

  • మస్క్‌ ‘స్టార్‌ లింక్‌’నూ టార్గెట్‌ చేస్తామని హెచ్చరిక

  • గల్ఫ్‌లోని వివిధ ప్రాంతాలపైనా దాడులు

  • ఖతార్‌ తీరంలో చమురు ట్యాంకర్‌కు నిప్పు

  • కువైట్‌ విమానాశ్రయంలో అంటుకున్న ఇంధన ట్యాంకులు.. ఇజ్రాయెల్‌పైనా దాడులు

  • ఇరాన్‌, లెబనాన్‌పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌

  • ఇస్ఫహాన్‌ విమానాశ్రయంలో విధ్వంసం

  • త్వరలో యుద్ధంలోకి సౌదీ, యూఏఈ!

దుబాయ్‌/వాషింగ్టన్‌/న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1: అన్నట్టుగానే అమెరికా టెక్‌ కంపెనీలు, అమెరికన్‌ కంపెనీల భాగస్వామ్యమున్న గల్ఫ్‌ సంస్థలపై ఇరాన్‌ దాడులకు దిగింది. బుధవారం బహ్రెయిన్‌లోని అమెజాన్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ డేటా సెంటర్‌పైకి క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. భారీ పేలుళ్లతో డేటా సెంటర్‌కు మంటలు అంటుకున్నాయి. దీనితో ఈ సెంటర్‌ వేదికగా అందుతున్న అమెజాన్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవలు నిలిచిపోయాయి. అయితే ఏ స్థాయిలో నష్టం జరిగింది, సిబ్బంది ఎవరైనా గాయపడ్డారా అన్న వివరాలు బయటికి రాలేదు. గూగుల్‌, యాపిల్‌ సహా అమెరికా టెక్‌ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటామని.. వాటిలోని ఉద్యోగులు వెంటనే ఆఫీసులను వదిలి వెళ్లిపోవాలని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) హెచ్చరించిన మరునాడే ఈ దాడి జరగడం గమనార్హం. ఇంతకుముందు కూడా బహ్రెయిన్‌లోని అమెజాన్‌ డేటా సెంటర్‌పై ఇరాన్‌ డ్రోన్‌ దాడి చేసింది. దుబాయ్‌లోని ఫైనాన్షియల్‌ సెంటర్‌పై దాడుల నేపథ్యంలో.. సిటీ బ్యాంకు సహా పలు ఆర్థిక సేవల సంస్థలు తమ కార్యాలయాలు మూసివేయడం గమనార్హం. ఖతార్‌ తీరానికి సమీపంలోని ఒక చమురు ట్యాంకర్‌పై ఇరాన్‌ క్షిపణి దాడులు చేసింది. దీనితో నౌకలో భారీగా మంటలు చెలరేగాయి. అది ఖతార్‌ ఎనర్జీ సంస్థ లీజుకు తీసుకున్న ట్యాంకర్‌ అని, అందులోని 21 మంది సిబ్బందిని కాపాడామని ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది. అయితే అది ఇజ్రాయెల్‌కు చెందిన ‘ఆక్వా 1’ చమురు నౌక అని, పక్కా సమాచారంతో దాడి చేశామని ఐఆర్‌జీసీ తెలిపింది. నిండా చమురుతో ఉన్న కువైట్‌ ట్యాంకర్‌ నౌకపై దాడి జరిగిన మరునాడే ఇది జరగడం గమనార్హం.


కువైట్‌ విమానాశ్రయంలో మంటలు

ఇరాన్‌ డ్రోన్‌ దాడులతో కువైట్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంధన ట్యాంకులకు మంటలు అంటుకున్నాయి. భారీగా పొగలు వెలువడ్డాయి. విమానాశ్రయంపై ఇలా దాడులు జరగడం వారంలో ఇది రెండోసారి. ఇక యూఏఈలోని ఫుజైరాలో క్షిపణి శకలాలు పడి ఒకరు మృతిచెందారు.

ఇజ్రాయెల్‌లోని బెన్‌గురియన్‌ విమానాశ్రయంలో అమెరికా ట్యాంకర్‌ విమానంపై దాడి చేశామని ఐఆర్‌జీసీ తెలిపింది. ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌, జేరుసలేం, సెంట్రల్‌ ఇజ్రాయెల్‌ తదితర ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఇరాన్‌, హెజ్బొల్లా దాడుల్లో ఇప్పటివరకు 6,286 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్‌ ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. తాము పలు క్షిపణులను దక్షిణ ఇజ్రాయెల్‌ వైపు ప్రయోగించామని హౌతీలు ప్రకటించారు.

విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌..

లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు ఉధృతంగా కొనసాగుతున్నాయి. లెబనాన్‌ దక్షిణ ప్రాంతంలో తీవ్ర విధ్వంసం జరుగుతోంది. ఇప్పటివరకు 1,318 మంది మరణించారు. ఇరాన్‌కు మద్దతుగా లెబనాన్‌లోని హెజ్బొల్లా సంస్థ ఇజ్రాయెల్‌పైకి వరుసగా రాకెట్‌ దాడులు చేస్తోంది. ఈ క్రమంలో హెజ్బొల్లా చీఫ్‌ నయీమ్‌ ఖసీమ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఇరాన్‌ నూతన సుప్రీంలీడర్‌ మొజ్తాబా ఖమేనీ పేరిట ప్రకటన విడుదలైంది.

  • ఇరాన్‌లోని టెహ్రాన్‌, ఇస్ఫహాన్‌, తబ్రిజ్‌, అహ్వాజ్‌, షిరాజ్‌, బందర్‌ అబ్బాస్‌, కరజ్‌నగరాలపై అమెరికా, ఇజ్రాయెల్‌ బాంబులు కురిపించాయి. ఇస్ఫహాన్‌లోని విమానాశ్రయం ధ్వంసమైంది.

  • ఇరాన్‌లో ఇప్పటివరకు 800 వైమానిక దాడులు చేశామని.. బాంబులు, డ్రోన్లు, క్షిపణులు కలిపి సుమారు 16 వేలకుపైగా పేలుళ్లు సృష్టించామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. సుమారు 2 వేల మంది ఇరాన్‌ సైనికులు తమ దాడుల్లో మృతిచెందారని తెలిపింది.

  • ఇరాన్‌లోని టోఫిగ్‌ ఫార్మా పరిశ్రమపై ఇజ్రాయెల్‌ దాడిచేసి ధ్వంసం చేసింది. ఆ పరిశ్రమలో నిషేధిత ఫెంటానిల్‌ మాదకద్రవ్యాన్ని తయారు చేస్తుండటంతో దాడి చేశామని పేర్కొంది.


యూర్‌పకు ‘హోర్ముజ్‌’ దెబ్బ: ఐఈఏ

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హోర్ముజ్‌ జలసంధి మూసివేత ప్రభావం చాలా తీవ్రస్థాయికి చేరుతోందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) హెచ్చరించింది. ముఖ్యంగా యూరప్‌ దీని ప్రభావాన్ని భారీగా ఎదుర్కోబోతోందని పేర్కొంది. ప్రస్తుతం చమురు రవాణాలో లోటు రోజుకు 1.2 కోట్ల బ్యారెళ్లకు చేరుకుందని ఐఈఏ చీఫ్‌ ఫతీ బిరోల్‌ తెలిపారు. 40 కీలక ఇంధన వ్యవస్థలు దెబ్బతిన్నాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా విమాన ఇంధనం (జెట్‌ ఫ్యూయల్‌), డీజిల్‌కు కొరత తలెత్తుతోందని వెల్లడించారు.

మస్క్‌ ‘స్టార్‌ లింక్‌‘నూ టార్గెట్‌ చేస్తాం

అక్రమంగా ఇంటర్నెట్‌ అందిస్తున్న ఎలాన్‌ మస్క్‌ కంపెనీ ‘స్టార్‌ లింక్‌‘నూ లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్‌ హెచ్చరించింది. ఇరాన్‌లోకి స్మగుల్‌ చేసిన స్టార్‌ లింక్‌ కిట్ల సాయంతో.. అమెరికా, ఇజ్రాయెల్‌ ఉగ్రవాదులు కీలక సమాచారాన్ని బయటికి చేరవేస్తున్నారని మండిపడింది. అదే సమయంలో బహ్రెయిన్‌, కువైట్‌, యూఏఈలలో స్టార్‌ లింక్‌ సాయంతో ఇరాన్‌పై దాడులకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించింది. ఈ మేరకు పశ్చిమాసియా ప్రాంతంలో స్టార్‌లింక్‌ సేవలకు సంబంధించిన ఇన్ఫోగ్రాఫిక్‌తో ఫార్స్‌ న్యూస్‌ ఏజెన్సీ కథనం ప్రచురించింది. అత్యాధునిక సాంకేతికత సహాయంలో ఇరాన్‌లో స్టార్‌ లింక్‌ కిట్లను వినియోగిస్తున్నవారిని గుర్తించి, అరెస్టు చేశారని వెల్లడించింది.

యుద్ధంలోకి సౌదీ, యూఏఈ!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనిపించకపోవడం, ఇరాన్‌ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా దాడులు చేస్తున్న నేపథ్యంలో.. సౌదీ అరేబియా, యూఏఈ కూడా యుద్ధం రంగంలోకి దిగనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా తమ దేశాల్లోని కీల క చమురు వ్యవస్థలపై, మౌలికసదుపాయాలపై ఇరాన్‌ దాడులు, హోర్ముజ్‌ జలసంధి మూసివేతతో ఇబ్బందుల నేపథ్యంలో ఈ ఆలోచనకు వచ్చాయి. గల్ఫ్‌ దేశాలు, ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ ఉన్నతాధికారులను ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ దీనిపై కథనం ప్రచురించింది. హోర్ముజ్‌ జలసంధి రక్షణ, ఇరాన్‌ పెట్టిన సముద్రపు మందుపాతర (సీమైన్స్‌)ను తొలగించడం కోసం సైనికపరంగా జోక్యం చేసుకోవాలని భావిస్తున్నట్టుగా యూఏఈ అధికారులు వెల్లడించారని పేర్కొంది.

Updated Date - Apr 02 , 2026 | 02:41 AM