ఇరాన్ మధ్యంతర సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలీరేజా అరాఫీ
ABN , Publish Date - Mar 02 , 2026 | 02:20 AM
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోవడంతో మధ్యంతర సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలీరేజా అరాఫీ...
టెహ్రాన్: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోవడంతో మధ్యంతర సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలీరేజా అరాఫీ వ్యవహరించనున్నారు. ఇరాన్ పాలనా పగ్గాలు ముగ్గురు సభ్యుల గార్డియన్ కౌన్సిల్‌కు చేరాయి. వీరిలో ఇరాన్ దేశాధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, చీఫ్ జస్టిస్ గొలామ్ హొసేన్‌తో పాటు అయతుల్లా అలీరేజా అరాఫీ ఉన్నారు. 67 సంవత్సరాల అరాఫీ ఇరాన్ ఇస్లామిక్ సెమినరీల జాతీయ నెట్‌వర్క్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు. అంతేకాదు సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే 88 మంది సభ్యుల(మత గురువులు) అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ బృందంలో కూడా ఉన్నారు. అయతుల్లా అనేది షియా ముస్లింలకు ఇచ్చే గౌరవప్రదమైన బిరుదు. అయతుల్లా అంటే దేవుడి సంకేతం అని ఆర్థం. అయతుల్లా అనే బిరుదు లభించాలంటే ఇరాన్‌లోని కోమ్ లేదా ఇరాక్‌లోని నజాఫ్ వంటి ప్రసిద్ధ ఇస్లామిక్ విద్యాకేంద్రాలలో దశాబ్దాల పాటు చదువుకోవాలి. వీరు ఖురాన్, ప్రవక్త బోధనలు, తర్క శాస్త్రం, ఇస్లామిక్ తత్వ శాస్త్రంలో అపారమైన పాండిత్యం కలిగి ఉంటారు. ఈ బిరుదును ఏ ప్రభుత్వమో లేదా సంస్థో అధికారికంగా ప్రకటించదు. ఆ మత పండితుడికి ఉన్న జ్ఞానం, రచనలతో పాటు ఇతర సీనియర్ మత గురువుల (సీనియర్ అయతుల్లాలు) ఆమోదంతో సహజంగానే ఈ గుర్తింపు లభిస్తుంది. కాగా, సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే 88 మంది సభ్యులను 8 ఏళ్లకు ఒకసారి ఓటువేసి ఎన్నుకుంటారు.